|

రక్షణ వ్యవస్థలో నవశకం 

మనం నూతనంగా ప్రారంభించుకుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ తో ఓ వైపు శాంతిభద్రతల పరిరక్షణ, మరోవైపు తెలంగాణలోని మారుమూల ప్రాంతాలలో జరిగిన సంఘటనలు కూడా వెంటనే తెలుసుకునే సమాచార సేకరణ సాధ్యమవుతుందని, ఈ సెంటర్ ప్రారంభంతో పాలనలో ఒక నవశకం మొదలవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటేడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ… ఈ భవన నిర్మాణం వెనుక ఉన్న ముఖ్య ప్రేరణ, కర్త, రూప కర్త డీజీపి మహేందర్ రెడ్డి అని, కమాండ్ కంట్రోల్ సెంటర్ క్రెడిట్ మొత్తం డీజీపికే దక్కుతుందని కొనియాడారు. ఆయన పోలీస్ కమిషనర్ గా ఉండగా ఈ అద్భుత ఆలోచనకు నాంది పలికారన్నారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభంతో ప్రశాంత తెలంగాణ: ముఖ్యమంత్రి కేసిఆర్ 

ఈ సెంటర్‌లో కూర్చుని ఒకే చోట లక్షల కెమెరాలు పంపే దృశ్యాలను వీక్షించవచ్చునన్నారు. కూర్చున్నచోటి నుంచే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు పంపవచ్చునన్నారు. ప్రకృతి విపత్తు అయినా, సంక్షోభమైనా, భారీ బహిరంగ సభ అయినా ఇక్కడి నుంచే సిబ్బందిని సమన్వయం చేయవచ్చునని, అన్ని ప్రభుత్వ శాఖలను ఏకతాటిపైకి తెచ్చే వ్యవస్థ తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అని, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(సీసీసీ)గా వ్యవహరిస్తున్న ఈ వ్యవస్థ అనేక సాంకేతిక అద్భుతాలను సాధిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

సీసీసీ క్షేత్రస్థాయిలో పలు భద్రత విభాగాలతో అనుసంధానం చేసి ఉంటుందని, వీడియో సర్వైలెన్స్‌, రవాణా, ట్రాఫిక్‌, అత్యవసర సేవలు, పౌర సేవలకు సంబంధించిన అప్లికేషన్లు, రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, సెన్సార్లు జోడింపు. వీటన్నింటి ద్వారా రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే సీసీసీలో అలారంలు మోగుతాయి, స్క్రీన్లపై నోటిఫికేషన్లు వస్తాయని సీఎం తెలిపారు. ఆయా ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది పనితీరును గుర్తించే థర్డ్‌పార్టీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ సెంటర్లు సీసీసీకి జోడింపు జరిగిందన్నారు. 

ఇవే కాకుండా విపత్తులు, అత్యవసర సమయాల్లో రాష్ట్ర, జిల్లాస్థాయి, ప్రధాన పట్టణాలు, స్థానిక సంస్థలు ఇలా ప్రతి దశలోంచి సమాచార మార్పిడి. ప్రజలను రక్షించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు, నేరాలను కట్టడి చేయడం వంటి అంశాల్లో అవసరం మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేతాటిపైకి తేవడం, అవసరం అయితే ప్రైవేటు ఏజెన్సీలను సైతం కలుపుకోవడం తదితర సౌకర్యాలన్నీ సమకూరుతాయన్నారు. 

రాష్ట్రానికే గర్వకారణం

హైదరాబాద్‌లో ఇంతటి అద్భుతమైన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటైతదని ఎవరూ ఊహించలేదు. ఇది రాష్ట్రానికే గర్వకారణమని సీఎం అన్నారు. సంకల్పిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పటానికి సీసీసీ నిదర్శనమని. మొత్తం పరిపాలనకు ఇది మూల స్తంభంగా ఉంటుందని తెలిపారు.  

డ్రగ్స్‌ నిర్మూలన మన కర్తవ్యం

సమాజానికి డ్రగ్స్‌ పెను ప్రమాదమన్నారు. దీన్ని అరికట్టేందుకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సిలబస్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై విద్యావేత్తలు కూడా ఆలోచించాలన్నారు.

దేశ పోలీసు వ్యవస్థకే తెలంగాణ కలికితురాయి కావాలి 

తెలంగాణలో సందర్భోచిత, సంస్కారవంతమైన పోలీస్‌ వ్యవస్థ నిర్మితమై, దేశ పోలీస్‌ వ్యవస్థకే తెలంగాణ పోలీస్‌ ఓ కలికితురాయి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ సహాయంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ అద్భుతమైన ఫలితాలు సాధించాలని, తద్వారా ప్రజలకు గొప్ప సేవలు అందించాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా పేరుతెచ్చుకోవాలన్నారు. తెలంగాణ పోలీసు శాఖ సందర్భోచిత, సంస్కారవంతమైన పోలీస్‌ వ్యవస్థగా నిర్మితమై, భారతదేశ పోలీస్‌ వ్యవస్థకే కలికితురాయి కావాలన్నారు. ఎంత విజ్ఞత ఉన్నా సంస్కారం కొరవడితే ప్రయోజనం ఉండదు. పాత పద్ధతిలోనే పోలీసులు అనే మాట వినిపించొద్దు. కమాండ్‌ కంట్రోల్‌ సాయంతో పోలీస్‌శాఖ అద్భుత ఫలితాలు సాధించాలి. ప్రజలకు గొప్ప సేవలు అందించాలని సూచించారు. ఇదే శాఖలో పదవీ విరమణ చేసిన ఎంతో మంది అధికారులు హైదరాబాద్‌లో ఉండడం మన అదృష్టం. మీరంతా కమాండ్‌ కంట్రోల్‌ను సందర్శించి అవసరమైన సలహాలు ఇవ్వాలని కోరారు.

సైబర్‌ క్రైం కట్టడికి అంతర్జాతీయ విధానాలు

డీజీ లేదా అడిషనల్‌ డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి సైబర్‌ క్రైంపై స్పెషలైజేషన్‌ చేయించాలని, సైబర్‌ క్రైం కట్టడికి అంతర్జాతీయ  స్థాయిలో ఏ విధంగా అరికడుతున్నారో తెలుసుకోవాలని సీఎంకేసీఆర్‌ డీజీపీని కోరారు. ఈ మధ్యకాలంలో సైబర్‌ క్రైం ప్రపంచాన్ని గందరగోళానికి గురి చేస్తున్నదని, ఈ సైబర్‌ నేరగాళ్లు క్లిష్టమైన నేరగాళ్ళుగా మారారని, ప్రజలు వారి బారిన పడకుండా చూడాలని అన్నారు. నేరం చేసే వారు కూడా రూపాలు మారుస్తున్నారు. పట్టణీకరణ పెరిగిపోవటంతో పెద్దపెద్ద నగరాలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయని కేసీఆర్‌ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌లో డ్రగ్స్‌ వ్యసనంతో ఇబ్బంది పడేవారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడి మేయర్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు కల్పించుకొని డ్రగ్స్‌ను 95శాతం తగ్గించేశారు. మనం అనుకుంటే ఇక్కడా అరికట్టగలుగుతాం. మన పోలీసులపై నాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. నేను కూడా ఎక్కడ మాట్లాడినా మన పోలీసుల గురించి గర్వంగా చెప్తున్నా. పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మనం ఏది చేయాలనుకొన్నా చిత్తశుద్ధితో చేయాలి. చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి, సందర్భశుద్ధి, పట్టుదల, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు.

పోలీసు వ్యవస్థ సమాజానికి ఎంతో అవసరం

మానవ సమాజం ఉన్నంతకాలం పోలీసింగ్‌ ఉంటుంది. ఎంత ఉత్తమమైన పోలీసింగ్‌ ఉంటే ప్రజలకు అంత సేఫ్టీ, సెక్యూరిటీ లభిస్తుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంప్రూవ్‌మెంట్‌, రిఫార్మింగ్‌, అప్డేషన్‌ పోలీసింగ్‌ అవసరమన్నారు. పోలీసుశాఖలో అనేక రకాల సవాళ్లను ఎదుర్కొన్న అధికారులున్నారు. మనకు ఉన్నటువంటి గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ తదితరవాటికి ఆనాడే ఎంతో ముంజుచూపుతో బీజాలు వేశారు. మనుషులు తలుచుకొంటే సాధించలేకపోవడం అంటూ ఏమీ ఉండదు. పోలీసు అధికారుల్లో గొప్ప కౌశల్యం ఓర్పు, నేర్పు ఉంటాయి. ఆయా సందర్భాల్లో అవి కనిపిస్తాయి. ఆయా రంగాల్లో, వివిధ హోదాల్లో సమాజహితం కోసం సేవలందించారని కొనియాడారు. వారి సేవలు ఉపయోగించుకోవాలన్నారు.

