|

కొత్తగా 33 బీసీగురుకులాలు 15 బీసీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు….

తెలంగాణ విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులను అమలుపరుస్తున్నారు. జిల్లాల్లో వున్న బీసీ విద్యార్థినీ, విద్యార్థుల కోసం మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీల ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 261 బీసీ గురుకులాలు అందుబాటులో వున్నాయి. ఇపుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న 33 బీసీ గురుకుల పాఠశాలలతో కలిపి ఆ సంఖ్య 310కి చేరింది. ఈ కొత్త పాఠశాలల్లో 7,920 మందికి, కాలేజీల్లో 3,600 మందికి కలిపి అదనంగా 11,520 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 19 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. విద్యార్థుల వినతులను విద్యా అవసరాలను దృష్టిలో వుంచుకొని ముఖ్యమంత్రి ప్రతి ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తూ, వస్తున్నారు.

బీసీ విద్యార్థుల కోసం 2017-18లో 119 మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను నెలకొల్పడం జరిగింది. 2019-20లో మరో 119 పాఠశాలలు, 19 జూనియర్‌ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీని నెలకొల్పారు. అప్పటినుండి పాఠశాలలను క్రమంగా జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ విద్యార్థుల కోసం 143 పాఠశాలలు, 119 స్కూల్‌ కమ్‌ జూనియర్‌ కాలేజీలు, 19 జూనియర్‌ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ కలిపి మొత్తం 261 ఉన్నాయి. వీటిలో 1,52,440 మంది విద్యార్థులు ఉచితంగా నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి గురుకులాలకు, 15 డిగ్రీ కాలేజీలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పందిస్తూ.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 15 బీసీ డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం అనేది దేశ చరిత్రలోనే తొలిసారని అన్నారు. ఇప్పటికే ఉన్న 261 గురుకుల స్కూళ్లకు అదనంగా జిల్లాకొకటి చొప్పున కొత్తగా 33 గురుకులాలను, 15 డిగ్రీ కాలేజీలను బీసీలకు కేటాయిస్తూ బీసీ సంక్షేమశాఖ జీవో విడుదల చేసిన సందర్భంగా మొత్తంగా బీసీ గురుకులాలు 19 నుండి 310కి పెరిగాయని మంత్రి గంగుల కరీంనగర్‌లో వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు

ఈ సంవత్సరం నుండే వీటిలో మార్కెట్లో డిమాండ్‌ ఉండే 8 రకాల కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులతో ప్రారంభిస్తు న్నామన్నారు. వీటి ద్వారా 1200 మంది విద్యార్థులకు అదనంగా 4800 మంది బీసీ బిడ్డలకు లబ్ధి చేకూరుతుందన్నారు మంత్రి గంగుల. డిగ్రీ కాలేజీలను గతంలో ముఖ్యమంత్రి హామీనిచ్చిన విధంగా కరీంనగర్‌, హాలియాలకు డిగ్రీ కాలేజీలను కేటాయించామని, మిగతా వాటిని కూడా ఎక్కడ ఏర్పాటు చేయనున్నది త్వరలోనే తెలియజేస్తామన్నారు.

జిల్లాకొకటి చొప్పున కేటాయించిన  బీసీ గురుకులాలకు సైతం స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని వీటిలోనూ ఈ సంవత్సరమే అడ్మిషన్లు అందిస్తున్న నేపధ్యంలో 5, 6, 7 తరగతులకు కలిపి ప్రతీ విద్యాలయంలో 240 మంది చొప్పున దాదాపు 8000 మంది బీసీ విద్యార్థులకు అదనంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే చాలా గురుకులాలకు సొంత భవనాల్ని సమకూర్చామని, దశల వారీగా అద్దె గృహాల నుండి పక్కా భవనాల్ని నిర్మించి తరలిస్తామన్నారు మంత్రి గంగుల. పెంచిన విద్యాలయాలకు సైతం సిబ్బందిని ఇదే సమయంలో తీసుకుంటామన్నారు. బీసీ సంక్షేమ గురుకులాల్లో నాణ్యమైన భోజనం, వసతితో పాటు బ్లాంకెట్లు, జాకెట్స్‌, ట్రాక్‌ సూట్స్‌, కిచెన్‌ యుటెన్సియల్స్‌తో పాటు కార్పోరేట్‌ పాఠశాలలకు దీటుగా డిజిటల్‌ క్లాస్‌ రూంలను ఏర్పాటు చేస్తామన్నారు. వానాకాలం, చలికాలంలో స్నానానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు చేసిన విజ్ఞ్యప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగానే 80 కోట్లు మంజూరు చేశారని, ఈ సంవత్సరమే అన్ని గురుకులాల్లో సోలార్‌ వాటర్‌ హీటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి గంగుల.