సీఎం సహాయ నిధికి ముఖరా కె గ్రామం విరాళం


తెలంగాణలోని పల్లెలు ప్రగతి పథాన పయనిస్తున్నాయనడానికి సాక్ష్యంగా ఈ విజయ గాథను పేర్కొనవచ్చు. తమ గ్రామాన్ని పరిశుభ్రంగా వుంచుకోవడం వల్ల సేకరింపబడిన చెత్త ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకున్నది ముఖరా కె గ్రామం. గ్రామ స్థాయిలో సోలార్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేకుంటున్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలన్నింటినీ బ్రతికించుకొని, వాటిని పరిరక్షిస్తున్నారు. తమ గ్రామం ఆర్జించిన ఆదాయం నుండి ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలను అందజేసే సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్, గ్రామస్థులు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిశారు.
తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని, స్వయం సమృద్ధి బాటలో తెలంగాణ పల్లెలు పయనించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. ముఖరా కె గ్రామంలో పోగయిన చెత్తతో తయారుచేసిన వర్మికంపోస్టుతో వచ్చిన అదాయం నుంచి ఒక లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయనినిధికి ఇవ్వడం అద్భుతమని ముఖ్యమంత్రి అన్నారు.
సీఎంను కలిసిన ముఖరా కె గ్రామ సర్పంచ్, గ్రామస్తులు సీఎం సహాయ నిధికి లక్ష రూపాయల చెక్కును అందించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…
తెలంగాణ పల్లెలు ప్రగతి ప్రస్థానంలో సాగుతున్నాయని, గ్రామాలలో పల్లె ప్రగతి ఫలాలు కనిపిస్తున్నాయని, స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేెస్తున్నాయనడానికి ముఖరా కె గ్రామం ఉదాహారణగా నిలిచిందన్నారు. గ్రామంలో సేకరించిన తడిచెత్త ద్వారా వర్మికంపొస్ట్ తయారు చెసి రూ.7 లక్షల అదాయాన్ని సంపాదించడం అద్భుతమన్నారు. అందులోంచి ముఖరా కె సర్పంచ్ లక్ష రుపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వడం అభినందనీయమన్నారు.
గ్రామానికి వచ్చిన అదాయం నుంచి రూ.4 లక్షలతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామని, 2 లక్షల రూపాయలతో డిజిటల్ లైబ్రరి ఏర్పాటు చేశామని, 1 లక్ష రుపాయలు సీఎం సహాయనిధికి ఇస్తున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ సీఎం కు వివరించారు.
కాగా…ముఖరా కె గ్రామంలో నాటిన లక్ష మొక్కలను వంద శాతం రక్షించడం ద్వారా ఈ గ్రామం దేశానికే అదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్న సర్పంచ్ గాడ్గె మీనాక్షిని, గ్రామ కమిటీని, గ్రామస్తులను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా గ్రామంలో తయారు చేసిన వర్మికంపోస్టు ప్యాకెట్ ను ముఖ్యమంత్రికి సర్పంచ్ మీనాక్షి అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంపిటిసి గాడ్గె సుభాష్ తదితరులున్నారు.