సైన్స్‌ రహస్యాలు

By: దోర్బల బాలశేఖరశర్మ

హిమగర్భంలో అనూహ్య జీవజాలం

అంటార్కిటికా హిమగర్భంలోని అతికొద్ది భాగంలోనే శాస్త్రవేతలు తాజాగా డజన్ల సంఖ్యలో అనూహ్య జీవజాలాలను కనుగొన్నారు. సూర్యకాంతి ఏ మాత్రం సోకని అత్యంత వైవిధ్యమైన, క్రూరమైన పర్యావరణంలో అవి లభించడం వారిని ఆశ్చర్యపరుస్తున్నది. అంటార్కిటికా సముద్రం (సదరన్‌ ఓసియన్‌)పై మొత్తం సుమారు 6 లక్షల చదరపు మైళ్ల మేర హిమఖండాలు ఉండగా, సుమారు 900 మీటర్ల అడుగునుంచి ఒక డ్రిల్‌ (రంధ్రం) గుండా సేకరించిన కొద్దిమేర నమూనాలోనే నమ్మశక్యం కాని రీతిలో జీవజాలం బయల్పడిరది. 2018లో ఎక్‌ స్ట్రీమ్‌ ఐస్‌ షెల్ఫ్‌ మంచుపలకపై జర్మనీకి చెందిన ఒమెరవెన్‌ లోని ఆల్‌ ఫ్రెడ్‌ వెజెనర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు గెర్హార్డ్‌ కుహ్న, రాఫేల్‌ గ్రోమిన్‌ ప్రభృతులు జరిపిన డ్రిల్‌ (రంధ్రం)లో తొలుత 200 మీటర్ల లోతుకు, తర్వాత మరో 100 మీటర్ల లోతుకూ మరిగే ఉష్ణజలాలను పంపించి పై నమూనాను సేకరించారు. తద్వారా ‘‘బయటపడిన జీవావశేషాలు అత్యంత అరుదైనవి, భిన్నమైనవి’’ అని ‘బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే’ సహరచయిత, సాగర జీవశాస్త్రవేత్త డేవిడ్‌ బేస్‌ ప్రకటించారు. ఆ కొద్ది (నమూనా) భాగంలోనే అత్యధిక సంఖ్యలో 77 వరకు కొత్త జీవావశేషాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

సూర్యకాంతి జాడకు అవకాశమే లేని తీవ్ర కఠోర (మైనస్‌ 2.2 సెల్సియస్‌ ఉష్ణోగ్రత) అతిశీతల పర్యావరణంలో మనుగడ సాగించగల ఈ జీవులు సుమారు 6,000 ఏండ్ల కిందటి సూక్ష్మజీవజాలమైన సిలియేట్స్‌, డైనోఫ్లాగెల్లేట్స్‌ (ciliates and dinoflagellates) తరగతులకు చెందినవిగా భావిస్తున్నట్టు డేవిడ్‌ తెలిపారు. ఇవి బాహ్య జల గర్భంలో సుమారు 8 నుంచి 9 కి.మీ. అడుగున వుండగలవని వారు అంటున్నారు. తుపానులు, వరదలు, అగ్నికీలలు వంటి అడ్డంకులేవీ ఉండని అంతటి సంక్లిష్ట పర్యావరణంలో వాటి మనుగడ ఎలా సాగుతుందన్నదే వారికి అంతుబట్టని విషయంగా ఉంది.

