ప్రజాదీవెనతో ముందడుగు: సాగర్‌ సభలో సీఎం కేసీఆర్‌

మన రాష్ట్రం మనకు వచ్చినరోజు తెలంగాణ  అట్టడుగున వుండేది. మా ప్రభుత్వ పాలనలో ఏడేండ్లలోనే అట్టడుగు నుంచి అగ్రస్థానానికి చేరుకున్నాం. బ్రహ్మాండంగా విజయాలు సాధించాం. మన దేశంలోనే ఎక్కడా లేని మంచి కార్యక్రమాలను అమలు చేసుకొంటున్నం. రైతులు ఆత్మహత్య చేసుకొన్న తెలంగాణలో, వ్యవసాయంలో చిట్టచివరన ఉండి, ఇప్పుడు మూడు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించినం. ప్రపంచంలోనే, మన తెలంగాణ భూముల్లో అతి మేలైన పత్తి పండుతున్నది. ఇది మన అదృష్టం. పత్తి పంటలో మనకన్నా ముందు వరుసలో గతంలో మహారాష్ట్ర ఉంటుండె. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు 1.78 కోట్ల క్వింటాళ్ల పత్తిని అమ్మి దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. 

నల్లగొండ జిల్లా హాలియాలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో  నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ‘ప్రగతి సమీక్ష సమావేశం’ జరిగింది. ఈ సమావేశాన్ని బహిరంగ సభగా రూపొందించి, నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజానీకానికి, అక్కడ జరుగుతున్న ప్రగతి పనుల వివరాలను ముఖ్యమంత్రి విశదపరిచారు. 

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో వున్న 75-85శాతం దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ అమలు చేస్తామని ప్రకటించారు. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ. 150 కోట్లు మంజూరు చేశారు. ఆ ప్రసంగంలోని  ముఖ్యాంశాలు సీఎం కేసీఆర్‌ మాటల్లోనే….

‘‘మన రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబించే వ్యతిరేక వైఖరి కావొచ్చు, ఆంధ్రావాళ్లు కృష్ణా నది నీటి విషయంలో ప్రదర్శిస్తున్న మొండి వైఖరి కావొచ్చు… ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నదిపైన అక్రమ ప్రాజెక్టులను ఏ విధంగా కడుతున్నరో మీరంతా చూస్తున్నరు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మనకు కృష్ణానది నీళ్లలో మన వాటా విషయమై ఇబ్బంది తలెత్తే అవకాశమున్నది, కాబట్టి మనం ముందుగానే కొంత జాగ్రత్తగా ఉండాలి. పాలేరు రిజర్వాయర్‌ నుంచి పెద్దదేవులపల్లి చెరువు వరకు గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానంచేయాలని సర్వే చేస్తున్నం. ఇదే గనక పూర్తయితే సాగర్‌ ఆయకట్టుకు భవిష్యత్తులో ఎటువంటి ఢోకా ఉండదు. ఇక్కడ గుర్రంపోడు ప్రాంతంలో లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల వున్న ఐదారు గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మీ ఎమ్మెల్యే భగత్‌ చెప్పిండు. ఆ విషయాన్ని పరిశీలించి,వెంటనే సర్వే చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశిస్తున్న, దీని సర్వే పూర్తయితే నెల్లికల్‌ లిఫ్ట్‌తో పాటే, దీన్ని కూడా మంజూరు చేస్తాం. వీటితోపాటే కుంకుడు చెట్టుతండా లిఫ్ట్‌ కూడా ప్రారంభమైతది. ఏం రంది పెట్టుకోవద్దు’’ అని సీఎం. చెప్పారు.

దేవరకొండలో ఐదు లిఫ్ట్‌లు.. పొగిల్ల లిఫ్ట్‌, కంబాలపల్లె లిఫ్ట్‌, నంబాపురం, పెద్దగట్టు లిఫ్ట్‌, పెద్దమునిగల్‌ అంబా భవాని లిఫ్ట్‌, అక్కంపల్లి లిఫ్ట్‌ మంజూరు చేసినం. మిర్యాలగూడలో కూడా ఐదు లిఫ్ట్‌లు దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్లపాలెం, కేశవాపురం, తోపుచర్ల లిఫ్ట్‌లను  మంజూరు చేశాం. నకిరేకల్‌లో అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్‌, హుజూర్‌ నగర్లో ఒక లిఫ్ట్‌ మంజూరుచేశాం. మొత్తంగా ఈ జిల్లాకు 15 లిఫ్ట్‌లను మంజూరుచేశాం. ఇవన్నీ ఏడాదిన్నరలో పూర్తిచేసి మీకు అందిస్తాం. ఇవి పూర్తిచేస్తే జిల్లాలో ఎగువ ఆయకట్టుకు నీళ్లు అందుతాయి. మంచి లాభం జరుగుతది. ఇక చివరగా, మనం పాలేరుతోని పెద్దదేవులపల్లితో అనుసంధానం చేస్తే బ్రహ్మాండంగా సాగర్‌ ఆయకట్టుకు ఢోకాలేకుండా అయితది.

మనకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లయినా ఇప్పటికీ దళితజాతి వెనుకబడే ఉన్నది. అందుకోసమే ‘దళిత బంధు’ అనే అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీనికోసం రూ.లక్ష కోట్లయినా సరే ఖర్చుచేస్తామని చెప్పాం. మన రాష్ట్రంలో సుమారు 16-17 లక్షల దళిత కుటుంబాలున్నయి. వీళ్ళలో  ‘దళితబంధు’కు అర్హత ఉన్నవారు 75-85 శాతం మంది వుంటరని  అనుకున్నా, దాదాపు 12 లక్షల కుటుంబాలు లెక్కకు వస్తయి. ఇలా వున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున బ్యాంకుల లంపటం లేకుండా అందిస్తది.  దళిత సోదరుల అభివృద్ధిని కాంక్షించి, ఏదో ఒక గొప్ప పనిచేస్తే తప్ప వాళ్లు పైకి రారు అని ఆలోచించి ఈ పథకం పెడుతున్నం అని ముఖ్యమంత్రి వివరించారు.

ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో లబ్ధిదారులే ఏం చేసుకోవాలో వారికి వారే నిర్ణయించుకొనేటట్టు మంచి పథకాన్ని రూపకల్పన చేశాం. వచ్చే సంవత్సరం నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు మంజూరుచేసి ఈ  కార్యక్రమం అమలుచేస్తం. ఈ ఏడాది మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఒక వంద కుటుంబాలకు వచ్చేటట్టు బడ్జెట్లో పెట్టిన రూ.వెయ్యి కోట్లకు మరో రూ.200 కోట్లు కలిపి అమలుచేస్తం. రాబోయే బడ్జెట్లలో ప్రతి ఏడాది దశలవారీగా చేసుకొంటూ 12 నుంచి 13 లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటది.  

మన దేశం పుట్టినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా దళితులను వాళ్ల ఖర్మానికి వాళ్ళను వదిలేశారు తప్ప.. ఎవరూ ఇటువంటి కార్యక్రమం తీసుకు రాలేదు. కేసీఆర్‌ చేస్తే ఏదైనా మొండిగా చేస్తడు. ఇది గనుక చేస్తే రాజకీయంగా మిగతావాళ్ళకి పుట్టగతులు ఉండవని గ్రహించినవాళ్లు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నరు. అందుకే అందరికీ గుండెదడ మొదలైంది. దళిత సోదరులకు నేను ఒక్కటే మనవి చేస్తున్న. ‘దళితబంధు’ పెట్టాలని నాకు ఎవరూ దరఖాస్తు ఇవ్వలేదు. ఎవరు ధర్నా చేయలేదు. డిమాండ్‌ చేయలేదు. మేం సుమోటోగా తీసుకుని, తెలంగాణ తెచ్చినవాళ్లంగా, మీ తెలంగాణ బిడ్డగా నేనే మేధోమథనం చేసి, ఏ వర్గంవారు ఎట్ల ఉన్నరో ఆలోచన చేసి అమలుచేస్తున్నం. మీ అందరికీ తెలుసు గీత కార్మికులు, చేనేత కార్మికులను ఏవిధంగా ఆదుకొన్నమో. గీత కార్మికులకు చెట్ల రకం పూర్తిగా మాఫీచేశాం. అనేక వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకొంటూ ఈ రోజు దళితుల కోసం ఈ కార్యక్రమం తెచ్చాం. వందకు వందశాతం ఆరు నూరైనా సరే ఈ పథకాన్ని అమలుచేస్తం. నేనే స్వయంగా పర్యవేక్షణ చేస్త. తెలంగాణ దళితజాతి కూడా భారత దళిత జాతికే ఆదర్శంగా నిలబడుతుంది. 

