సాగు ‘దారి’ మళ్లాలి

By: కొత్తపల్లి సందీప్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమమే సాగునీటి కోసం మొదలయింది. దానికి నిధులు, నియామకాలు ట్యాగ్‌ లైన్‌ అయ్యాయి. నీళ్ల కోసం నిప్పును రాజేసి 14 సంవత్సరాలు అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటి మీదకు తెచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో స్పష్టమయిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. దాదాపు 60 శాతం మంది ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి చేయూతనిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు బలపడితే సమాజంలోని మెజారిటీ ప్రజలకు ఉపాధి లభిస్తుందని వ్యవసాయరంగం మీద దృష్టి సారించారు.

ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టి వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టి మూడున్నరేళ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల పూర్తి చేశారు. పెండింగ్‌ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి సాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. సాగునీరు అందుబాటులోకి తేవడంతో పాటు తెలంగాణలో దాదాపు 35 లక్షల వ్యవసాయ మోటార్లను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. సాగునీరు, ఉచిత కరంటుతో పాటు పెట్టుబడికి రైతాంగం ఇబ్బంది పడకుండా రైతుబంధు పథకం పేరుతో ఎకరాకు రూ.5 వేలు చొప్పున ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు కుటుంబంలో రైతు మరణిస్తే అనాథలు కాకుండా ఉండాలని 18 నుండి 59 ఏళ్ల వయసున్న రైతులకు రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షలు ఆ రైతు కుటుంబానికి అందే విధంగా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.

అందుబాటులో సాగునీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు 100 శాతం మద్దతు ధరకు పంటల కొనుగోళ్లతో తెలంగాణ రైతాంగంలో ఆత్మస్థయిర్యం, ఆత్మవిశ్వాసం పెరిగింది. సాగును వదిలేసి పట్నం బాట పట్టిన వారు తిరిగి సాగువైపు దృష్టి సారించారు. 2013-14లో వానాకాలం, యాసంగిలో 2 కోట్ల 5 లక్షల 33,484 ఎకరాలలో సాగు చేయగా 2020-21లో 3 కోట్ల 40 లక్షల 53,059 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరిగింది. కేవలం ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపమే సంపూర్ణంగా మారి పోయింది. అయితే దశాబ్దాలుగా సాంప్రదాయ సాగుకు అలవాటుపడిన రైతాంగం సాగునీటి రాకతో ఎక్కువగా వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది వానాకాలం, యాసంగి రెండు సీజన్లు కలిపి 3 కోట్ల టన్నుల పై చిలుకు వరి ధాన్యం ఉత్పత్తి కావడం గమనార్హం.

మార్కెట్లో డిమాండ్‌కు, వస్తున్న పంటల ఉత్పత్తికి మధ్య తీవ్ర వ్యత్యాసం నమోదవుతూ వస్తుంది. కరోనా విపత్తు నేపథ్యంలో రైతు నష్టపోకూడదని తెలంగాణ ప్రభుత్వం వంద శాతం పంటలను కొనుగోలు చేసింది. అయితే ప్రతిసారి కష్టపడి పండించిన పంటను రైతు అమ్ముకోవడానికి ఎదురుచూసే పరిస్థితి రాకూడదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. అందుకే స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను గుర్తించి ఆ దిశగా రైతును మళ్లించేందుకు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ వ్యవసాయ శాఖలో మార్కెట్‌ రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌ ను ఏర్పాటు చేశారు. దానికి ముందే గత మూడేళ్లుగా రైతాంగాన్ని విభిన్న పంటలవైపు తీసుకువెళ్లేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా నూనె గింజలు, పప్పు గింజలకు ఉన్న డిమాండ్‌ ను గుర్తించి గత ఏడాది కంది, పత్తి సాగును ప్రోత్సహించారు. 2013 – 14 లో 6.51 లక్షల ఎకరాలలో ఉన్న కంది సాగు 2020- 21కి 10.88 లక్షల ఎకరాలకు, 42.32 లక్షల ఎకరాలలో ఉన్న పత్తి సాగును 60.53 లక్షల ఎకరాలకు తీసుకువచ్చారు. తెలంగాణ పత్తి అత్యంత నాణ్యమైనది. దీనికి అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న విషయాన్ని రైతులకు వివరించి, దాని సాగు వైపు నడిపించడం జరుగుతోంది.

పంటల మార్పిడిలో భాగంగా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం పత్తి, కంది, వేరుశెనగ, ఆయిల్‌ పామ్‌ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నది. తెలంగాణలోని 25 జిల్లాలు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలం అని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగుకు తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో పాటు వానాకాలంలో కంది, పత్తి, యాసంగిలో వేరుశెనగ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది. దేశంలో వేరుశెనగ సాగులో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉంది. అక్కడ వానాకాలంలో 50 లక్షల ఎకరాలలో వేరుశెనగ సాగవుతుంది. అయితే అక్కడి వేరుశెనగలో ఆఫ్లాటాక్సిన్‌ అనే శిలీంధ్రం ఉన్న కారణంగా దానికి అంతర్జాతీయంగా ఆదరణ లేదు. తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు వేరుశెనగ సాగుకు అనుకూలం. ఇక్కడ పండే వేరుశెనగలో ఆప్లాటాక్సిన్‌ శిలీంధ్ర రహితంగా ఉంటుంది. దీనికి జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అందుకే రాబోయే కాలంలో యాసంగిలో ప్రధానపంటగా ప్రోత్సహించాలని భావిస్తున్నారు. డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయించడంతో పాటు వాటి మార్కెటింగ్‌ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసేందుకు ‘ తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ‘కి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించింది. 2024 – 25 వరకు 10 వేల ఎకరాలలో ఈ జోన్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం విత్తనం నుండి పంటల కొనుగోళ్ల వరకు వ్యవసాయ అనుకూల విధానాలతో రైతాంగానికి అండగా నిలుస్తోంది. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వివిధ రకాల పథకాలను అమలుచేస్తూ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిలా నిలబడింది. అయితే అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలు కాకూడదని, చేసిన కష్టం ద్వారా వచ్చిన ఉత్పత్తికి మార్కెట్లో ఆదరణ లేక నష్టాల పాలు కాకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రధానంగా వరి సాగు నుండి రైతాంగాన్ని మళ్లించాలన్న ప్రధాన సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వ్యవసాయ శాఖ ముందుకు వెళ్తున్నాయి. అందుకే మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటల సాగుతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పంటల మార్పిడి వైపు ప్రోత్సహించడం జరుగుతుంది.