|

మెదక్‌ కోట

మెదక్‌ కోటశాత వాహనరాజులు, కాకతీయ చక్రవర్తులు నాడు తమ విశాల సామ్రాజ్యంలో నిర్మించిన కొన్ని ముఖ్య పట్టణాలలో మెదక్‌ పట్టణం కూడా ఒకటి. మెదక్‌ పట్టణానికి పశ్చిమాన సహజసిద్ధంగా ఏర్పడిన 500 అడుగుల ఎత్తయిన కొండపై నిర్మింపబడ్డ కోట ఇది. 12వ శతాబ్ధానికి చెందిన ఈ కోట ప్రస్తుతం శిధిలమైన స్థితిలో చారిత్రక అవశేషంగా మనకు కనిపిస్తోంది. శతాబ్ధాల నాటి ఘనకీర్తికి ప్రతీక ఈ మెదక్‌ కోట. హైదరాబాద్‌ పట్టణానికి సుమారు 90 కి.మీ. దూరంలో ఉన్న ఈ కోటను చూస్తే ఆనాటి చారిత్రక వైభవం, నాటి శిల్పుల అద్భుత ప్రతిభ, వారు అడుగడుగునా కనబర్చిన అసమాన నేర్పరితనం మనకు కళ్ళకుకట్టినట్టుగా కనబడుతుంది. పట్టణానికి పశ్చిమాన ఉన్న ఈ కోట కాకతీయ చక్రవర్తులలో చివరి రాజైన రెండవ ప్రతాప రుద్రుడు నిర్మించాడు. స్థానిక పాలనా వ్యవహారాలు, సైనిక రక్షణావసరాలకోసం నిర్మించబడింది ఈ కోట. నేటి తరం వారిని సహితం అబ్బురపరుస్తోంది.

శాతవాహనులు మొదలుకొని కాకతీయులు, కుతుబ్‌షాహీలవరకు ఎందరెందరో రాజులు, చక్రవర్తులు ఈ కోటను పాలించి తీర్చిదిద్దినవారే. కోట పై ప్రాంతం వరకూ చేరుకోవాలంటే మొత్తంగా ఏడు ద్వారాలు దాటాల్సి వుంటుంది. కొండపైకి ఎక్కిన తర్వాత కోటలోకి స్వాగతం పలుకుతూ ప్రథమ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. కొండపైకి వెళ్ళడానికి అలనాటి పురాతన రాచమార్గం శిథిలావస్థలో ఉన్న కారణంగా సందర్శకుల సౌకర్యం కోసం కోటలో ముబారక్‌ మహల్‌ వరకూ తెలంగాణ ప్రభుత్వం వారు ఘాట్‌రోడ్డును నిర్మించారు. లోపలివైపుకు వెళుతుంటే చూడచక్కని రాతినిర్మాణాలు, వాటిపై అద్భుతంగా చెక్కబడిన రాజచిహ్నాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ప్రథమ ‘ప్రవేశ ద్వారం’ దాటిన తరువాత మనకు ‘సింహద్వారం’ ఎదురవుతుంది. ఈ సింహద్వారంపై సింహపు బొమ్మలతో రాతి నిర్మాణం చెక్కబడి వుంటుంది. సింహ ద్వారం దాటిన తరువాత మనకు ‘గజద్వారం’ కనబడుతుంది. ఈ గజద్వార నిర్మాణంపై ఏనుగు బొమ్మలతో రాతినిర్మాణాలు ఇరు ద్వారాలపై మనకు కనబడతాయి. ఈ నిర్మాణాలు చూస్తుంటే ఆనాటి రాజుల నైపుణ్య ప్రతిభ, శిల్పుల నిర్మాణశైలి ఎంత అద్భుతంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మూడు ముఖ్య ప్రవేశ ద్వారాలు దాటిన తరువాత మరింత ముందుకు వెళుతున్న క్రమంలో మనకు సువిశాలమైన ప్రాంతంలో గట్టుమైసమ్మ దేవత ఆలయం దర్శనమిస్తుంది. 4వ ద్వారం అత్యంత పటిష్టంగా శతృదుర్ఛేద్యంగా నిర్మించడం విశేషం. ఈ నాటికీ చెక్కుచెదరని నిర్మాణ నైపుణ్యంతో ఈ కట్టడాలు కనబడుతున్నాయి. దీనిపైన రెండు వైపుల సింహాల ప్రతిమలు ఆనాటి శిల్పుల ప్రతిభకు, నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. 4వ ద్వారం దాటగానే కుడివైపున మరో చిన్న ద్వారంగుండా వెళితే గజశాల, అశ్వశాల కనబడుతుంది. ఈ గజశాల, అశ్వశాల గతంలో నాటి సైనికాధికారులకు అద్భుతంగా ఉపయోగపడ్డాయి. నాటిరాజులు కోటలోని ప్రతి ద్వారానికి లోపలివైపు గట్టి సైనిక పహారాను ఏర్పాటు చేసేవారు. అడుగడుగునా మర ఫిరంగులతో కోటకు గట్టి కాపలా ఉండేది. ఫిరంగి దర్వాజాగా పిలవబడే 5వ ద్వారం కుడివైపున 16 అడుగుల ఫిరంగితో కోటలోని సైనికులు నిరంతరం పహారా కాసేవారు. శతృదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట అడుగడుగునా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 5వ ద్వారం దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత 6వ ద్వారం పై ప్రాంతంలో గరుడ యంత్రం మనకు కనిపిస్తుంది. ఈ గరుడ యంత్రం, సర్ప రాతి నిర్మాణంలో మనకు కనిపిస్తుంది. వాస్తు ప్రకారం ఈ గరుడ యంత్రం వలన ఆ ప్రాంతంలో ఎంతటి విష సర్పాలు ఉన్నా వాటి వలన ఎవరికీ ఎలాంటి హాని కలగదని ఇక్కడి ప్రజల విశ్వాసం.

ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏమాత్రం చెదిరిపోని రాజ చిహ్నాలను చూస్తుంటే క్రీ.శ. 12వ శతాబ్ధానికి చెందినదిగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శాతవాహనుల రాజముద్రలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. శాతవాహనులు వ్యవసాయాన్ని, శిల్పకళలను ఎక్కువగా ప్రోత్సహించారు. మెదక్‌ పట్టణానికి 3 మైళ్ళ దూరంలో వున్న బిక్కవోలు కూడా మెదక్‌ దుర్గం కిందే వుండేది. ఇక్కడి సంస్థానాధీశులు స్వయంగా కవులు కావడంచేత కవులు, పండితులు ఈ ప్రాంతంలో బాగా ఆదరించబడ్డారు. ఆ కాలానికి చెందిన పట్టమెట్టి సోమనాథ సోమయాజి కవి ఈ ప్రాంతానికి చెందిన మహాకవిగా ఆదరించబడటం విశేషం. ఎల్లారెడ్డి, మల్లారెడ్డిలు ఇక్కడ పేరుగాంచిన ఆ కాలంనాటి కవులు.

మెదక్‌ కోట2ఖిల్లాపై ప్రాంతం నుంచి చూస్తే సుమారు 10 కి.మీ. మేర విస్తరించిన మెదక్‌ పట్టణం కనిపిస్తుంది. క్రీ.శ. 1309లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ సేనాని, మాలిక్‌ కాఫిర్‌ దక్షిణాదిపై దండెత్తినపుడు ఈ కోటను తన స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమయంలో మెదక్‌, వదక్‌పూర్‌ మెదక్‌గా పిలిచేవారు. ఇదే క్రమంగా మెదక్‌గా మారింది. ఆ తరవాత ఈ కోట కుతుబ్‌షాహీల వశం అయింది. శాతవాహనుల పరిపాలనా కాలంలో మెదక్‌ను మెతుకుదుర్గంగా పిలిచేవారు. గోల్కొండ నవాబులు మెదక్‌ను పాలించే క్రమంలో మెదక్‌ను గుల్షనా బాద్‌గా పిలిచేవారు. ఇలా వివిధ రాజుల పరిపాలనలో రకరకాల పేర్లతో తీర్చిదిద్దబడింది ఈ దుర్గం. అబ్బురపరిచే నిర్మాణ చాతుర్యంతో నిర్మించబడ్డ ఈ మెదక్‌ కోట ఆద్యంతం చూపరుల కళ్లను ఇట్టే ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. సుమారు 500 అడుగుల పై ప్రాంతం వరకూ వెళ్ళిన తరువాత శిఖర భాగానికి చేరుకుంటాం. అక్కడ నుండి మనకు మెదక్‌ పట్టణం మొత్తం కనిపిస్తుంది. అంతేగాక ఆసియాలోనే అతిపెద్ద క్రైస్తవ ఆధ్యాత్మిక మందిరమైన మెదక్‌ చర్చ్‌ కూడా కనిపిస్తుంది.

పై ప్రాంతంలో నాటి కరుడుగట్టిన ఖైదీలను ఖైదు చేసిన చెరసాల కూడా కనిపిస్తుంది. ఈ చెరసాల ఖైదీలు తప్పించు కోకుండా అత్యంత పకడ్భందీగా కట్టబడింది. కోట శిఖరాగ్రానికి చేరిన తరువాత మనకు ఒక మసీదు దర్శనమిస్తుంది. కాకతీయులు కట్టిన ఈ కోట కాలక్రమంలో చేతులు మారి కుతుబ్‌షాహీల చేతికి వచ్చింది. రాజులు పోయారు, రాజ్యాలూ పోయాయి కానీ అలనాటి చరిత్రకు సాక్షీభూతంగా ఈ మెదక్‌ కోట నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోటలో కొన్ని సౌకర్యాలు మెరుగుపరిస్తే సందర్శకులకు అనువుగా వుంటుంది. గత ప్రభుత్వాల కాలంలో నిరాదరణకు గురి అయిన ఈ కోటలో ప్రస్తుతం టూరిజం శాఖ ఆధ్వర్యంలో కొన్ని సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న ఈ కోటను సకుటుంబ సపరివార సమేతంగా చూసి ఆనందించడానికి ప్రభుత్వం మరికొన్ని సదుపాయాలు, రక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది.