కొత్త విధానం.. ఐటీ రంగంపై తెలంగాణ ముద్ర

kcrప్రపంచ ఐ.టి రంగంపై తనదైన ముద్రవేసుకున్న తెలంగాణ రాష్ట్రం మరింతగా క్రియాశీలమయ్యేందుకు కొత్త ఐ.టి పాలసీని ఆవిష్కరించింది. ఐ.టి రంగానికి అత్యంత ఆకర్షణియ గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దటమే లక్ష్యంగా రూపొందించిన ఈ నూతన ఐ.టి పాలసీని హైదరాబాద్‌ లోని హెచ్‌.ఐ.సి.సి లో ఏప్రిల్‌ 14న అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో నూతన ఐ.టి పాలసీతోపాటుగా, మరో నాలుగు పాలసీలు స్టార్ట్‌ అప్‌కు చేయూతనిచ్చే ఇన్నోవేషన్‌ పాలసీ, ద్వితీయ శ్రేణి నగరాలకు ఐ.టి ని విస్తరించే రూరల్‌ టెక్నాలజీ పాలసీ, హార్డ్‌వేర్‌ అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్‌ పాలసీ, గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌ పాలసీలను కూడా ప్రభుత్వం ఆవిష్కరించింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రదానమైన ఐ.టి పాలసీని విడుదలచేయగా, గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌, ఐ.టి దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ ఎమెరిటీస్‌ నారాయణ మూర్తి, సహ వ్యవస్థాపకుడు టి.వి.మోహన్‌ దాస్‌ పాయ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె. సారస్వత్‌, రాష్ట్ర ఐ.టి శాఖామంత్రి కె.తారక రామారావులు ముఖ్యమంత్రికి సహకరించారు.

మన లక్ష్యం ఇదీ…: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ప్రధాన ఐ.టి కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐ.టి విధానాన్ని ఆవిష్కరించింది. పౌర సేవల వినియోగం, వినిమయంలో ఐ.టి ని గణనీయంగా విస్తరించాలని నిర్ణయించింది.

పల్లెలకు ప్రాధాన్యం అభినందనీయం 
పట్టణాలకు పరిమితమైన ఐ.టి విధానంలో ఇప్పుడు రూరల్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు చోటివ్వడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఐ.టి విధానంలో పల్లెలకూ ప్రాధాన్యం కల్పించినందుకు ఐ.టి శాఖామంత్రి కె. తారక రామారావును గవర్నర్‌ అభినందించారు. ఐ.టి రంగంలో అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నారని, ఇది నిజంగా సమ్మిలిత అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు.

నంబర్‌ వన్ సాధనే మా లక్ష్యం 
ఐ.టి శాఖా మంత్రి కె. తారక రామారావు మాట్లాడుతూ, ఈ నూతన ఐ.టి పాలసీ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా భావిస్తున్నాంమన్నారు. గత రెండున్నర దశాభ్దాలుగా హైదరాబాద్ ఐ.టి రంగంలో దేశంలో రెండో స్థానంలోనే ఉన్నదని, రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో నిలవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. సిలికాన్‌ వ్యాలీ, లండన్‌, బెర్లిన్‌, సింగపూర్‌ తరహాలో హైదరాబాద్‌ను మారుస్తామని మంత్రి చెప్పారు. నాలుగు అనుబంధ పాలసీలను ప్రస్థావిస్తూ, ఇన్నోవేషన్‌ పాలసీకి టీహబ్‌ను ఉదాహరణగా ఇన్నోవేషన్‌ పాలసీ 1000 ఐ.టి ఉత్పత్తులు, 300ఎలక్ట్రానిక్‌, 400 స్టార్టప్‌లు.

 • స్టార్టప్‌లకు 2,000 కోట్ల పెట్టుబడుల సమీకరణ.
 • టీ హబ్‌ రెండో దశలో 900 స్టార్టప్‌లకు మౌలిక సదుపాయం కల్పించడం.
 • ద్వితీయ శ్రేణి నగరాలలో రెండు ఇంక్యుబేటర్‌ కేంద్రాల ఏర్పాటు.
 • రాబోయే ఐదేళ్ళలో 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సిద్ధం చేయడం.
 • పీ.పీ.పి పద్ధతిలో 20 ప్రపంచవ్యాప్త కంపెనీలకు వేదికను సిద్ధం చేయడం.

ఇంక్యుబేటర్‌లకు ప్రోత్సాహకాలు– ఇంక్యు బేటర్‌ కేంద్రాలు వంద శాతం స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో కలిపి మ్యాచింగ్‌ గ్రాంట్‌ను అందజేస్తుంది. పని తీరును బట్టి ప్రోత్సాహకాలు..

