గిరిజన కులదైవం నాగోబా జాతర

girijanaluఅప్పుడు భాలేష్‌కాల్‌ – సోదర సమేతుడై నాగశేషుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ఏడు కడవలతో పాలు, పెరుగు, నెయ్యి, పంచాదార, తేనె, పెసరపప్పు, శనగపప్పును నైవేద్యంగా సమర్పించి సంతృప్తుణ్ణి గావిస్తాడు, అప్పుడు శేషుడు సంతసించి వారిని అనుగ్రహించి, తన అంశతో భూలోకంలో ఉంటున్న వాళ్ళందరిని దర్శించాలని కోరుకుంటాడు. అప్పుడు భాలేష్‌కాల్‌ తన సోదరులతో కలిసి గిరిజన గ్రామాన్ని చూపించి నాగుణ్ణి తమవద్దే, తమ మధ్యే ఉండమని వేడుకుంటాడు. అప్పుడు శేషుడు సంతసించి నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను, నేను యిక్కడే ఈ కేస్లాపూర్‌లో ఉంటాను. మీ కోరికలు, కష్టాలు తీరుస్తానని అంతర్దానమవుతాడు.

అప్పటి నుండి మేస్రం జాతి గోండులు – శేషుడు అంతర్ధానమైన రోజుని పెద్ద పండగగా ప్రత్యేక భక్తిశ్రద్దలతో, నియమనిష్టలతో ఆ దేవుణ్ణి కొలచి ఆరాధిస్తారు. ఆ దినమే పుష్యమాస అమావాస్య రోజు, ఆ రోజుకు పదిహేను రోజుల ముందే గోండులు నాగ దేవుణ్ణి శుద్ధి చేయడానికి పవిత్ర గోదావరి జలాలకోసం మేస్రం వంశస్తులు కొత్త కుండల్లో – నేటికీ కాలినడకన గోదావరికి వెళ్లి పవిత్ర జలాలు తెచ్చి శుద్ధి చేసి తమ భక్తి శ్రద్ధలను ప్రదర్శిస్తారు.
పవిత్ర గోదావరి జలం కోసం మేస్రం వంశ గిరిజనులు 75కి.మీ. దూరంలో జన్నారం మండలం కలమడుగు గ్రామసమీపంలో హస్తిన మడుగు నుండి జలాన్ని సేకరిస్తారు. జలానికి వెళ్తున్నప్పుడు, వస్తున్నపుడు అనేక గ్రామాల్లో ఊరి పోలిమేరలల్లో సేద తీరుతారు. వారం రోజులు పోవడం, వారం రోజులు రావడం గడుస్తుంది. సేద తీరిన గ్రామంలో వీరిని ` ప్రత్యేకంగా గౌరవించి అన్న పానీయాలు సమర్పిస్తారు.

పున్నమి చంద్రోదయంతో మొదలైన గోదావరి జల సేకరణ కార్యక్రమం అమవాస్యతో పూర్తవుతుంది. అమవాస్య అర్థరాత్రి గోదావరి జలాలతో కేస్లాపూర్‌ ఆలయం చేరుకుంటారు.

శేషుణ్ణి పుణ్య గోదావరి జలంతో పాలతో అభిషేకించి పుట్టమన్నుతో చేసిన పోయ్యిపై నవ ధాన్యాలతో నైవేద్యం వండి అర్పిస్తారు.