శాంతిభద్రతలు పటిష్టం

అందరి కంట్రిబ్యూషన్‌, పోలీసుల పనితీరు, ప్రజల సహకారంతో ఎనిమిదేండ్లుగా రాష్ట్రాన్ని శాంతిభద్రతల నిలయంగా ముందుకు తీసుకెళ్తు న్నాం.  మనకు ఈ రోజు అద్భుతమైన సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి నేరాలపై మరింత నియంత్రణ పెరిగే అవకాశం ఉన్నది. మేము సింగపూర్‌ వెళ్లినప్పుడు అక్కడి పోలీస్‌ వ్యవస్థను చూసి రావాలని మహేందర్‌రెడ్డి నాకు చెప్పారు. అక్కడ ఓ సమావేశంలో సింగపూర్‌ అధికారులు.. మీరు హైదరాబాద్‌ను సింగపూర్‌ మాదిరిగా ఎప్పుడు చేస్తున్నారు? అని నన్ను అడిగారు. దానికి సమాధానం చెప్తూ ‘మేం ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టినం. కొంత సమయం కావాలి’ అని చెప్పిన. సింగపూర్‌లో అమ్మాయిలు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లి పని చేసుకొనే వాతావరణం ఉన్నది. అలాంటి పరిస్థితులు మన వద్ద కూడా రావాలి. అనుకుంటే వస్తాయి. గతంతో పోల్చితే హైదరాబాద్‌లో చాలావరకు నేరాలు తగ్గాయని పేర్కొన్నారు. మన రాష్ట్రం ప్రశాంతతకు నిలయంగా మారాలని, అభివృద్ధిలో దూసుకుపోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. 

మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవనాన్ని లక్షా 12 వేల 77 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి ప్రదేశాన్ని 360 డిగ్రీల కోణంలో పోలీస్‌ రాడార్‌ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు. మొదట్లో రూ.350 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణాన్ని మొదలుపెట్టినా, ఆ తర్వాత మరో రూ.200 కోట్లు కేటాయించడం జరిగింది. భవనం మొత్తం 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో 4 బ్లాకుల్లో A, B, C, D కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ టవర్లను నియమించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 84.2 మీటర్ల ఎత్తులో టవర్‌-A ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో B, C, S టవర్లను నిర్మించారు. సీసీసీలో అతి ముఖ్యమైనది ఆఫీస్‌ బిల్డింగ్‌ గా వ్యవహరించేది  టవర్‌-A, జీ ప్లస్‌ 20 అంతస్తుల్లో పైన హెలిప్యాడ్‌ను నిర్మించి కలిపి టవర్‌-A ను నిర్మించారు. ఇందులో ఓపెన్‌ ఆఫీస్‌ మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, ఇతర  క్యాబిన్లు ఉంటాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సీసీ కెమెరాలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఇందులో ప్రధానమైన హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించే వీలుంటుంది. నగరంలో ఇప్పటి వరకు ఏర్పాటైన 7.5 లక్షల సీసీ కెమెరాలను ఈ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు.  ప్రధానంగా ఇందులో ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌, పండుగలు, వేడుకలు, రాజకీయ పార్టీల ఆందోళనలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు.

ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలు

నగరంలో మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 250 ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు వున్నాయి. ఇవన్నీ కూడా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)కు అనుసంధానమై ఉంటాయి. ట్రాఫిక్‌ రద్దీ ఎలా ఉంది.? ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడటానికి కారణాలేమిటి..? ఎంత సేపట్లో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ అవుతుందనే విషయాలతో పాటు ట్రాఫిక్‌ను ఎటువైపు మళ్లించాలి, ఆంక్షలు, ఇతర అనేక విషయాలను పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌ ద్వారా సీసీసీ నుంచే చెబుతారు. దీంతో ట్రాఫిక్‌లో ఎక్కువ సేవు చిక్కుకోకుండా వాహనదారులు అప్రమత్తమవడానికి అవకాశం వుంటుంది. ఏదైనా నేరం జరిగినా, దొంగ నంబర్లు వేసుకొని తిరిగే వాహనాలను ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు గుర్తిస్తాయి. ఆ సమాచారాన్ని ట్రాఫిక్‌ పోలీసులకు అందిస్తాయి. ఆయా కూడళ్ల నుంచి వచ్చే వాహనాలను పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు డాటాను అందిస్తుంటాయి.