అలాగే, స్టార్టప్‌లకు ప్రభుత్వ మద్దతు, గుర్తింపు పొందిన కేంద్రాల్లోని స్టార్టప్‌లకు 50 లక్షలకు మించని టర్నోవర్ ఉన్నవాటికీ 3 సంవత్సరాల వరకూ సీఎస్‌ టాక్స్‌, వ్యాట్‌, సీఎస్‌ టి రీయింబర్స్‌మెంట్‌. అంత ర్జాతీయ మార్కెటింగ్‌ ప్రక్రియలో భాగంగా ఒక్కో కంపెనీకి రూ. 5 లక్షల వరకూ ప్రోత్సాహం అందిస్తారు.

రూరల్‌ టెక్‌ పాలసీ ఐ.టి రంగ విస్తరణకు పెద్ద ఎత్తున కృషిచేస్తున్న రాష్ట్రప్రభుత్వం కేవలం హైదరాబాద్‌ నగరానికే ఐ.టి రంగం పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు సయితం టెక్నాలజీని విస్తరించేందుకు రూరల్‌ టెక్‌ పాలసీని రూపొందించింది. ఈ విధానం లక్ష్యలు…

 • డాటా ప్రాసెసింగ్‌, డాటా ఎంట్రీ, డాటా మేనేజ్‌మెంట్‌, డాక్యుమెంటరీ డిజిటలైజేషన్‌ వంటివి రూరల్‌ టెక్నాలజీ కేంద్రాల(ఆర్టీసి) లక్ష్యం.
 • కస్టమర్‌ సర్వీస్‌, వివరాల సేకరణ, టెక్నికల్‌ సపోర్టు వంటి శబ్ద ఆధారిత సేవలు కూడా ఈ కేంద్రాల ద్వారా అందించేందుకు ప్రతిపాదించారు.
 • టాస్క్‌ సమన్వయంతో ఆర్టీసి కేంద్రాలలో 10 వేల మందికి శిక్షణ.
 • రాబోయే మూడేళ్లలో 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు.

ప్రభుత్వ ప్రోత్సాహాలు: గ్రామీణ కేంద్రాలను ప్రారంభించిన కంపెనీలకు మొదటి మూడేళ్ళ లోపు పంచాయితీ పన్నుల మినహాయింపు. ఐ.టి కెంపెనీల స్థాయినిబట్టి ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. కనీస ధర, అభివృద్ధి చార్జీలు తీసుకొని ఆ భూములను అప్పగిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానంలో పేర్కొన్నట్టుగా విద్యుత్‌ చార్జీలలో రాయితీ. 40 లక్షల రూపాయల లోపు పెట్టుబడితో ఏర్పాటుచేసే సంస్థలకు 50 శాతం రాయితీని అందిస్తారు. అంతకు మించిన వాటికి 10 శాతం సబ్సిడీ ఇస్తారు.

యానిమేషన్ పాలసీ
ఐ.టి రంగంలో ఇప్పటికే సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రం ఇకపై యానిమేషన్‌, గేమింగ్‌ లోనూ తన సత్తా చాటేందుకు యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, కామిక్స్‌ అండ్‌ గేమింగ్‌ పరిశ్రమకు హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఈ పాలసీని రూపొందించింది. లక్ష్యాలు…

 • యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ సెక్టార్‌లో తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దటం.
 • అవసరాలు, నైపుణ్యాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీచేయడం.
 • కొత్తగా పెట్టుబడిపెట్టే సంస్థలకు రూ. 20 లక్షల మొత్తం వరకూ 25 శాతం క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ
 • యానిమేషన్‌ సినిమాలు, కార్టూన్‌ సీరియళ్ళు, గేమ్‌ల కోసం అయ్యే వ్యయంలో 20 శాతం ఉత్పత్తి వ్యయాన్ని సబ్సిడీగా అందించడం.
 • వినోదం పన్ను మినహాయింపు
 • గ్రామీణ కేంద్రాలను ప్రారంభించిన కంపెనీలకు మొదటి మూడేళ్ళలోపు పంచాయతీ పన్నుల మినహాయింపు.
 • రూ.40 లక్షల లోపు పెట్టుబడితో ఏర్పాటుచేసిన సంస్థలకు 50 శాతం రాయితీని అందిస్తారు. అంతకు మించిన వాటికి 10 శాతం సబ్సిడీ ఇస్తారు.

