అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో పారిశుధ్యం

అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో హైదరాబాద్‌ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. నెక్లెస్‌ రోడ్డులో ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యర్థాలను తరలించే వివిధ రకాల 40 వాహనాలను మంత్రి కే.టీ.ఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యంగా నగరాల్లో రెండు రకాల వ్యర్ధాలు ఉత్పత్తి అవుతాయి. అందులో ఘన, ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారు. అప్పుడే సమగ్రమైన, అర్థవంతమైన, ఆచరణాత్మకంగా ప్రాక్టికల్‌ ఎజెండా తీసుకొని హైదరాబాద్‌ నగరంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాలను సేకరణ పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడం జరుగుతున్నదని అన్నారు.

2013-14 సంవత్సరంలో 2500 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశం మేరకు జిహెచ్‌ఎంసి, రాంకీ కలిసికట్టుగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు 6500 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను 4500 స్వచ్ఛ ఆటోల ద్వారా సేకరిస్తున్నట్లు మంత్రి వివరించారు. మరో 400 స్వచ్ఛ ఆటోలు నెల రోజుల్లో రానున్నట్లు చెప్పారు. గతంలో సేకరణ సందర్భంగా చెత్త రోడ్డుపై వెదజల్లుతూ ఉండేది. హైదరాబాద్‌ విశ్వ నగరం స్థాయిలో ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయుటకు Refuse Container వెహికల్‌, హుక్‌ మౌంటెడ్‌ వెహికల్‌, సిలిండ్రికల్‌ స్టాటిక్‌ కంటైనర్‌లను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. చెత్త రోడ్లపై వెదజల్లకుండా అభివృద్ది చెందిన దేశాల్లో ట్రాన్స్‌ పోర్ట్‌ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటుందో ఆ రకమైన ఏర్పాట్లు హైదరాబాద్‌ మహా నగరంలో కూడా చేస్తున్నామన్నారు.

నగరంలో 17 ట్రాన్స్‌పోర్ట్‌ స్టేషన్‌లను నిర్వహిస్తుండగా అందులో 11 ఆధునీకరించడం జరిగిందని, మరో 4 ప్రగతిలో ఉన్నాయి. మిగతా 2 కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాలకు సంబంధించి ముఖ్యంగా కలెక్షన్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ట్రీట్మెంట్‌ ప్రక్రియ ఉంటుందన్నారు. దక్షిణ భారతదేశంలో వ్యర్థాల నుండి అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని రూ. 485 కోట్ల తో 24 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు, మరో 24 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని రూ. 550 కోట్ల తో నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. జవహర్‌ నగర్‌ డంప్‌ యార్డు లో పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా 140 కోట్ల ఖర్చుతో క్యాపింగ్‌ చేసినట్లు, అంతే కాకుండా వర్షాల కారణంగా డంప్‌ యార్డులో గల వ్యర్థాల వల్ల ఏర్పడిన లీచెట్‌ వల్ల చెరువులు కలుషితం కాకుండా రూ. 250 కోట్ల తో ట్రీట్మెంట్‌ చేస్తున్నట్లు తెలిపారు.

ఘన వ్యర్థాలతో పాటు ద్రవ వ్యర్థాల ట్రీట్మెంట్‌కు కూడా ప్రాధాన్యతనిస్తూ రూ. 3866 కోట్ల తో సివరేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు, అదే విధంగా నగరంలో చెరువులలో గల వ్యర్థాలను, గుర్రపు డెక్క తొలగింపుకు అత్యాధునిక పద్ధతిలో శుభ్రం చేస్తున్నట్లు అందుకోసం జిహెచ్‌ఎంసికి ఆరు వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోటి 50 లక్షల రూపాయల విలువ గల 3 పెద్ద వాహనాలు, కోటి రూపాయల విలువ గల మరో 3 వాహనాలు కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు. అత్యాధునిక పద్ధతిలో సాలిడ్‌, లిక్విడ్‌, మేనేజ్మెంట్‌ ప్రక్రియ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌ నగరంలో చేపట్టుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ అన్నారు.రాష్ట్ర పశుసంవర్ధక, ఫిషరీస్‌, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ… మారుతున్న సమాజానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజలకు అండర్‌ పాస్‌లు, స్టీల్‌ బ్రిడ్జి, నాలా అభివృద్ధి పనులు, వైకుంఠ దామాలు, పార్క్‌లు, ఫుట్‌పాత్‌లు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నట్లు వివరించారు.