సోషల్‌ మీడియాకు ప్రత్యేక వింగ్‌

సోషల్‌మీడియాలో వచ్చే అవాస్తవాలు, పుకార్లు కొన్నిసార్లు ప్రజలను భయాందోళనకు గురిచేసేవిగా ఉంటాయి. అవి కొన్ని వర్గాలు, వ్యక్తుల మధ్య గొడవలు సృష్టించేవిగా ఉంటాయి. ఇలాంటి పోస్టులతో ప్రశాంతతకు భంగం కలుగుతుంది. సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించే వారు అధికంగా ఉన్నారు. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు సీసీసీలో కొత్తగా సోషల్‌మీడియా విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విభాగం సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు పర్యవేక్షిస్తూ వుంటుంది. 

కాయిన్‌ బాక్స్‌తో కాల్స్‌

ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే అలాంటి వారి సమస్యలను తెలుసుకోవడం కోసం నగరంలో ఎమర్జెన్సీ కాయిన్‌ బాక్స్‌లు ఉన్నాయి. కాయిన్‌ బాక్స్‌ల మాదిరిగా ఉంటూ ఫోన్‌తో వీడియోకాల్‌ చేసే అవకాశముంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఫోన్‌ బాక్స్‌ వద్దకు వెళ్లి సీసీసీకి ఫోన్‌ చేయవచ్చు. పోలీసులు కూడా ఎక్కడి నుంచి కాల్‌ వచ్చిందనే సమాచారం తీసుకొని, నిమిషాల వ్యవధిలోనే బాధితుల వద్దకు వెళ్లి తగిన సహాయం చేస్తారు.

కిడ్నాప్‌, ఇతరత్రా నేరాలు చేసి పరారవుతున్నారంటే వెంటనే మూడు పోలీస్‌ కమిషనరేట్ల పోలీసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు సీసీసీ నుంచి సందేశాలు వెళ్తాయి. దీంతో పాటు ఏ రూట్‌లో నుంచి కిడ్నాపర్లు, దొంగలు వెళ్లారనే సమాచారం తీసుకొని ఆ రూట్‌లోని కెమెరాలన్నింటినీ ఒకేసారి తనిఖీ చేస్తారు. దీంతో వేగంగా ఫలితాలు రావడంతో కేసుల దర్యాప్తు కూడా వేగంగా తేలిపోయే అవకాశం కలుగుతుంది.  నేరం చేసి వెళ్లే వ్యక్తులకు సంబంధించిన వాహనం నంబర్‌ను గుర్తించారంటే, ఆ నంబర్‌ను సీసీసీకి పంపిస్తారు. దీంతో ఆ నంబర్‌ను సర్వర్‌లో ఉంచడంతో ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఉన్న చోట ఆ వాహనం వెళ్లిందంటే వెంటనే సీసీసీకి సమాచారం వస్తుంది. దీంతో స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి నేరస్తులను పట్టుకుంటారు. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరుగుతుంది.

 పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురించిన అదనపు సమాచారం :

 2015 నవంబర్‌ 22న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. 2022 ఆగస్టు 4వ తేదీన సీఎం కేసీఆర్‌ ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ప్రారంభించారు. ఈ సెంటర్లో మొత్తం 6 లక్షల 42 వేల చదరపు అడుగులలో నిర్మాణం చేపట్టడం జరిగింది.  2.16 లక్షల చదరపు అడుగులు, సూపర్‌ స్ట్రక్చర్‌ ఏరియా 4.26 లక్షల చదరపు అడుగుల్లో ఉన్నది.

ఈ సెంటర్‌ ను మొత్తం ఐదు బ్లాక్‌ లుగా నిర్మించారు. టవర్‌ ‘ఏ’లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ తోపాటు 19 అంతస్తులు, టవర్‌ ‘బీ’లో రెండు బేస్‌ మెంట్లు గ్రౌండ్‌ ఫ్లోర్‌, 15 అంతస్తులు, టవర్‌ ‘సీ’లో ఆడిటోరియం గ్రౌండ్‌ ఫ్లోర్‌, రెండు అంతస్తులు, టవర్‌ ‘డీ’లో గ్రౌండ్‌ ప్లస్‌ మొదటి అంతస్తు,