రండి..కలసి ఎదుగుదాం ఐ.టి. కంపెనీలకు సీ.ఎం. పిలుపు
”తెలంగాణకు రండి..పెట్టుబడులు పెట్టండి.. రండి..కలసికట్టుగా అభివృద్ధి చెందుదాం” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఐ.టి కంపెనీలు, ఔత్సాహిక పెట్టుబడిదారులకు పిలుపు నిచ్చారు. నూతన ఐ.టి పాలసీ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనలో అవినీతికి తావులేని, ఆటంకాలులేని సింగిల్‌ విండో విధానం అమలుచేస్తున్నామని చెప్పారు. గత సంవత్సరం ఇక్కడే టి.ఎస్‌- ఐపాస్‌ పాలసీని ఆవిష్కరించి విజయం సాధించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా పరిశ్రమలకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నా వాటిలో అనేక ఇబ్బందులు వున్నాయని, కానీ తెలంగాణలో తీసుకువచ్చిన టి.స్‌ ఐ పాస్‌లో ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు లేకుండా, కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని అన్నారు. పాలసీని అమలుచేయడం ద్వారా ఇప్పటివరకూ 1691 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, వాటిలో 883 పరిశ్రమలు తమ ఉత్పత్తులను కూడా ప్రారంభించాయని సి.ఎం చెప్పారు.

తెలంగాణ కొత్తగా ఏర్పడిన 29వ రాష్ట్రమని, దీనిని అన్నివిధాలా అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడమే తమ లక్ష్యమని కె.సి.ఆర్‌ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పెట్టుబడులు పెట్టేవారిపట్ల గౌరవభావంతో వ్యవహరిస్తుందని, యువ ఐ.టి మంత్రి కె.టి ఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఐ.టి రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.

హైదరాబాద్‌ నగరం అన్నివిధాలా పెట్టుబడులకు అనుకూలమైనదని, ఇక్కడి వాతావరణం, కాస్మోపాలిటన్‌ కల్చర్‌ పెట్టుబడులకు అనుకూలమైందని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రపంచ స్థాయిలో పోటీపడాలి
ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి మాట్లాడుతూ, భారతదేశంలోని ఇతరరాష్ట్రాలు, నగరాలతో కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ ఐ.టి కేంద్రాలైన సిలికాన్‌ వాలీ, బీజింగ్‌, టోక్యోలతో పోటీపడి ముందుకు నడవాలని సూచించారు. ఆ నగరాలు ఐ.టిలో ఎంతో అబివృద్ధి చెందాయని, వాటిస్థాయికి హైదరాబాద్‌ చేరాలని ఆయన ఆకాంక్షించారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిపట్ల మానవత్వంతో, గౌరవ భావంతో వ్యవహరించాలని, సంస్థల స్థాపనలో వారికున్న సమస్యలు సత్వరం పరిష్కారమయ్యే విధంగా విధానాలు వుండాలని ఆయన అన్నారు.

ఎలక్ట్రానిక్‌ పాలసీ
2020 సంవత్సరానికల్లా 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ పాలసీని రూపొందించింది. లక్ష్యాలు…

 • 1,60,000 కొత్త ఉద్యోగాల కల్పన
 • ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లను అభివృద్ధిచేయడం
 • విద్యుత్‌ కోతలు లేకుండా, వుండటం
 • స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ డ్యూటీ విషయంలో మొదటిసారి 100 శాతం పన్ను మినహాయింపు. ఆతర్వాత నుంచి 50 శాతం
 • వివిధ నిబంధనల విషయంలో సెల్ఫ్‌కి సర్టిఫికెట్‌ సౌలభ్యం
 • పారిశ్రామిక విద్యుత్ వినియోగం అనేక క్యాటగిరీ తొలగించడం ద్వారా ఎలక్రాన్టిక్‌ కంపెనీలను ప్రోత్సహించడం.
 • ఉత్పత్తులను ప్రారంభించినప్పటి నుంచి ఐదేళ్ళపాటు 100 శాతం విద్యుత్‌ డ్యూటీ మినహాయింపు.
 • పేటెంట్లు పొందడంలో ప్రభుత్వ సహాయం.
 • వివిద సంస్థ నుంచి క్వాలిటీ అనుమతులు పొందడంలో సహాయం.
 • ట్రాన్స్‌ పోర్ట్‌ సబ్సిడీ, వ్యాట్‌, సి.ఎస్‌.టి, ఎన్జీఎస్టీ రీ ఇంబర్స్‌ మెంట్‌, ఇన్వెస్ట్‌ మెంట్‌ సబ్సిడీ.
 • భూమి కొనుగోలు విషయంలో ప్రభుత్వ సబ్సిడీ.
 • మహిళా పారిశ్రామిక వేత్తలకు అదనంగా 10 శాతం ఇన్వెస్ట్‌ మెంట్‌ సబ్సిడీ
 • ఎస్‌.సి, ఎస్‌.టి పారిశ్రామిక వేత్తలకు నిర్దేశిత లాభాలు తీసుకోవచ్చునని, ఎలక్రాన్టిక్ పాలసీ తెలంగాణకు ఎంతో అనుకూలంగా వుంటుందని చెప్పారు.

