నూతన ఎమ్మెల్సీలు, కార్పోరేషన్‌ ఛైర్మన్‌లు వీరే…

రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. మొదట శాసనసభ్యుల కోటాలో ఉన్న 6 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగగా, అనంతరం స్థానిక సంస్థలకు సంబంధించి 12 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటన్నింటిలోను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. శాసనసభ్యుల కోటాలో ఉన్న స్థానాలన్ని కూడా ఏకగ్రీవం కాగా, స్థానిక సంస్థలకు సంబంధించి 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 6 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలోను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారు. వీరితో పాటు గవర్నర్‌ కోటాలో ఉన్న స్థానానికి కూడా శాసనమండలి సభ్యున్ని గవర్నర్‌ నియమించారు. మొత్తంగా 19 మంది నూతన శాసనమండలి సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.

శాసనసభ్యుల కోటాలో ఎన్నికయిన వారిలో కడియం శ్రీహరి, తక్కళ్ళపల్లి రవీరందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పారుపాటి వెంకట్‌రాంరెడ్డి, బండ ప్రకాష్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు ఉన్నారు. స్థానిక సంస్థలో కోటాలో ఎకగ్రీవంగా ఎన్నికైన వారిలో నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, మహబూబ్‌నగర్‌ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ళ దామోదర్‌రెడ్డి, వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు. మెదక్‌, ఖమ్మం, కరీంనగర్‌, నల్లగొండల నుంచి పోటీ జరుగగా మెదక్‌ నుంచి వంటేరు యాదవరెడ్డి, కరీంనగర్‌ నుంచి ఎల్‌.రమణ, టి.భానుప్రసాద్‌, ఖమ్మం నుంచి తాతా మధుసూధన్‌, ఆదిలాబాద్‌ నుంచి దండె విఠల్‌, నల్లగొండ నుంచి ఎం.సీ. కోటిరెడ్డిలు గెలుపొందారు. గవర్నర్‌ కోటా నుంచి మాజీ స్పీకర్‌ మధుసూధనా చారిని గవర్నర్‌ నామినేట్‌ చేశారు.

ఇక పలు సంస్థలకు ఛైర్మన్‌లను కూడా ప్రభుత్వం నియమించింది. వీటిలో బ్రేవరేజెస్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా గజ్జెల నగేష్‌, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్‌ను నియమించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు (మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) ఛైర్మన్‌గా, మన్నె క్రిషాంక్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా, వేద సాయి చందర్‌ను తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియ మించారు. మహిళా ఆర్థిక సహాకార సంస్థ చైర్‌ పర్సన్‌గా ఆకుల లలిత, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, సాంకేతిక సేవల సంస్థ ఛైర్మన్‌గా పాటిమీది జగన్‌మోహన్‌రావులను నియమించారు.