|

పునర్నిర్మాణ ప్రతీకలు

మనం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించుకున్న సచివాలయ సౌధం పునర్నిర్మాణం చేసుకున్న తెలంగాణకు ప్రతీకగా నిలిస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరిగిన తరువాత మన ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది, స్వయం పోషకంగా మారిందన్నారు. ఈ రోజు తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఏ దేశమైన, రాష్ట్రమైన అభివృద్ధి చెందిందనడానికి కొలమానంగా తలసరి ఆదాయాన్ని తీసుకుంటారన్నారు. అలా చూస్తే దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని పేర్కొన్నారు. అత్యద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

నూతనంగా అతి అద్భుతంగా రూపుదిద్దుకున్నటువంటి తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, పరిపాలనా కేంద్రంగా, అత్యంత శోభాయమానంగా నిర్మాణమైన సచివాలయ భవనం నా చేతుల మీద ప్రారంభం కావడం నాకు జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నానన్నారు. చాలా పెద్ద పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మనందరి సాక్షిగా జరిగిన విషయం మీకందరికీ తెలిసిన విషయమేనని, సమైక్య పాలనలో చాలా విధ్వంసం జరిగి, ప్రజలు చాలా బాధలకు గురైనారని అన్నారు. మీకు నీళ్లు ఎట్లా వస్తయ్‌.. రానే రావు.. సాధ్యమే కాదు.. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని చెప్పబడిన విషయాలు మనకు తెలుసన్నారు. ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక్క హైదరాబాద్‌ తప్ప మిగిలిన తొమ్మిది జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలుగా పెట్టిన చరిత్ర మనం చూశాం. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో కష్టపడి అభివృద్ధి సాధించుకున్నాం.

ఈ అభివృద్ధిలో పాలుపంచుకున్న ప్రజాప్రతినిధులకి, నాతోపాటు పనిచేస్తున్నటు వంటి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి, ఉద్యోగికి చేతులెత్తి హృదయ పూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ సాధించిన ప్రగతి శిఖరాయ మానంగా, శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలనా భవనం.. సచివాలయం.. ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని మనవి చేస్తున్నానన్నారు.

సెక్రటేరియట్‌ వెలుగులకు ధీటైన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రతి ప్రజా ప్రతినిధికి, మంత్రులు, శాసనసభ్యులు మొదలు కొని సర్పంచ్‌ ల వరకు, చీఫ్‌ సెక్రటరీ నుంచి అటెండర్లు, డ్రైవర్ల వరకూ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్నారు.

సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, దాని కోసం బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, విశ్వ మానవుడు, సమతామూర్తి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. ఆయన అందించిన సందేశంతో, గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. సమతామూర్తి అంబేద్కర్‌ చూపిన బాటలోనే మన ప్రయాణం కొనసాగుతా ఉంది. వారు రాజ్యాంగంలో పొందుపర్చినటువంటి ఆర్టికల్‌ 3 ప్రకారమే తెలంగాణ వచ్చింది. వారు సూచించిన సమతా సిద్ధాంతమే మనకు ఆచరణయోగ్యం. తెలంగాణలోని అన్ని వర్గాల ముఖాల్లో చిరునవ్వు రావాలనే బాబాసాహెబ్‌ స్ఫూర్తిని అందుకున్నాం కాబట్టి వారి జయంతి సందర్భంగా ఆకాశమంత ఎత్తైన వారి విగ్రహాన్ని తెలంగాణయే కాదు, భారత జాతి కీర్తినే విశ్వవ్యాప్తం చేసుకునే విధంగా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. బాబాసాహెబ్‌ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని సెక్రటేరియట్‌కు అనునిత్యం వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులందరికీ అనునిత్యం స్ఫురణకు రావాలి, వారి సందేశం మనసులో పెట్టుకొని పనిచేయాలి. అంకిత భావంతో పనిచేయాలనే ఉద్దేశంతో ప్రధాన కార్యాలయమైన రాష్ట్ర సచివాలయానికి భారతదేశానికే ఒక సందేశం ఇచ్చేవిధంగా మనం గర్వకారణంగా ఆయన పేరు పెట్టుకున్నాం. బాబాసాహెబ్‌ అడుగుజాడలలలోనే భవిష్యత్తుకు కూడా బాటలు వేసుకుంటామని నేను మీకందరికీ హామీనిస్తున్నానన్నారు.