భూమి ద్రవ్యరాశిలో మార్పులు విశ్వం వలె భూమికూడా ద్రవ్యరాశి పరంగా ‘సంకోచ వ్యాకోచాల’కు లోనవుతున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనివల్ల ‘భవిష్యత్తులో భూమిమీది జీవజాతులకు ఏమైనా ముప్పు పొంచి వుంటుందా?’ అన్న కోణంలోనూ వారు పరిశీలిస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ ఉండదని మాత్రం వారు తేల్చారు. ఉల్కాపాతాల ద్వారా ఒకవైపు టన్నులకొద్దీ రోదసీ ధూళి భూమిపైకి వచ్చి చేరుతున్నట్టుగానే మన వాతావరణంలోని వాయువుల ద్వారా ఇక్కడి ద్రవ్యరాశి కూడా అంతరిక్షంలోకి వెళ్లిపోతున్నదని ‘నాసా’కు చెందిన లేంజ్‌ లీ (Langley) రీసర్చి సెంటర్‌ (విర్జీనియా)లోని సీనియర్‌ శాస్త్రవేత్త గ్యూలామె ధోనోఫ్‌ (Guillaume Gronoff) తెలిపారు. ఈ ‘భూసంకోచం’ మరీ భారీ మొత్తంలో ఏమీ లేదని ఆయనన్నారు. సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిన భూగ్రహం ఇప్పటికి ఎంతమేర ద్రవ్యరాశిని కోల్పోయిందో తేల్చడమైతే చాలా కష్టం. ఎందుకంటే, అసలు భూమి మొత్తం బరువు మనకు తెలియదు. ఉపగ్రహాల ద్వారా అందిన సమాచారం మేరకు ‘ఏడాదికి సుమారు 88, 100 టన్నుల ద్రవ్యరాశి భూమినుండి పలాయనమై పోతున్నట్టు ఆయన తెలిపారు. ఇది చాలా, చాలా, చాలా అత్యల్పమని ఆయనన్నారు.

అంటార్కిటికా ముప్పు అయిదేళ్ల లోనేనా? ‘ప్రళయదిన హిమానీనదం’ (Doomsday Glacier) గా పేర్గాంచిన అంటార్కిటికాలోని ‘ద్వైట్స్‌ గ్లేసియర్‌’కు చెందిన ఒక పెద్ద పలక మరో మూడు నుంచి అయిదేళ్లలోనే కుప్ప కూలిపోయే ప్రమాదం కనిపిస్తున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా సముద్రమట్టాలు 85 సెం.మీ. లేదా రెండు అడుగులు, అంతకు మించి కూడా పెరుగవచ్చునని వారు వెల్లడిరచారు. ఈ హిమఖండం సుమారు 120 కి.మీ. మేర విస్తరించి వున్నదని, ఫ్లోరిడా రాష్ట్రమంత విశాలమైందనీ వారన్నారు. ఈశాన్య అమెరికా రాష్ట్రం లూసియానాకు చెందిన న్యూ ఆర్లియాన్స్‌ నగరంలో గతేడాది (2020) డిసెంబర్‌ 18న జరిగిన ‘అమెరికన్‌ జియోఫిజికల్‌ యూనియన్‌’ సమావేశంలో హిమానీనద. శాస్త్రవేత్తలు ఈ మేరకు ముందస్తు హెచ్చరిక చేశారు. పై హిమఖండం ఇప్పటికే ప్రపంచ సముద్రమట్టాల పెరుగుదలలో సుమారు 4శాతం ప్రభావాన్ని కలిగివున్నట్లు వారు చెబుతున్నారు.

ఈ శతాబ్దం చివరి నాటికి (2100 సంవత్సరం వరకు) ‘జ్వైట్స్‌ గ్లేసియర్‌’ మొత్తం (పూర్తిగా) కరిగిపోనున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటార్కిటికాలోని అతిపెద్ద (భారీ), అత్యంత ఎత్తయిన హిమానీనదాలలో ‘డ్వైట్స్‌’ ఒకటి కావడం వల్ల ఈ విపత్తు ప్రపంచ సముద్రమట్టాలను అనూహ్య స్థాయిలో పెంచుతుందని, పర్యవసానంగా అనేక తీరప్రాంతాలు నీటిలో మునిగిపోవచ్చునని వారు అన్నారు. అక్కడి సముద్ర నేలపై ఈ హిమఖండం పట్టు రాన్రాను సన్నగిల్లుతున్నదని, ఉష్ణజలాల కారణంగా దాని మంచు కరిగే వేగం అంతకంతకూ పెరుగుతున్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తన సమీప గ్రౌండిరగ్‌ లైన్‌ వైపు ఏడాదికి 2 కి.మీ. ఉపరితల వేగంతో కదులుతున్న ఈ అతిభారీ (డ్వైట్స్‌) గ్లేసియర్‌ వల్ల ప్రపంచానికి సంభవించబోయే ముప్పును దృష్టిలో పెట్టుకొనే వారు దీనిని ‘ప్రళయదిన హిమానీనదం’గా పిలుస్తున్నారు.

