పూర్ణకు సాహో అన్న సప్త శిఖరాలు

ఎవరైనా ఉత్తమ విజయాలను అందుకుంటే వారిని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని అంటుంటారు. అటువంటిది అంతర్జాతీయంగా వున్న అత్యున్నత శిఖరాలనన్నింటిని అతి పిన్న వయస్సులోనే అధిరోహించింది మాలావత్‌ పూర్ణ. సంకల్పం వుంటే సాధించలేనిదంటూ ఏదీ వుండదు అని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్తుంది పూర్ణ.

చిన్న వయసులోనే ప్రపంచంలో గల ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకొన్న మాలావత్‌ పూర్ణ మరో చరిత్ర సృష్టించింది. 7 ఖండాల్లో వున్న 7 ఉన్నత శిఖరాల అధిరోహణంతో, ప్రపంచస్థాయి 7- సమ్మిట్‌ ఛాలెంజ్‌ ను కూడా సొంతం చేసుకున్నది. అరుదైన ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా’గా సరికొత్త రికార్డు సృష్టించింది.

ఉత్తర అమెరికాలో వున్న అత్యంత ఎత్తైన మౌంట్‌ డెనాలి (6,190 మీటర్లు) శిఖరాన్ని అధిరోహించింది. ఈ ఫీట్‌ను జూన్‌ నెల 5న సాధించింది. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్సెండ్‌ అడ్వెంచర్‌ సంస్థ, పూర్ణ సాహసయాత్రకు తోడ్పాటునందించింది. ఈ సాహస యాత్రలో పాల్గొన్న పూర్ణ.. తెలంగాణ పేరును విశ్వం వ్యాప్తం చేసింది.

మే 18 వ తేదీన, ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ ప్రోత్సాహంతో పర్వతారోహణకు బయలుదేరిన పూర్ణ..ఆ మరుసటి రోజు అలాస్కాలోని యాంకరేజ్‌ నగరానికి చేరుకొన్నది. ఆమెతో పాటు భారత్‌ నుంచి మరో నలుగురు జట్టు సభ్యులు ఉన్నారు. వీరందరూ కలిసి మే 22న టాకిట్నాకు వెళ్లారు. మౌంట్‌ డెనాలి నేషనల్‌ పార్కులో వివరాలు నమోదు చేయించుకుని, మే 24న బేస్‌ క్యాంపుకు చేరుకొన్నారు. అక్కడి నుంచి మౌంట్‌ డెనాలి అధిరోహణను ప్రారంభించిన పూర్ణ బృందం, జూన్‌ 5న మౌంట్‌ డెనాలి శిఖరాగ్రానికి చేరుకున్నది.

పూర్ణ అధిరోహించిన  7 ఖండాల్లో వున్న 7 ఉన్నత పర్వతాలు:

1. ఎవరెస్టు (ఆసియా),  2. మౌంట్‌ కిలిమంజారో (ఆఫ్రికా) , 3. మౌంట్‌ ఎల్‌బ్రస్‌ (యూరప్‌), 4. మౌంట్‌ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా), 5. మౌంట్‌ కార్టెన్జ్‌ (ఓషియానియా),                                                                        6. మౌంట్‌ విన్‌సన్‌ (అంటార్కిటికా),  7. మౌంట్‌ డెనాలి (ఉత్తర అమెరికా)