కార్మిక క్షేత్రంలో…. తారకమంత్రం
By: మామిండ్ల దశరథం

మరమగ్గాల ఆధారిత వస్త్ర ఉత్పత్తికి కేంద్ర బిందువుగా, కార్మిక క్షేత్రంగా పేరుగాంచిన సిరిసిల్ల ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల నిరాదరణతో సంక్షోభంలో కూరుకుపోయింది. సిరిసిల్ల మరణాల గురించి అందరూ ఎప్పటికప్పుడు మొసలి కన్నీళ్లు కార్చిన వారే. నలుగురిలో ఏడ్చి మొత్తుకున్నవారే గానీ సంక్షోభానికి అసలు సిసలు మూల కారణాలను పట్టించుకున్న వారు లేరు. శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు నడుం కట్టిన వారు అసలే లేరు.అదంతా గతం. గతానికి చెల్లు చీటీ పలుకుతూ స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పాటవడం, కే. తారక రామారావు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించడం, చేనేత, జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సిరిసిల్లకు గొప్ప ఉపశమనం కల్గించింది. ఇది మొత్తం తెలంగాణకు వర్తించినా, సిరిసిల్లకు మటుకు అచ్చంగా పునరుజ్జీవన సందర్భం.
మారిన తలరాత !


2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, మంత్రిగా కే. తారక రామారావు బాధ్యతలు చేపట్టడం సిరిసిల్ల ప్రజలకు కలిసి వచ్చింది.
2009 నుండి సిరిసిల్ల నుండి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించడం, స్థానిక సమస్యల పై సంపూర్ణ అవగాహన ఉన్న కేటీఆర్ చేనేత, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి సిరిసిల్ల రూపురేఖలను సమూలంగా ఆమూలాగ్రం మార్చివేశారు.
తెలంగాణ ఉద్యమకాలంలో సిరిసిల్లను కేటీఆర్ సందర్శించినపుడు ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ గోడల మీద రాసిన రాతలను చూసి చలించిపోయారు. సంక్షోభ మూలాలను అవపోసన పట్టిన కేటీఆర్ ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాలను ఒక్కొక్కటిగా పరిష్కరించారు. శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించారు. ఆత్మహత్యలను నివారించారు.
చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం


నేత, చేనేత కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దీంట్లో భాగంగా 2014-15 నుంచి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. నేత, చేనేత కార్మికులకు సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, గురుకులం, మహాత్మా జ్యోతిరావుపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, పోలీసు శాఖ, సర్వశిక్ష అభియాన్, బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్లు, క్రిస్మస్, రంజాన్ కానుకలు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, ఆశా వర్కర్ల చీరెల ఆర్డర్లను ఇప్పటివరకు ఇచ్చారు. మొత్తం 14 శాఖల ద్వారా 2014-15లో చేనేత కార్మికులకే రూ.117.27 కోట్ల విలువైన పనిని ఇచ్చారు. 2015-16లో రూ.109.26 కోట్ల మేరకు, 2016-17లో చేనేత, నేత కార్మికులకు రూ.103.28 కోట్ల మేరకు పనులు అప్పగించారు. 2017-18లో చేనేత, నేతలకు కలిపి రూ.398.28కోట్లు, 2018-19లో రూ.459.12 కోట్లు ఇలా ఇప్పటి వరకూ రూ.2 వేల 500 కోట్ల విలువైన బతుకమ్మ చీరలు, ఆర్ వి ఎం, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్ అంగన్‌వాడి చీరలు , సంక్షేమ శాఖల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు కేటాయించడం జరిగింది.
రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి రైతుబీమా తరహాలో త్వరలోనే ‘చేనేత బీమా’ అమలుచేస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రకటించారు. రైతులు దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు వచ్చేలా చేసినట్టే.. నేత కార్మికుడు చనిపోయినా.. అతడి కుటుంబం ఖాతాలోకి రూ.5 లక్షలు పడుతాయని పేర్కొన్నారు.
బతుకమ్మ చీరెలు, ఇతర శాఖల వస్త్ర ఆర్డర్ ల తయారీ మొదలుపెట్టాక కార్మికుల జీతాల్లో భారీ మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రతి కార్మికుడు వారానికి రూ.4-5వేల చొప్పున నెలకు కనీసం రూ.16-20వేలు సంపాదిస్తున్నాడు. ఏడాదిలో 6-8 నెలలపాటు ప్రభుత్వం ఇచ్చే పనులతోనే కార్మికులు బిజీ అవుతున్నారు.
ఆత్మహత్యలు, ఆకలిచావులతో కొట్టుమిట్టాడిన సిరిసిల్ల ఇప్పుడు సిరులొలుకుతోంది. మరమగ్గాల పారిశ్రామీకీ కరణతో పరుగులు పెడుతోంది. చేతినిండా పని.. కడుపు నింపే వేతనంతో కార్మిక కుటుంబాలు భరోసాగా జీవిస్తున్నాయి.