స్వరాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో, అనేక మలుపులలో తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరులందరికి కూడా నేను అంజలి ఘటిస్తున్నాను, జోహార్లు సమర్పిస్తున్నాను. తెలంగాణ అవతరించిన కొత్తలో, అంతకు ముందు చాలా వాదవివాదాలు, వాదోపవాదాలు, అనేక చర్చలు మనం చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణంలో మనం అంకిత భావంతో అడుగేసిన సందర్భంలో కొందరు అర్బకులు, తెలంగాణ భావాన్ని, అర్ధాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేనటు వంటివారు కారుకూతలు కూశారని వారికి పునర్నిర్మాణం గురించి తెలియదని విమర్శించారు.

కొందరు కురుచ వ్యక్తులు, మరుగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ మంటే సెక్రటేరియట్‌ మొత్తం కూలగొట్టి మళ్లీ కడుతరా, అని విపరీతమైనటువంటి, దుర్మార్గమైనటు వంటి విమర్శలు చేశారు. చిల్లర వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా పనిచేశాం. ఈరోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది నా తెలంగాణ రాష్ట్రమని నేను గర్వంగా మనవి చేస్తున్నా. పునర్నిర్మాణమంటే ఏంటో తెలియని మరుగుజ్జులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానన్నారు.

ఆనాడు నెర్రెలుబాసి నోళ్లు వెళ్లబెట్టి బీళ్ళుగా మారిపోయినటువంటి లక్షలాది, కోట్లాది ఎకరాల తెలంగాణ భూములు.. నేడు నిండు నీటి పారుదలకు నోచుకొని.. లక్షల ఎకరాల పంట చేలల్లో ఆ పొలాలు వెదజల్లుతున్న హరిత క్రాంతి ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణం. ఈ రెండవ యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో ఉన్న వరి పైరు 94 లక్షల ఎకరాలు. అందులో 56 లక్షల ఎకరాలు ఒక్క తెలంగాణలోనే ఈ రెండవ పంటలో పండుతున్నదని సగర్వంగా తెలియజేస్తున్నా. ఆ పొలాల్లో కనిపిస్తున్న హరిత క్రాంతే తెలంగాణ పునర్నిర్మాణం. తెలంగాణ పునర్నిర్మాణమంటే..ఒక కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్ట్‌ అని స్పష్టం చేశారు.

అర్థరాత్రి కరెంట్‌ పోయి.. ఎప్పుడొస్తదో తెలియక.. పారిశ్రామికవేత్తల ధర్నాలు, ప్రజల గగ్గోలు..జనరేటర్లు..ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో.. ఇవాళ ఇవన్నీ కూడా మాయమైపోయి అద్భుతమైనటువంటి కాంతులతో, వెలుగుజిలుగులతో, జాజ్జ్వలాయమానంగా కరెంట్‌ వెలుగులతో విరాజిల్లుతున్న తెలంగాణయే.. పునర్నిర్మాణమంటే అని తెలిపారు.

కరెంట్‌ పెట్టడానికి పోయి తమ పొలాల దగ్గర పాములు, తేళ్ళు కుట్టి చనిపోయిన రైతులు నాడు.. నేడు దినం పూటనే ఆరు గంటలల్లో పారించుకొని దర్జాగా ఇంటికి వచ్చి, కంటి నిండా కునుకు తీస్తూ నిద్రబోతున్నటువంటి మా తెలంగాణ రైతన్న దర్పమే తెలంగాణ పునర్నిర్మాణం, గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భుతంగా అలరారుతున్నాయో.. ఎన్ని అవార్డులు గ్రామాలు సొంతం చేసుకుంటున్నాయో మీ అందరికీ తెలిసిందే.

వలసపోయిన పాలమూరు కూలీలు, ఒక్కరు కూడా వలసలో లేకుండా తిరిగి వచ్చి వాళ్ల స్వంత పొలాల మీద కుర్చీలేసుకుని కూర్చుంటే.. ఇతర రాష్ట్రాల కూలీలు మన తెలంగాణ పొలాల్లో పనిచేస్తుంటే చూస్తున్న దృశ్యాలే.. తెలంగాణ పునర్నిర్మాణమంటే.

ఒకనాడు దాహంతో అల్లాడి.. ఫ్లోరైడ్‌ తో నడుం వంగి.. లక్షలాది మంది బిడ్డల జీవితాలు కోల్పోయిన, కుమిలిపోయిన తెలంగాణలో మిషన్‌ భగీరథ.. స్వయంగా భగీరథుడే దిగివచ్చి ప్రతి ఇంటిలో.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఏం వస్తయో.. అదిలాబాద్‌ గోండు గూడేలలో కూడా అదే నీళ్లు అందిస్తున్న మిషన్‌ భగీరథ.. తెలంగాణ పునర్నిర్మాణమంటే.

