మేయర్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత

గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) మేయర్గా గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత ఎన్నికయ్యారు. జి.హెచ్ఎం.సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఎన్నికలను ప్రిసైడింగ్ ఆఫీసర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల పరిశీలకులుగా సందీప్ సుల్తానియా, జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమీషనర్ లోకేష్ కుమార్లు హాజరయ్యారు.

ముందుగా మేయర్ ఎన్నికను నిర్వహించగా, బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మిని టి.ఆర్.ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థినిగా ప్రతిపాదిస్తున్నట్టు బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి బలపర్చారు. కాగా, బీజీపీ నుండి ఆర్.కె.పురం కార్పొరేటర్ వి. రాధా థీరజ్ రెడ్డి పేరును మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా, హిమాయత్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి బలపర్చారు. మరెవ్వరూ పోటీలో లేకపోవడంతో వీరిద్దరి మధ్య పోటీ జరిగింది.
అక్షర మాల ప్రకారం మేయర్ పదవికి ఎన్నికకై తొలుతగా బీ.జీ.పి అభ్యర్థిని వి. రాధా థీరజ్ రెడ్డి పేరును పిలవగా బీజీపీ సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యులు లేచి చేతులెత్తడం ద్వారా బలపరిచారు. అనంతరం, విజయలక్ష్మి పేరు ప్రకటించగా, టీ.ఆర్.ఎస్, ఎం.ఐ.ఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు నిలబడి చేతులెత్తి ఆమెకు మద్దతు ప్రకటించారు. దీనితో, అత్యధిక సభ్యులు మేయర్ అభ్యర్థిని గా గద్వాల విజయ లక్ష్మి ని ఆమోదించడంతో ఆమె మేయర్ గా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.

అనంతరం, డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నిక నిర్వహించగా టీ.ఆర్.ఎస్. అభ్యర్థినిగా తార్నాకా కార్పొరేటర్ మోతె శ్రీలత పేరును మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాధ్ ప్రతిపాదించగా, కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ బలపర్చారు. బిజెపి నుండి బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పేరును జాంబాగ్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ ప్రతిపాదించగా, అడిక్ మెట్ కార్పొరేటర్ సునీత బలపర్చారు. దీనితో ఓటింగ్ నిర్వహించగా, టి.ఆర్.ఎస్ అభ్యర్థిని మోతే శ్రీలతకు టిఆర్ఎస్, ఎం.ఐ.ఎం సభ్యులు నిలబడి చేతులెత్తి మద్దతు పలికారు. బీజేపీ అభ్యర్థి శంకర్ యాదవ్కు బిజెపి కార్పొరేటర్లు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు మద్దతు పలికారు. దీనితో, అత్యధిక సభ్యులు మద్దతు తెలిపిన మోతె శ్రీలత డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.
మేయర్గా గద్వాల విజయ లక్ష్మికి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలతలకు ఎన్నిక ధృవీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి అందచేశారు. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరిం చిన సభ్యులకు రిటర్నింగ్ అధికారి ధన్య వాదాలు తెలియ చేశారు. కాగా, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 149 మంది సభ్యులు హాజరు కాగా, రాజ్యసభ సభ్యులు ఐదుగురిలో ముగ్గురు, 15 మంది ఎమ్మెల్సీలలో 10 మంది, 21 మంది ఎమ్మెల్యేలలో 20 మంది హాజరయ్యారు.