ఆరుగురు కొత్త న్యాయమూర్తులు

రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఈ నిర్ణయం తీసుకొన్నది. హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్, కాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాస్ రావు, నామవరపు రాజేశ్వర్‌రావు పేర్లను గతం లోనే హైకోర్టు కొలీజియం సుప్రీం కోర్టుకు సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు కూడా తాజాగా సమ్మతి చెప్పింది. వీరి పేర్లను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదిస్తుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం కేంద్ర న్యాయ శాఖ గెజిట్ ప్రచురించాక కొత్త వారితో న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 27 మంది జడ్జిలు విధులు నిర్వహిస్తున్నారు. కొత్తవారి ఆమోదానంతరం ఆ సంఖ్య 33కు పెరుగుతుంది. మరో 9 పోస్టులు ఖాళీగా ఉంటాయి.