పరిపాలనా సంస్కరణలతోని, స్లోగన్‌ ఓరియెంటెడ్‌ తో కాకుండా ఆచరణాత్మకంగా 33 జిల్లాలతో అలరారుతూ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్న మా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు నా సారథ్యంలో వెలుగుతున్న ప్రభలే..తెలంగాణ పునర్నిర్మాణమని తెలియజేస్తున్నానన్నారు.

అనేక రంగాల్లో ముందుకుపోతున్న తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితోని రైతాంగాన్ని, సంక్షేమాన్నే గాకుండా పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. మురికి కూపాలుగా ఉన్న పల్లెలు, పట్టణాలు, డివైడర్లు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో, డంప్‌ యార్డులతో, ప్రతి ఊరులో వైకుంఠధామాలతో అద్భుతమైనటువంటి తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఏ విధంగా తెలంగాణలో వెలుగులీనుతున్నయో.. అదీ పునర్నిర్మాణమంటే.

అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ నగరంలో ఎన్నెన్నో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు, ఎన్నో అండర్‌ పాస్‌లు.. ఎన్నో రకాల సౌకర్యాలతో ముందుకు పోతున్నదో తెలంగాణ..ఇదీ పునర్నిర్మాణమంటే.

నలువైపులా సూపర్‌ స్సెషాలిటీ హస్పిటల్స్‌.. తెలంగాణ వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వరంగల్‌ హెల్త్‌ సిటీ.. ఇవీ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీకలు. ప్రపంచంలో అభివృద్ధిని రీ కన్‌స్ట్రక్షన్‌నూ కొలమానంగా తీసు కునేటటు వంటి సూచికలు రెండే రెండు. తలసరి ఆదాయం.. రెండోది తలసరి విద్యుత్‌ వినియోగం. అద్భుత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. మిగులు రాష్ట్రంగా కొనసాగుతూ.. పెరుగుతూ దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా రూ.3,00,017 లతో తలసరి ఆదాయంలో నంబర్‌ వన్‌లో ఉన్న తెలంగాణయే.. తెలంగాణ పునర్నిర్మాణమంటే.

ఒకనాడు 1100 యూనిట్లే తలసరి విద్యుత్‌ వినియోగం ఉన్న రాష్ట్రం నేడు 2,140 యూనిట్లతో భారతదేశంలోనే అగ్ర భాగాన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్యుత్‌ వినియోగం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం.

నిరాదరణకు గురై..మూలిగి.. ముక్కిపోయినటువంటి వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎందరో బాధితులు అద్భుతంగా రూ.2016ల ఆసరా పింఛన్లు అందుకుంటూ చిరునవ్వుతో గ్రామాలల్లో వెలిగిపోతున్న ముఖాలే తెలంగాణ పునర్నిర్మాణపు వెలుగు దివ్వెలని మనవి చేస్తున్నా.

ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్మించబడినటువంటి సచివాలయం చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నేను హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

దీన్ని అద్భుతంగా రూపుదిద్దినటువంటి ఆర్కిటెక్ట్‌ అస్కార్‌ పొన్ని ఆర్కిటెక్ట్‌, నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ, అదేవిధంగా వీరందరికీ నాయకత్వం వహిస్తూ, వీరందరినీ అద్భుతంగా ముందుకు నడిపించిన ఆర్‌ అండ్‌ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్‌ఇ సత్యనారాయణ, ఇఇ శశిధర్‌ రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఇ లింగారెడ్డి, స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌ రెడ్డికి నేను హృదయపూర్వకంగా మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

వీరందరిని మించి ఇందులో తమ చమట చుక్కల్ని ఒడిపిన వివిధ రాష్ట్రాల కూలీలు, ఈ నిర్మాణానికి చమట చుక్కల్ని వదిలినటువంటి ప్రతి కార్మికునికి తెలంగాణ ప్రజల తరపున చేతులెత్తి నమస్కారాలు పెడుతున్నా. మీ చెమటను, శ్రమను వృధా పోనీయం. ఇక్కడినుంచి ప్రజలకు అభివృద్ధి ఫలాలు పంచుతాం. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నా తమ్ముడు, ఆర్‌ అండ్‌ బి మినిస్టర్‌ గా ఉన్న యువ నాయకుడు వేముల ప్రశాంత్‌ రెడ్డి 24 గంటలు ఆహోరాత్రులు కష్టపడి ఈ అద్భుతమైన సౌధాన్ని రూపకల్పన చేయడానికి శ్రమించినటువంటి ప్రశాంత్‌ రెడ్డికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఈ సెక్రటేరియట్‌ నిర్మాణ సమయంలో ఎంతో యాక్టివ్‌ రోల్‌ తీసుకొని ఆనాడు చీఫ్‌ సెక్రటరీగా ఉండి మనకు సహకరించినటువంటి సోమేశ్‌ కుమార్‌కు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.

