అన్నదాతగా ఆదర్శమూర్తి నీలోఫర్‌ బాబూరావు

‘మానవసేవయే మాధవసేవ’ అనే సూక్తిని నిజం చేస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంతసమాజసేవకు        ఉపయోగిస్తున్న ఆదర్శ వ్యాపారవేత్త గాథ ఇది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు కోట్లకు అధిపతి అయినా.. గతం తాలూకు జ్ఞాపకాలను మరువకుండా తాను పేదవాడిగా ఉండి పడ్డ కష్టాలు గుర్తెరిగి, పేద ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి సహాయ సహాకారాలు అందిస్తున్నాడు. ఆయన పేరు అనుముల బాబురావు. హైదరాబాద్‌ నగరంలో పేరెన్నిక గన్న ఛాయ్‌ హోటల్‌ నీలోఫర్‌ కేఫ్‌ యజమాని. అనుముల బాబూరావ్‌ అంటే ఎవరికీ తెలియదు. అదే నీలోఫర్‌ బాబూరావు అంటే, ఎందరెందరో మాకు తెలుసు అంటారు. నీలోఫర్‌ బాబూరావు ఛాయ్‌, బిస్కట్‌లు ఎంత పాపులరో, అంతకు మించి అతని సేవాతత్పరతను గుర్తుచేసుకుని, ప్రజలు కొనియాడుతూ వుంటారు. 

తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజసేవ చేయాలని, అన్నార్తులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తన కేఫ్‌కు సమీపంలోనే ఉన్న క్యాన్సర్‌ ఆసుపత్రికి వస్తున్న రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉదయం 500 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 300 మందికి భోజనం ఉచితంగా సరఫరా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే కాకుండా ఎవరైనా క్యాన్సర్‌ ఆసుపత్రిలో మృతి చెందితే, మృతుడి కుటుంబీకులు శవాన్ని గ్రామానికి కూడా తీసుకుపోలేని బీద స్థితిలో ఉంటే, అలాంటి అభాగ్యులకు ఉచితంగా అంబులెన్స్‌లో శవాన్ని వారి గ్రామానికి పంపించడం చేస్తూ వచ్చాడు. కొన్ని సంవత్సరాలుగా ఈ సేవ కొనసాగుతుండగా.. ఇదే స్పూర్తితో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఉచిత అంబులెన్స్‌ సేవను ఏర్పాటు చేసి శవాలను ఉచితంగా వారి గ్రామాలకు తీసుకు వెళుతుండడం ప్రారంభించింది. దీనితో ప్రభుత్వ సేవలు ప్రారంభమయినందున తన సేవలను నిలిపివేశారు. ఇక తన వద్ద పనిచేస్తున్న 400 మంది కార్మికులకు కూడా మధ్యాహ్నం తనవద్దే ఉచితంగా భోజనం పెడుతున్నారు. కార్మికులకు ఇఎస్‌ఐ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. తమవద్ద పనిచేసే కార్మికుల పిల్లలు కూడా కార్మికులు కావద్దనే ఉద్దేశ్యంతో వారి చదువుకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తనకు తోచిన విధంగా సమాజసేవ చేస్తుండడంతో దీన్ని ఆదర్శంగా తీసుకుని పలువురు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు సంఘసేవ చేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు చేస్తున్న అన్న దానం, ఉచిత టిఫిన్లు ఇవ్వడానికి పలువురు ముందుకు వస్తే వారికి కూడా అవకాశం కల్పించి, ఒకోరోజు ఒకరికి కేటాయిస్తున్నట్లు బాబురావు తెలిపారు.

తాను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానని, చదువుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో చదువు మానుకొని, పొట్టచేతబట్టుకుని, పని వెతుక్కుంటూ హైదరాబాద్‌ నగరానికి వచ్చానని తెలిపారు. బాబురావు ఈ రోజు ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా, సంఘ సేవకుడిగా పేరు తెచ్చు కున్నా, ఆయన ఇంతగా ఎదగడా నికి తాను పడ్డ కష్టాలు, కన్నీళ్ళు, కఠోర శ్రమ గురించి ఆయన వివరించారు.   