1,306 కాళ్ల అద్భుత జీవి!

మనం నమ్మి తీరవలసిని నిజమిది. నిజానికి ‘సహస్రపాద’ జీవులు (millipedes) వుంటాయన్నది ‘అబద్ధమనే’ అనుకుంటున్నాం. కానీ, కీళ్లమధ్య సందులు కలిగివుండే అకశేరుకాల వర్గానికి చెందిన ‘ఆగ్రోపాడ్స్‌’ (arthropods: లాటిన్‌ భాష) గా పిలిచే అసాధారణ జీవులకూ అత్యంతాసక్తికరంగా వెయ్యికి మించి పాదాలు వుండవు. అసలు, 750 కాళ్లకు మించిన ‘సహస్రసాద’ జీవులు ఏవీ ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు. కానీ, ఆధునిక వైజ్ఞానిక చరిత్రలోనే తొలిసారిగా 1,908 కాళ్ల అద్భుత జీవిని తాజాగా పశ్చిమ ఆస్ట్రేలియాలో కనుగొన్నారు.

భూగర్భంలో సుమారు 60 మీటర్ల లోతున లభ్యమైన ఈ సహస్రపాద జీవి 85 మిల్లీమీటర్ల పొడవును కలిగి ఉంది. ‘యూమిల్లీసెస్‌ పర్సెఫోన్‌’ (Eumillipes perscphone) పేరుతో పిలిచే ఒక కొత్త జాతి ఆడజీవికి చెందిన నమూనాగా శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో కాళ్లుగల జీవి ప్రస్తుతానికి ఇదేనని వారంటున్నారు. ‘సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌’ ఆన్లైన్‌ జర్నల్‌లో గత ఏడాది (2021) డిసెంబర్‌ 16న పరిశోధకులు నమోదు చేసిన ప్రకారం, ఈ అత్యంత అరుదైన జీవి పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన ఒకానొక ‘పాక్షిక శుష్కపొద’(semi-arid scrubland) నేలగర్భంలో లభ్యమైంది. అక్కడే దారం పోగుల్లా పాకుతున్న మరో ఏడు జీవులను కూడా వారు సేకరించారు. సూక్ష్మదర్శిని సహాయంతో చూసినప్పుడు పై నమూనా జీవికి వందలాదిగా, గత రికార్డు (750)కు దాదాపు రెట్టింపు సంఖ్యలో కాళ్లు కనిపించాయి. లేత మీగడ రంగులో వున్న పై సహస్రపాద జీవులకు ‘కళ్లు’ లేవు. కానీ, డ్రిల్‌ బిట్లవలె పొడచుకు వచ్చినట్టున్న తలల వంటి పెద్ద కొమ్ములు వున్నాయి.

‘‘ఈ అరుదైన జీవులు సాధారణంగా భూగర్భంలోనే నివసిస్తాయని’ అమెరికాలోని ‘విగ్రీనియా టెక్‌’ విశ్వవిద్యాలయానికి కీటక శాస్త్రవేత్త పాల్‌ మారిక్‌ (Paul Marck) అభిప్రాయపడ్డారు. కదిలే పాస్తా వలె ఇవి మట్టిలో ఏక కాలంలో ఎనిమిది వైపులా కదల గలవని, బూజు, కుక్క గొడుగులు వంటి శిలీంధ్రాలను తిని బతుకుతున్నట్టున్నాయని ఆయన అన్నారు. అయితే, అంత లోతున, భూగర్భ చీకట్లో నివసించే శిలీంధ్రాలు’ ఏవో శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకైతే తెలియదు. కాగా, ‘నిజమైన సహస్రపాద జీవులు అంటే ఏమిటో’ మన పాఠ్యపుస్తకాలలో కొత్త నిర్వచనం ఇచ్చుకోవలసిన పరిస్థితి మాత్రం భవిష్యత్తులో తప్పక రావచ్చునని పాల్‌ అంటున్నారు.