దళితబంధు అయితదా.. పోతదా? అని మాట్లాడుతున్నరు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం జీర్ణంకానివాళ్లు రకరకాల మాటలు మాట్లాడుతరు. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే. మీరు అందరికంటే ఎక్కువ విజ్ఞులు. ఎక్కువ అవగాహన ఉన్నవారు. మేం చేసిన పనులు మీ ముందే ఉంటయి. కాబట్టే నాగార్జునసాగర్‌లో మీరు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. మీ దీవెనలు ఉన్నంత కాలం పేద వర్గాల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమంకోసం ముందుకు వెళ్తాం. మేము ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లినా బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నరు. అంటే మా  ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నరు. మీ ఆదరణ, మీ దీవెన ఉన్నంత కాలం ఇదే పద్ధతిలో సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు పోతాం. సాగర్‌ నియోజకవర్గంలో పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. సెంట్రల్‌ తెలంగాణ జిల్లాల్లో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. కానీ, ఈ రోజు రైతుబీమా, రైతుబంధు పథకాలతో బ్రహ్మాండంగా రైతుల్లో ధీమా వచ్చింది. కరువు ప్రాంతమని, వెనుకబడిన ప్రాంతమని, ఎకసెక్కాలు ఆడి.. ఎగతాళి చేయబడిన నా తెలంగాణ.. ఈ రోజు దేశానికే అన్నం పెడుతున్నది. తెలంగాణ బిడ్డగా నాకు గర్వంగా ఉన్నది.

నా తెలంగాణ, 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం పెడుతున్నది  నిజం కాదా? అని నేను అడుగుతున్న. పత్తిని పండించడంలో  దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయం నిజం కాదా? అని నేను అడుగుతున్న. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులే పార్లమెంటు సాక్షిగా తెలియజేస్తున్నరు. ఈ రోజు విద్యుత్తు వినియోగం లో  దేశ తలసరి వినియోగం 1,100 యూనిట్లు  అయితే, అది మన రాష్ట్రంలో 2,070 యూనిట్ల పర్‌ క్యాపిటాగా వున్నది. విద్యుత్తు వినియోగంలో.. దేశంలోనే నంబర్‌ వన్‌ పర్‌ క్యాపిటా విద్యుత్తు వినియోగం చేసే రాష్ట్రం తెలంగాణ కాదా? అని అడుగుతున్న. 

నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను.. మీలో ఎవరికి ఏ సమస్య ఉన్నా వ్యక్తిగతంగా వచ్చి చెప్పండి. ఎక్కడో ఉండి అరిచే అవసరం లేదు. ఇది పాత ప్రభుత్వం కాదు.. పాత నాయకత్వం కాదు.. నోముల భగత్‌ మీ బిడ్డ.. ఎవరైనా సరే రావొచ్చు. ఆయనను కలవొచ్చు.. దరఖాస్తు ఇవ్వొచ్చు.. మంచిగ కడుపునిండా మాట్లాడవచ్చు. కానీ అరిచి రంకెలు వేసి పిచ్చి డ్రామాలు చేయడం మంచిది కాదు. అనేక విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తూ, ప్రగతి పథంలో  కొనసాగుతూ, మీ దీవెనతో ప్రభుత్వం ముందుకు వెళుతా ఉన్నది. మీ దీవెన ఉన్నంతవరకు ఎవ్వరు ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా.. వాటిని పట్టించుకోకుండా కచ్చితంగా ఈ ప్రగతి మార్గాన్ని కొనసాగిస్తం. మేం వెనుకకు తిరిగి చూడం. ప్రభుత్వం ప్రకటించిన అన్ని కార్యక్రమాలు అమలు చేసి తీరుతం.

నేను చాలా సగర్వంగా చెప్తున్న. ఆనాటి చంద్రబాబు సర్కార్‌ పంటలకు నీళ్లు ఇవ్వడం ఆపేస్తే.. ఇదే నాగార్జునసాగర్‌ కట్టమీద నేను 50 వేల మంది రైతులతోటి దండోరా మోగించి నీళ్లు సాధించుకొన్నం. ఈ రోజు.. మీ జిల్లా నేత మిత్రుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఇతర మిత్రులు వెళ్లి నీళ్లు విడుదల చేశారు. మన వాటా మనం తీసుకొని సాగర్‌ కింద రెండు పంటలు పండించుకొంటున్నం. ఇదే పద్ధతిలో కృష్ణాలో కచ్చితంగా మన వాటా మనం వాడుకొనేలా చర్యలు తీసుకొంటాం. గతంలో నేను కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసినప్పుడు చాలామందితో పలు విషయాలు పంచుకొన్న. అప్పట్నుంచి వాటికి పరిష్కారాలు వెతుకుతున్నం. ఇప్పటికే కొన్ని పరిష్కరించాం. మిగిలినవి కూడా పరిష్కరిస్తం అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.