నీలోఫర్‌ బాబూరావు తండ్రి పేరు అనుముల నారాయణ రావు, వీరిది కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దైగాం మండలం లగ్గామ్‌ గ్రామం. బాబురావు చిన్నతనంలో ఐదారేళ్ళు వాళ్ళ పెదనాన్న కిష్టయ్య దగ్గర మహారాష్ట్ర చంద్రాపూర్‌లో వుండి చదువుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడి చాక వారి పెదనాన్నకు ఈయన పోషణ భారం కావడంతో, చంద్రాపూర్‌లోనే ఉన్న వైశ్యహాస్టల్‌లో చేరారు. ఆ హాస్టల్‌లో వంద మంది ఫీజు చెల్లించి చదువుకుంటే, ఐదుగురు బీదవిద్యార్థులను ఉచితంగా చేర్చుకునేవారు. అలా హాస్టల్‌లో వుంటూ బట్టల కొట్టులో పనిచేస్తూ తన చదువుకు అయ్యే డబ్బులను సమకూర్చుకునేవారు బాబురావు. 

ఆ విధంగా 9వ తరగతి వరకు చదువుకున్నారు బాబూరావు. ఆ తర్వాత చదువు కోసం డబ్బులు అవసరమైనపుడు, ఆయన తన తండ్రి దగ్గరకు లగ్గాం గ్రామానికి వచ్చారు. ఫీజు గురించి తండ్రికి చెప్పగా తండ్రి ఆయనవద్ద డబ్బులు లేకపోవడంతో తనకు  వున్న పాడి ఆవును అమ్మి 120 రూపాయలు బాబురావు చేతిలో పెట్టాడు. ఆ విషయాన్ని తల్లి ద్వారా తెలుసుకున్న బాబూరావుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఇబ్బందులను తట్టుకులేక, చేతిలో డబ్బు కూడా లేని పరిస్థితుల్లో 1976లో  రైల్లో హైద్రాబాదుకు చేరుకున్నాడు. నాంపల్లి పరిసర ప్రాంతంలో వుండే ఒక బట్టల కొట్టులో పనిచేస్తూ, రాత్రి రైల్వే స్టేషన్‌లో పడుకునే వాడు. అది గమనించిన ఓ శ్రేయోబిలాషి ఒక సలహా ఇచ్చారట. నీకు నివాసం లేదు, కనీసం భోజన వసతి కూడా లేదు కాబట్టి, ఏదైనా హోటల్‌లో పనిచేస్తే పని చేసినందుకు జీతం, భోజన వసతి రెండూ ఉంటాయి అని చెప్పారట. అది నచ్చి ఒక హోటల్లో పని కుదుర్చుకుని, అక్కడ కొన్ని నెలలు సర్వర్‌గా పనిచేశాడు బాబురావు. అక్కడే అప్పటి బాబురావుకు ఇప్పటి భవిష్యత్తు దిశగా అడుగులు పడ్డాయి.  

నిత్యం ఆ హోటల్‌ (ఇరానీ కేఫ్‌)కి వచ్చే ఒక వ్యక్తి తాను ఒక హోటల్‌ పెడుతున్నాను నా దగ్గర పనిచేస్తావా అని అడిగాడట. దానికి బాబురావు సందిగ్దంగానే సరేనన్నాడు. ఆ వ్యక్తి పేరు దావూద్‌ షరీఫ్‌. అతను పెట్టిన హోటల్‌ పేరు ‘‘నీలోఫర్‌’’. దీన్ని అతను పదివేల రూపాయల  అడ్వాన్స్‌, నెలకు వెయ్యి రూపాయల అద్దె ఇచ్చే విధంగా అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అలా నీలోఫర్‌ హోటల్‌ ప్రారంభమయ్యింది. 

