జ్యూట్‌ బ్యాగ్‌ల తయారీ స్వయం ఉపాధి

By: శ్రీ కల్వల శ్రీనివాస రావు

కృషికి పట్టుదల తోడైతే విజయం సొంతమవుతుందంటారు. అందుకు యశ్వంత్‌ జీవితంమే ఒక ఉదాహరణ.
తాను కన్న కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం తపిస్తున్న అన్వేషి యశ్వంత్‌.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తనవంతు కృషి చేస్తూ పట్టుదలతో యువ పారిశ్రామికవేత్తగా అడుగులు వేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం చింతపల్లిలోని సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన యశ్వంత్‌ మాటలలో.. హైదరాబాద్‌లోని మహావీర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బి.టెక్‌. చదువుతూ బండ్లగూడ ప్రాంతంలో ఉండేవాడిని. ఇంజనీరింగ్‌ విద్య అభ్యసిస్తున్న సమయంలో అదే ప్రాంతంలో నివసించే ప్రజలతో సన్నిహితంగా మొదలుతూ ఉండడంచేత పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే వారు కావడంతో వారితో పరిచయాలు పెంచుకున్నా. విద్యతో పాటు చిన్న తరహా పరిశ్రమ చేపట్టాలన్న దృఢమైన కోరిక కలిగింది.

ఒక పక్క బి.టెక్‌ 2వ సంవత్సరం చదువుతూ మరోవైపు పరిశ్రమ స్థాపనపై దృష్టిపెట్టా. ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన స్ఫురించి తండ్రి అంగీకారం కోరగా ప్రోత్సహం లభించింది. రుణ మంజూరుకై వివిధ బ్యాంక్‌లను సంప్రదించగా కెనరా బ్యాంక్‌ సహకారంతో సమాజానికి మేలుచేసే పరిశ్రమలనే చేపట్టాలని ఆలోచనతో జ్యూట్‌ పరిశ్రమపై దృష్టి పెట్టా… అదే సమయంలో కరోనా రావడం కొంత ఇబ్బంది కలిగించినా ఇష్టంతో చేపడుతున్న పరిశ్రమ కావడం పర్యావరణానికి హాని కలిగించే 50 మైక్రాన్ల సామర్థ్యం గల ప్లాస్టిక్‌ కవర్లను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జ్యూట్‌ బ్యాగుల ఆవశ్యకత పెరగడం మార్కెటింగ్‌ సులభతరమయ్యింది. మార్కెట్లో జ్యూట్‌ బ్యాగుల కొరత ఉండడం కొంత కారణం. జ్యూట్‌ పరిశ్రమ యూనిట్‌కు హైదరాబాద్‌లో బ్రాంచ్‌ ఉండడంతో యశ్వంత్‌ సంప్రదించి ఉత్తరప్రదేశ్‌ నుండి జ్యూట్‌ పరిశ్రమ సామగ్రిని మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎం.జి.ఓస్‌ కాలనిలో నెలకొల్పారు. జ్యూట్‌ బ్యాగ్‌లను ఉత్పత్తి చేస్తూ మార్కెటింగ్‌ చేస్తున్నారు. ఇల్లందు, ఖమ్మం, మరిపెడ, కేసముద్రంలలో మార్కెటింగ్‌ చేస్తున్నారు. వ్యాపారస్తుల కోరిక మేరకు ఆయా షాప్‌ల పేర్లను కవర్లపై ముద్రిస్తూ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. జ్యుట్‌ బ్యాగ్స్‌ తయారీని చేపట్టారు. 5గురు సిబ్బందిని నియామకం చేసుకొని, వారికి ఉపాధి కల్పించారు.

జ్యూట్‌ పరిశ్రమతో దినదినాభివృద్ధి చెందుతూ జిల్లాలో యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తూ సమాజాన్ని శాసిస్తున్న యశ్వంత్‌ నేటి తరానికి మార్గనిర్దేశకుడు.