మనసుదోచే పూదోట

మనసుదోచే-పూదోటపూమాలకు తలవంచని ధీమంతుడెవరు, అని ఓ కవి అన్నాడు. పుష్పాలంటే ఎంతటివ్యక్తయినా ముగ్ధుడవ్వాల్సిందే. పూల పరిమళం అటువంటిది. వాటి సోయగం సొగసును ఇనుమడింపజేస్తుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ పువ్వులంటే పరవశులై పోతారు. నిత్యజీవిత వేడుకల్లో పువ్వులకు ప్రాధాన్యం తప్పనిసరిగా వుంది. పువ్వులకు వున్న ప్రత్యేకతను పేర్కొనాలంటే తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ రంగు రంగుల పూల పరిమళాలతో ప్రకృతి పురివిప్పే విధంగా జరిగే పువ్వుల పండుగ.

ఇదివరకు పూలపెంపకం అనేది వ్యక్తిగత శ్రద్ధగా వుండి ఇంటిపరిసరాలలోనో, చిన్నపాటి కుండీలలోనో పెంపకం చేయడం జరిగేది. అయితే ఈ ఆధునిక కాలంలో పూలసాగులో వచ్చిన సరికొత్త పరిజ్ఞానంతో పూలపెంపకం అనేది ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.

ఉరుకులు పరుగుల యాంత్రిక జీవితంలో సగటుజీవి తన అభిరుచిని తీర్చుకుంటూ పూవులు పెంచుతూ సేదతీరే అవకాశం, పూలకుండీలలో పూలు పెంచు కోవడానికి వీలుగా సంపూర్ణ సమాచారం అందించే సంకల్పాన్ని అందిపుచ్చుకుందది రైతునేస్తం మాసపత్రిక. తమ పత్రిక దశాబ్ది వార్షికోత్సవం సందర్భంగా పూదోట అనే ఈ పుస్తకాన్ని అత్యంత కమనీయంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

ప్రధానంగా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌లలో సాగుకు, ముఖ్యంగా కూరగాయల సాగును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులు చేస్తున్న సందర్భం. గ్రీన్‌హౌస్‌లో టమాట, క్యాప్సికం, జెర్కిన్స్‌, ఎరుపుక్యాబేజీ సాగుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాప్సికం బాగా లాభదాయకమని ఇప్పటికే ఆచరణలో రైతులు నిరూపించారు కూడా.

గ్రీన్‌గౌస్‌ నిర్మాణంలో పేరుగాంచిన రామకృష్ణగారి గురించి కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం రైతులకు ఎంతో ఉపయుక్తం.

ఈ పుస్తక రచయితలలో ముఖ్యులు ప్రొ॥ చంద్రశేఖర్‌. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తున్న గ్రీన్‌హౌస్‌ సాగు పతకం సాంకేతిక కమిటీ సభ్యులు కూడా కావడం గమనార్హం.

అతికొద్ది విస్తీర్ణంలో సాగుకు బంతి, చామంతి, కనకాంబరం, నేలసంపగి, మల్లె, గులాబీ నుంచి జెర్బలా, కార్నేషన్‌ లాంటి అలంకరణ మొక్కల పెంపకం దాకా అన్నీ ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించడం జరిగింది. గ్రీన్‌హౌస్‌లో పూలసాగు గురించి ఇంటిల్లిపాదీ తెలుసుకునే రీతిలో ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. ప్రతిఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి తప్పక భద్రపరచుకోవలసిందే.