అలా కొన్ని నెలలు గడిచినా అందులో ఎటువంటి లాభాలు కనబడలేదు. దావూద్‌ షరీఫ్‌ కి అటువంటి పరిస్థితుల్లో మధ్యలోనే దాన్ని వదులుకుంటే ఇచ్చిన అడ్వాన్స్‌ కూడా వదులుకున్నట్టవుతుంది, కొనసాగిద్దా మంటే నెలకు వెయ్యి కిరాయి కట్టాలి. అయోమయంలో పడిపోయాడు దావూద్‌ షరీఫ్‌. ఆ పరిస్థితుల్లో బాబూరావుని పిలిచి, ఈ అడ్డాని నీకుగా నీవే నడుపుకో కిరాయి కూడా నువ్వే కట్టుకో 11 నెలల తరవాత నాకు ఏమిస్తావో ఆలోచిద్దాం అని నిలోఫర్‌ ని బాబురావు కి అప్పగించాడు దావూద్‌ షరీఫ్‌. అలా నీలోఫర్‌ కి యజమానిగా మారాడు బాబూరావు. కష్టపడుతూ ఆ హోటెల్‌ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. అలా అభివృద్ధిలోకి వచ్చి ఓ మోస్తారుగా నడుస్తున్న సందర్భంలో, ఆ బిల్డింగ్‌ యజమాని దాన్ని అమ్మడానికి సిద్దమయ్యి లక్ష రూపాయలకు బేరం పెట్టాడు. ఆ బిల్డింగ్‌ చేజారితే కష్టం, కానీ అంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం కూడా సమస్యే అయ్యింది బాబూరావుకు. అయినా కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు అనుకుని, మరో మిత్రుడి సహకారంతో ఆ బిల్డింగ్‌ ని కొనేసాడు బాబురావు. అలా మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకున్న వ్యాపారంతో, తన మిత్రుడు, తానూ కలిసి చార్మినార్‌ వద్ద మరో హోటల్‌ కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించారు. కొంత కాలం గడిచాక ఇద్దరు మిత్రులు ఎవరికి వారు ఒక్కో హోటల్ని సొంతం చేసున్నారు. 

అలా ఎదిగిన బాబురావు ప్రస్తుతం మూడు బిల్డింగులలో నీలోఫర్‌ హోటల్‌ని నడుపుతున్నాడు. ఇందులో ఒకటి బంజారాహిల్స్‌ లో వుంది. త్వరలో మరొకటి అత్యంత విశాలమైన స్థలంలో నిర్మిస్తున్నానని చెప్పారు బాబురావు అది హిమాయత్‌నగర్‌ లో రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం తన దగ్గర దాదాపు 400 మంది పనివాళ్ళు పనిచేస్తున్నారని, వీరందరికి రోజూ ఉచిత భోజనంతో పాటు, ఈఎస్‌ఐ సౌకర్యాన్ని, అలాగే అందరికీ గ్రూప్‌ ఇన్సూరెన్సు సౌకర్యాలను కల్పించారు. అలా ఒక హోటల్‌ వ్యవస్థను కూడా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం హోటల్‌ వ్యాపారమే కాకుండా, టీ పొడి తయారుచేసే వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చందనవెల్లి పారిశ్రామికవాడలో ప్రభుత్వం కేటాయించిన ఆరు ఎకరాల స్థలంలో టీ పొడి తయారుచేసే ఫ్యాక్టరీని భారీగా విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్లాటీనం, డబుల్‌ డిలైటీ, సూపర్‌ డస్ట్‌ అని మూడు రకాల టీపొడిని ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇది కొద్ది మొత్తంలో తయారవుతోంది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పంపిణీ చేసే విధంగా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.  

నీలోఫర్‌ ఛాయ్‌, ఉస్మానియా బిస్కట్‌ లే కాకుండా, ఉదయం 4.00 గంటలకు మొదలై 5.30 వరకు అయిపోయే బన్‌ మస్కా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బాబురావు వ్యాపార సూత్రం ఒక్కటే, తయారు చేసే ప్రతి పదార్థం నాణ్యమైనదిగా ఉంటేనే దాన్ని విక్రయిస్తారు. సరుకులలో నాణ్యత, పనిచేసేవారి పట్ల ఆత్మీయత, సమాజం పట్ల సేవా దృక్పథాలే బాబురావు నియమాలు. నీకు సంపద కలిగిన నాడు బీదవారికి కొంత సహాయం చెయ్యి అని చెప్పిన తన తండ్రి మాటలను ఇప్పటికీ గుర్తుంచుకుని సమాజ సేవ చేస్తున్నాడు బాబూరావు.

ఎందరికో స్ఫూర్తి బాబూరావు

క్యాన్సర్‌ ఆసుపత్రి ఆవరణలో ప్రస్తుతం వున్న శ్రీ చక్రాధిష్టాన కనకదుర్గా దేవి ఆలయాన్ని బాబూరావు పాతిక సంవత్సరాల క్రితం నిర్మించి, విగ్రహ ప్రతిష్టాపన జరిపారు. ఆ దేవాలయ పూజారి బేల్పాటి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలోనే తాను చేపట్టే అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నదని అంటారు బాబూరావు. తాను మొదలు పెట్టిన అన్నదాన కార్యక్రమానికి ఎందరో దాతల నుండి విశేష ఆదరణ రావడంతో, ఒక్కోసారి తనకే అవకాశం లేకుండా పోతోందని బాబూరావ్‌ అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగిస్తున్నందువల్లే తాను ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా వున్నానని, అందుకే యింకా బ్రతికి వున్నానని ఎంతో ఉద్వేగ భరిత కంఠంతో చెప్పారు నీలోఫర్‌ బాబూరావు.

ఆలయ పూజారి శ్రీనివాస్‌శర్మ..

ఆలయ పూజారి బేల్పాటి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ నీలోఫర్‌ బాబూరావు చేపట్టిన ఆలయంలో దాదాపు 18 సంవత్సరాల క్రితం శ్రీ చక్రాన్ని స్థాపితం చేశారని చెప్పారు. ఇప్పటికీ ప్రతి నెల పౌర్ణమి నాడు ఈ దేవాలయంలో సత్యనారాయణ వ్రతం నిర్వహించి ఆ రోజు సాయంత్రం వరకు అన్నదాన కార్యాక్రమం బాబూరావు నిర్వహిస్తారని అన్నారు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన బాబూరావు సేవా కార్యక్రమం, ప్రస్తుతం మతాతీతంగా కొనసాగు తున్నదని తెలిపారు. ఎందరెందరో దాతలు ఒక రోజు తాము అన్నదానం చేస్తామని ముందుకొస్తున్నారని అన్నారు. 

నెలలో రెండు గురువారాలు అక్బర్‌ రూపానీ,అలాగే నెలలో ఒక రోజు సలీం పూజాని, ప్రతి మంగళవారం దివంగత నర్సింగ్‌ నాథ్‌ సోనీ (కుందన్‌  జువెల్లర్స్‌) పిల్లలు అన్నదానం చేస్తుంటారట. ఎవరికి తోచినంతలో వారు ఒక పూట భోజనం కానీ, ఒక పూట టిఫిన్‌ కానీ అందిస్తున్నారట. ఎవరూ రాని రోజు, బాబూరావే భోజన కార్యక్రమం నిర్వహిస్తారని ఆలయ పూజారి తెలిపారు. ఇక్కడ దాతలు ఎవరైనా అన్నార్తులకు, టిఫిన్‌ (ఉప్మా) పెట్టించాలంటే అందుకు అయ్యే ఖర్చు 4,500 రూపాయలు, ఈ టిఫిన్‌ 450-500 మందికి సరి పోతుంది. అలాగే భోజన సౌకర్యం కోసం ఒక రోజు ఖర్చు 16,000 రూపాయలని  పూజారి శ్రీనివాస శర్మ తెలిపారు. ఎవరైనా ఇక్కడి భోజన / టిఫిన్‌ వితరణ కార్యక్రమం నిర్వహించాలంటే (శ్రీనివాస శర్మ – 9866338445) సంప్రదించాలని అన్నారు. ఈ భోజన / టిఫిన్‌ వితరణ కార్యక్రమం నిరంతరం జరుగుతూనే వుంటుంది. ఇందు కోసం      శుచి, శుభ్రతలు పాటిస్తూ అన్ని సపర్యలు చేయ డానికి నాలుగు జంటలు పనిచేస్తున్నారని అన్నారు.