టవర్‌ ‘ఈ’లో సీసీసీని 4 నుంచి 7 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఇది గాక మరో రెండు బేస్‌ మెంట్‌ లెవల్‌ లు ఉన్నాయి. అన్ని టవర్లలో టవర్‌ ‘ఏ’ ఎత్తయినది. దీనిలో మొత్తం 20 అంతస్తులు ఉన్నాయి. దీనిలోనే నాల్గో అంతస్తులో డీజీపీ చాంబర్‌, 18వ అంతస్తులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ చాంబర్లు వున్నాయి. 7వ అంతస్తులో ప్రముఖుల చాంబర్లు ఉన్నాయి. టవర్‌ ఏ, బీలను 14వ అంతస్తులో కలుపుతూ 400 మెట్రిక్‌ టన్నుల బరువుతో దేశంలోనే అత్యంత బరువైన స్కైవాక్‌ వంతెన నిర్మించారు. దీనికి సోలార్‌ ఫొటోవోల్టిక్‌ ప్యానల్‌ తో రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేశారు.

నైరుతివైపు ఉన్న టవర్‌ పైన హెలిపాడ్‌ ను ఏర్పాటు చేశారు. దీనిపై వీవీఐపీ మూమెంట్స్‌ కోసం హెలికాప్టర్‌ సేవలను వాడుకోవచ్చు. టవర్లలోని కింది ఫ్లోర్లలో ఆడిటోరియం, కేఫ్‌, మల్టీపర్పస్‌ హాల్‌, మీడియా సెంటర్‌, రిసెప్షన్‌ లాబీలను ఏర్పాటుచేశారు. టవర్‌ – ఏలో 550 వర్క్‌ స్టేషన్లు ఉంటాయి. వెయ్యి మంది సిబ్బంది పనిచేయవచ్చు. టవర్‌ బీలో 580 వర్క్‌ స్టేషన్లు ఉన్నాయి. 1500 మంది సిబ్బంది పనిచేయవచ్చు. అన్ని ఫ్లోర్లలోనూ కిచెన్‌ అందుబాటులో ఉంది.  ఆడిటోరియంను 590 మంది సీటింగ్‌ కెపాసిటీతో ఏర్పాటు చేశారు.

మొత్తంగా 600 కు పైగా వాహనాల పార్కింగ్‌ సౌకర్యం కలదు.  టవర్‌ – డీ గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో 125 మంది కూర్చునే సామర్థ్యంతో మీడియా బ్రీఫింగ్‌ హాల్‌ ఉంది. నేరుగా అక్కడి నుంచే లైవ్‌ కవరేజ్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో ప్రత్యేక డాటా సెంటర్‌ కోసం బెల్జియం, జర్మనీ నుంచి సర్వర్లను  తెప్పించారు. దాదాపు 30 పెటా బైట్ల సామర్థ్యం ఉన్న స్టోరేజీ ఉన్నది. అంటే 10 లక్షల సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ ఇందులో నిక్షిప్తం అవుతుంది.  ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ చూసే సామర్థ్యంతో భారీ స్క్రీన్‌ కూడా అందుబాటులో వుంది. అలాగే, తెలంగాణలోని అన్ని జిల్లాల సీసీటీవీల ఫీడ్‌, ఇతర సమాచారం కూడా హైదరాబాద్‌ లోని సీసీసీకి అనుసంధానమవుతుంది.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు : 

బహుముఖ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ సెంటర్‌ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ రంగంలోని అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకొంటూ విపత్తుల సమయంలో ప్రజలను సకాలంలో కాపాడటం, నష్టాన్ని తగ్గించడం దీని లక్ష్యం. నిరంతర పర్యవేక్షణతో రాష్ట్రంలో నేరాలను నియంత్రించడం కోసం పనిచేస్తుంది. ఈ సెంటర్‌ లో పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాల కేంద్రాలు అనుసంధానమై వుంటాయి. 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, అన్ని అంబులెన్సులు, ఫైర్‌ స్టేషన్లు, పోలీస్‌ స్టేషన్లు, అన్ని ప్రధాన లొకేషన్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు… ఇలా ప్రతి సమాచారాన్ని సీసీసీలోని హైఎండ్‌ డాటా ఎనాలసిస్‌ సెంటర్‌కు అనుసంధానిస్తారు.

 రాష్ట్రంలో ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, సీసీటీవీల్లోని ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ ద్వారా కెమెరాయే నేరుగా సీసీసీకి అలర్ట్‌ పంపుతుంది. అక్కడ పార్‌ఎప్‌ స్క్రీన్‌ పై వస్తుంది. దీంతో వెంటనే సిబ్బంది అలర్ట్‌ అవుతారు.