|

డ్రోన్లతో సంజీవిని !

డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమయ్యింది. దేశంలోనే మొదటిసారి తెలంగాణలో ప్రారంభించడంతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మొదటి నుంచి ఫార్మారంగంలో తెలంగాణ దేశంలోనే మెరుగైన స్థానంలో ఉండగా, డ్రోన్లద్వారా మందుల సరఫరాతో మరో ముందడుగు వేసినట్టు అయ్యింది. మొట్టమొదటగా వికారాబాద్‌లో ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డిలతో కలిసి ప్రారంభించారు.  వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయం పరేడ్‌గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మారుత్‌, టెక్‌ ఈగల్‌, స్కై ఎయిర్‌ కంపెనీలకు చెందిన మూడు డ్రోన్ల ద్వారా ఆకాశమార్గాన వ్యాక్సిన్‌ను పంపించారు.  

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి సింధియా మాట్లాడుతూ ఆకాశయానంలో డ్రోన్ల వ్యవస్థ ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని అన్నారు. భవిష్యత్తులో డ్రోన్ల వ్యవస్థ వైద్యులకు ఎంతో సహాయ కారిగా ఉంటుందన్నారు. దేశంలో డ్రోన్లు ఎగిరేందుకు ఉన్న ఆంక్షలను సడలిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం మూడు రకాల జోన్‌ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రోన్లు ఎగిరేందుకు అనుమతులు అవసరంలేని గ్రీన్‌ జోన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రోన్లు ఎగిరేందుకు వీలులేని ప్రదేశాలను రెడ్‌ జోన్‌లుగా గుర్తిస్తామన్నారు.  ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ది స్కై  ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఒక్కోసారి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు సకాలంలో మందులు అందక రోగుల ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. అలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఈ మెడిసిన్‌ ఫ్రంది స్కై సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కోవడంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందుందన్నారు. రెండేళ్ళ క్రితమే సాంకేతికతపై దావోస్‌లో జరిగిన సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో డ్రోన్ల వినియోగంపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు సాంకేతికత జోడిరచడం ఎంతో అవసరమన్నారు. గుండె మార్పిడి లాంటి విషయాలలో గుండెను, సంబంధిత ఆసుపత్రికి చేరవేయాలంటే ట్రాఫిక్‌ను ఆపాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా గుండె ఇతర అవయవాల మార్పిడి విషయంలో డ్రోన్లను ఉపయోగించవచ్చని కేటీఆర్‌ పేర్కొన్నారు. వ్యవసాయ పొలాల్లో పురుగుల మందులు చల్లడానికి, సాంకేతికత మ్యాపింగ్‌ విషయంలోను, ఎక్కడైన నేరాలు జరిగితే అక్కడకు పంపి పోలీసులను, ప్రజలను అప్రమత్తం చేయడానికి డ్రోన్ల సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అడవుల్లో మొక్కలు పెంచడానికి సీడ్‌బాల్స్‌ చల్లడానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీ రంజీత్‌రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.