కల్నల్ సంతోష్‌కు మహావీర్ చక్ర
తెలంగాణ ముద్దుబిడ్డ, గల్వాన్ లోయలో చైనా సైన్యానికి ఎదురొడ్డి పోరాడి వీరమరణం చెందిన కర్నల్ సంతోష్ బాబుకు అత్యున్నత సైనిక పురస్కారాలలో రెండవదైన మహావీరచక్రను కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

గత ఏడాది జూన్ 15వ తేదీన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు అమరుడయ్యారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలచింది. ఆయన కుటుంబానికి ఐదుకోట్ల రూపాయల నగదు, హైదరాబాద్ లో 711 చదరపు గజాల ఇంటిస్థలంతోపాటు సంతోష్ బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం కూడా ఇచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి, సహాయాన్ని అందించారు. ప్రస్తుతం సంతోష్ బాబు సతీమణి సంతోషి యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
గుస్సాడి రాజుకు పద్మశ్రీ
గుస్సాడీ రాజుగా ఆదివాసీల మదిలో నిలచిన కనకరాజుకు కేంద్రప్రభుత్వం 2021 సంవత్సరానికి కళారంగంలో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెలంగాణ నుంచి ఈ ఏడాది ఈయన ఒక్కడికే ఈ అవార్డు లభించింది. తెలంగాణాలో గుస్సాడీ గోండుల జీవితంలో విడదీయలేని నృత్యం. నెమలి పురివిప్పి ఆడినట్టుగా ఆదివాసీలు లయబద్ధంగా ఆడే ఆట గుస్సాడి. కుమ్రంభీమ్ జిల్లా జైనూరు మండలం మర్లవాయికి చెందిన కనకరాజు గుస్సాడీకి కొత్త భంగిమలు నేర్పిన కళాకారుడు. ఇందిరా గాంధీ, అబ్దుల్ కలాం వంటి దేశప్రముఖుల సమక్షంలో గజ్జెకట్టి గుస్సాడీ ప్రదర్శన లిచ్చి మెప్పుపొందాడు. ఆయన వందలాదిమంది ఆదివాసీలకు ఈ నృత్యం నేర్పారు. 80 ఏళ్ళ వయసులోనూ గుస్సాడీ కళను ప్రపంచానికి చాటిచెప్పేందుకు కృషిచేస్తున్నారు.
రాష్ట్రానికి పోలీసు పతకాలు
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు, జైళ్ళు, అగ్నిమాపక శాఖల్లోని పలువురికి కేంద్రప్రభుత్వం పలు పతకాలు ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకానికి పోలీసు శాఖ నుంచి రాష్ట్రానికి చెందిన ఇద్దరు, విశిష్టసేవా పతకానికి 12 మంది ఎంపికయ్యారు. అలాగే, జైళ్ళ శాఖ నుంచి ముగ్గురు, అగ్నిమాపక శాఖ నుంచి ఇద్దరు విశిష్టసేవా పతకాలను పొందారు. హైదరాబాద్ అదనపు కమిషనర్ (నేరాలు) షికా గోయల్, నిజామాబాద్ ఐ.జి శివశంకర్ రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం లభించాయి.
విశిష్ట సేవా పతకాలు పొందిన అధికారులలో రాజేష్ కుమార్, ఐ.డి (కౌంటర్ ఇంటిలిజెంట్ సెల్), షరీఫుద్దీన్ సిద్ధిఖీ మహ్మద్, ఇంచార్జి డీఐజి (టిఎస్ ఎస్పీ), కందుకూరి నర్సింగ్ రావు, డీఎస్పీ (నిర్మల్), సోమగాని సూర్యనారాయణ, డిఎస్పీ (ఏసిబి రంగారెడ్డి), తన్నీరు గోవర్ధన్, ఏసిపి (హైదరాబాద్ సిపి కార్యాలయం), గుంజ రమేశ్, డిప్యూటీ అసాల్ట్ కమాండర్ (గ్రేహౌడ్స్), ఎం.ఉద్ధవ్, పీసీ (18వ బెటాలియన్-మంచీరియాల), బ్రుంగి గోవర్ధన్, ఎస్సై (ఇంటిలిజెన్స్), కొత్తపల్లి కరుణాకర రెడ్డి, ఏఎస్సై(రాచకొండ సీపీఎస్), బట్టురాజు మోహన్ రాజు, ఏఆర్ ఎస్సై (టీఎస్‌ఎస్పీ), దేవులపల్లి మోహన్ రెడ్డి, పీసీ (ఇంటిలిజెన్స్), మహ్మద్ నయీముద్దీన్, పీసీ (ఇంటిలిజెన్స్), వి.చంద్రయ్య, చీఫ్ హెడ్ వార్డర్ (జైళ్ళ శాఖ), గడ్డం సోమశేఖర రెడ్డి, చీఫ్ హెడ్ వార్డర్ (జైళ్ళ శాఖ), డి.ధ్యానమ్మ, చీఫ్ హెడ్ వార్డర్ (జైళ్ళ శాఖ), అన్నపురెడ్డి యజ్ఞనారాయణ, పైర్ అధికారి (నల్లగొండ), కట్టా జగదీశ్వర్, లీడిరగ్ ఫైర్ మెన్ (గౌలిగూడ ఫైర్ స్టేషన్) ఉన్నారు.