గేమింగ్‌, యానిమేషన్‌ రంగంలో ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక సంస్థలు వున్నాయని, మేకిన్‌ ఇండియాలో హైదరాబాద్‌ రెండవ స్థానంలో వున్నదని కె.టి.ఆర్‌ చెప్పారు. మేకిన్‌ తెలంగాణ నినాదంతో ఎలక్ట్రానిక్‌ పాలసీకి జీవం పోశామన్నారు. రూరల్‌ టెక్‌ పాలసీ క్రింద హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, నిజామాబాద్‌ లాంటి పట్టణాల్లో కూడా ఐ.టి కంపెనీలు వచ్చేలా ప్రోత్సహిస్తామన్నారు.

బంగారు తెలంగాణ సాధనలో అందరం భాగస్వాములం కావాలని పారిశ్రామిక వతేల్తకు నాస్కామ్‌ ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. డిజిటల్‌ తెలంగాణ సాధించే లక్ష్యంతో తమ వంతుగా మూడేళ్ళలో 10 కోట్ల రూపాయలు ఖర్చుపెడతామని చెప్పారు. ఐ.టి కంపెనీలన్నీ తెలంగాణలోని మిగతా తొమ్మిది జిల్లాలకు విస్తరించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెటన్టి ఐ.టి పాలసీలు అబివృద్ది వైపు కీలకమైన ముందడుగని నీతి అయోగ్ సభ్యుడు వి.కె. సారస్వత్‌ ప్రశంసించారు. స్టార్టప్‌ కంపెనీలకు అందిస్తున్న ప్రోత్సాహకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆయన అబినందనలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన ఐ.టి పాలసీ అద్భుతమైన పాలసీగా సెల్‌ కంపెనీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు పంకజ్‌ మెహంద్రీ అభివర్ణించారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌, ఐ.టి శాఖా మంత్రి కె.టి.ఆర్‌లను ఆయన అభినందించారు. సెల్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం టాప్‌ 5లో ఉన్నదని ఆయన చెప్పారు. సెల్‌ కాన్‌, మైక్రోమ్యాక్స్‌ ఇప్పటికే తమ ఉత్పత్తులను ప్రారంభించాయని తెలిపారు.

డిజిటల్‌ తెలంగాణలో భాగస్వాములము కావాలని నిర్ణయించామని ఇంటెల్‌ ఇన్‌ సైడ్‌ సంస్థ నిర్వాహకురాలు దేవ్‌ జానీ తెలిపారు.

పరిశ్రమల స్థాపనకు అనువైన అనుమతుల విధానాన్ని అమలుచేయడానికి రాష్ట్ర యంత్రాంగం అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ చెప్పారు. ఇన్వెస్‌టమెంట్‌ ఫ్రెడ్లీ, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా బ్యూరోక్రసీ అన్ని విధాలుగా పారిశ్రామిక వేత్తలకు సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

అలరించిన టి- వన్
తెలంగాణలో తయారైన తొలి రోబో ఈ ఐ.టి పాలసీ ఆవిష్కరణ వేదికపై అలరించింది. టి- వన్‌ గా నామకరణం చేసిన ఈ రోబోను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వేదికపై ఒక చివరినుంచి ముఖ్య అతిథి సీటువరకూ వెళ్ళి ఐ.టి పాలసీ పత్రాలను అందించే పనిని దీనికి అప్పగించారు. ఈ రోబో నేరుగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ వద్దకు వెళ్ళి ఐ.టి పాలసీ పత్రాలను ఆయనకు అందించడం అందరినీ అలరించింది. హైదరాబాద్‌కు చెందిన రోబోటిక్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లేబొరేటరీకి చెందిన బృందం ఈ రోబోను తయారుచేసింది.

అలాగే, ఎల్‌.ఇ.డి బల్బుల మిరుమిట్ల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా పలువురిని ఆకర్షించింది. తెలంగాణ 10 జిల్లాల నైసర్గిక స్వరూపం కనపడేలా 130 ఎల్‌.ఇ.డి బల్బులతో రూపొందించిన చిత్రపటాన్ని ఆన్‌ చేశారు. ఈ బల్బులు కూడా తెలంగాణలో తయారైనవేకావడం మరో విశేషం.

ప్రభుత్వంతో 28 సంస్థల ఒప్పందం 
రాష్ట్ర నూతన ఐ.టి పాలసీని ఆవిష్కరించిన రోజే పలు అగ్రశ్రేణి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్థలతో ఎం.ఓ.యూలు కూడా చేసుకున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సమక్షంలో ఐ.టి శాఖా మంత్రి కె. తారక రామారావు ఆధ్వర్యంలో 28 సంస్థల ప్రతినిధులు, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలవల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సుమారు 2700 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. 25 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. టి-హబ్‌తో 8 సంస్థలు, టాస్క్‌ తో ఆరు సంస్థలు, రాష్ట్రప్రభుత్వంతో 11 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి.