కేటీఆర్‌ ఔదార్యం

కుటుంబాన్ని పోషించే భర్త విధివశాత్తు ప్రమాదం బారినపడి తన రెండు చేతులూ కోల్పోయాడు. దాంతో తాను పనిచేయలేడు సరే, తాను చేసుకోవాల్సిన కనీస పనులకు కూడా తన కుటుంబీకులపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడింది. మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా గాజులరామారం, షాపూర్‌నగర్‌లో ఉంటున్న సత్యనారాయణ పోయిన యేడాది మే నెలలో విద్యుత్తు ప్రమాదానికి గురై తన రెండు చేతులు కోల్పోయాడు. దాంతో కుటుంబ పోషణ భారం అంతా ఆయన భార్యపైనే పడింది. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నది సత్యనారాయణ భార్య.

సత్యనారాయణ ఐదేండ్ల కూతురు చందనప్రియ, తండ్రికి అన్నం తినిపించడం వంటి సంరక్షణ పనులను చేస్తున్నది. ఈ పరిస్థితులను చూసిన సత్యనారాయణ ఎంతో దిగులుతో రెండు చేతులు కోల్పోయిన తనకు దివ్యాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం తన భార్య సంపాదించే పైసలతో ప్రస్తుతం ఉంటున్న ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, మానవతా దృక్పధంతో ఉండడానికి ఒక   గూడు కల్పించాలని విజ్ఞప్తిచేశారు.

అభ్యాగతుల విన్నపాల పట్ల తొందరగా స్పందించే మంత్రి కేటీఆర్‌ ఈ అంశాన్ని మీడియా ద్వారా తెలుసుకుని, సత్యనారాయణకు తగిన వసతితో పాటు దివ్యాంగుల ఫించన్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశానుసారం వెంటనే స్పందించిన అధికారులు బాలానగర్‌లోని చిత్తారమ్మ బస్తీలో సత్యనారాయణకు డబుల్‌బెడ్రూం ఇల్లు కేటాయించి, కేటాయింపు ఆర్డర్‌ను కూడా అధికారులు అందజేశారు. త్వరలోనే దివ్యాంగుల పింఛన్‌ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌ను తమ కుటుంబం జీవితాంతం గుర్తుంచుకుంటామని, ఈ సహాయం యావత్‌ కుటుంబానికి గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందని చెబుతూ సత్యనారాయణ ఉద్వేగానికి లోనయ్యారు.