మీ అందరికి కూడా నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా. ఏ స్ఫూర్తితోనైతే దేశంలోనే జరుగనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు ఆలవాలంగా, ఆదర్శప్రాయంగా తెలంగాణ రూపుదిద్దు కోవడంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి, ప్రతి మంత్రివర్యునికి, ప్రతి శాసనసభ్యునికి, ప్రతి శాసన మండలి సభ్యునికి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి నేను, మేమందరం ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా, మీ పాలసీలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీకు తోడుగా ఉంటామని చెప్పిన, అందరి ఉద్యోగుల తరపున చెప్పినటువంటి అడ్మినిస్ట్రేటివ్‌ హెడ్‌ శ్రీమతి శాంతి కుమారి ఆ విధంగా విశ్వాసం కల్గించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ! జై భారత్‌!! అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

స్వాగతోపన్యాసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ తాము అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పక్షాన హామీ ఇచ్చారు. ఇంతటి గొప్ప పరిపాలన సౌధం సచివాలయ నూతన భవన ప్రారంభ సందర్భంగా నేను సీఎస్‌గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆర్‌ అండ్‌ బి మంత్రి ప్రశాంత్‌రెడ్డి ధన్యవాద ప్రసంగంతో సభ ముగిసింది.

ఆరు ఫైళ్ళపై ముఖ్యమంత్రి సంతకం

నూతన సచివాలయం ప్రారంభ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరుఫైళ్ళపై సంతకాలు చేశారు. నూతన సచివాలయానికి రాగానే కేసీఆర్‌ మొదట సుదర్శనయాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. తరువాత 6వ అంతస్థులోని తన ఛాంబర్‌లో కూర్చున్నారు. వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఆరు ఫైళ్ళపై సంతకాలు చేశారు.

మొదట 2023-24 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకం అమలుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. రెండవ ఫైలు పోడుభూముల పట్టాలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. సీఎం సహాయనిధి లబ్దిదారులకు సంబంధించిన ఫైలుపై మూడో సంతకం చేశారు. కేసీఆర్‌ కిట్‌ పోషకాహార పథకంకు సంబంధించిన ఫైలుపై నాలుగో సంతకం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు 5,544 మంది క్రమబద్దీకరణకు సంబంధించిన ఫైలుపై అయిదో సంతకం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫైలుపై ఆరో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారిలు పాల్గొన్నారు.

మంత్రుల తొలి సంతకాలు

నూతన సచివాలయ భవనంలో మంత్రులు తమ తమ ఛాంబర్‌లలో కూర్చున్న తరువాత వివిధ ఫైళ్ళపై తొలి సంతకం చేశారు. పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు లక్ష డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై సంతకం చేశారు. స్టాఫ్‌ నర్సులు, పంట నష్టపరిహారం ఫైలుపై ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సంతకం చేశారు. జంట నగరాల దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలపై దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతకం చేశారు. ఆర్‌ అండ్‌ బీ పునర్వ్యవస్థీకరణ ఫైలుపై రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంతకం చేశారు. కొత్త ఐకేపీ భవనాల నిర్మాణాల ఫైలుపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు సంతకం చేశారు. అంగన్‌వాడీలకు సన్నబియ్యం పంపిణీ ఫైలుపై మంత్రి గంగుల కమలాకర్‌ సంతకం చేశారు. టీచర్లకు ట్యాబ్‌ల పంపిణీ ఫైలుపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతకం చేశారు. ఉచిత చేపపిల్లల పంపిణీ ఫైలుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సంతకం చేశారు.

సీఎం కప్‌ క్రీడాపోటీల నిర్వహణ ఫైలుపై క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సంతకం చేశారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు ఫైలుపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంతకం చేశారు. కార్మిక దినోత్సవ నిర్వహణ ఫైలుపై మంత్రి మల్లారెడ్డి సంతకం చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమీషనరేట్ల పునర్‌ వ్యవస్థీకరణ ఫైలుపై హోంమంత్రి మహమూద్‌ అలీ సంతకం చేశారు. ఖమ్మం జిల్లా రవాణా కార్యాలయ భవన ఆధునీకరణ ఫైలుపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సంతకం చేశారు. సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువుల పంపిణీ ఫైలుపై మంత్రి నిరంజన్‌రెడ్డి సంతకం చేశారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల రాయితీ నిధులను విడుదల చేస్తూ ఫైలుపై విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి సంతకం చేశారు. అంగన్‌వాడి కేంద్రాల్లో ఉచిత పాలపంపిణీ ఫైలుపై మంత్రి సత్యవతి రాథోడ్‌ సంతకం చేశారు.