|

నిజాం నవాబు ఎందుకు గొప్ప?

nizam-nawabహైదరాబాద్‌ నగర చరిత్రను ఎందరో కవులు, రచయితలు తమకు తోచిన విధంగా వర్ణించారు. చార్మినార్‌ మీద ఎగిరే పావురాలు శాంతి పతాకలై కనిపించేవి. బాగే ఆమ్‌: పబ్లిక్‌ గార్డెన్స్‌లో పచ్చని గడ్డిమీద పాదాలు మోపితే చిరకాల రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు. ‘ఫవ్వారా’ (ఫౌంటెన్‌)లోని జలకణాలు తలలమీద చల్లదనాలు చల్లేవి. ఏడాదికి పది నెలలు వాతావరణం చల్లగా ఉండేది. ఏప్రిల్‌, మే మాసాల్లో వేడిగా ఉండేది. అంతే. గుల్‌మొహర్‌పూలు ఎక్కడపడితే అక్కడ కన్నులకు విందు చేస్తుండేవి అని మహాకవి డా. దాశరథి వర్ణించారు.

‘అప్పుడు హైదరాబాద్‌ సంధ్యలో శిరసెత్తిన గులాబీలా ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణం, తీయని నీళ్ళు, పచ్చని చెట్లతో ఉద్యానవనంలా ఉండేదని’హిందీ కవయిత్రి ధన్‌రాజ్‌ గిర్‌ అభిప్రాయం.

ఏడవ నిజాం: ఏడవ నిజాం నవాబు ఉస్మాన్‌ అలీఖాన్‌ 1911లో రాజ్యాధికారం చేపట్టాడు. 1918లో రాష్ట్రంలో అభివృద్ధి శకం ప్రారంభమైంది. ఆ సంవత్సరమే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. మూసీనది వరదలను అరికట్టడానికి ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లు కట్టారు. నిజాంసాగర్‌ నిర్మాణంతో ఏటా మూడు లక్షల ఎకరాలకు నీటిపారుదల వసతి కలిగింది. పాలేరు, వైరా, తుంగభద్ర, రాజోలిబండ, కడెం, మూసీ, మానేరు ప్రాజక్టులు ఉస్మాన్‌ అలీఖాన్‌ నిర్మించినవే. ఆ ప్రాజెక్టులు నిర్మించిన ఇంజినీరు అలీ నవాజ్‌జంగ్‌. బోధన్‌లో నిర్మించిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే పెద్దది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు నిజాం కట్టించినవే. ఈ భవనాల నిర్మాణంలో ఏడవ నిజాం, మొగల్‌ చక్రవర్తులకు ధీటు అనిపించాడు.

The Nizam Tact
His Highness stay at Hanumankonda for about a month has been fruitful of one very good result. The Unfortunate strained relationship between Hindus and Maratwada and a section of Mahomedan Population of the place has been completely clearedup. Inspite of the fact that the relationship between Mahomedans and the Hindus is preminently the most amicable in His Highness Dominions.Some irresponsible men of the palace started a riot a year ago, and more than wel to do Hindus overa arraigned Before the District Magistrate for riolting and other kindered offences. which was However, withdrawn by the prompt orders of His Highness, and the request to it in the attempt of the building of a mosque on the spot was, on the report of committe specially appointed for the purpose directed to be abandoned, a public school bearing constructed in lieu thereof. The request of this wise measure has been the promotion of peace and of not only Hindus, but all Mahomedan residents and official thereof.
Indian Patriot Feb.23 1914.

31వ కాంగ్రెస్‌ సమావేశాలు లక్నోలో అంబికా చరణ్‌ మజుందార్‌ అధ్యక్షతన 1916 డిసెంబరు నెలలో జరిగాయి. ‘‘మత ఘర్షణలు ఎక్కువగా బ్రిటీష్‌ ఇండియాలోనే జరుగుతున్నాయి. సంస్థానాలలో హిందూ ముస్లింలు సోదరభావంగానే జీవిస్తున్నారు. ముస్లిం సంస్థానమైన హైదరాబాద్‌లో దాదాపు 70 శాతం జనాభా హిందువులదే. కానీ, అక్కడ గోహత్య గురించిన అల్లర్లుగాని, మొహర్రం గురించిన అలజడులుగాని జరుగవు’’ అన్నారు.

అనవసర ఖర్చులకు దూరం

హైదరాబాద్‌ రాష్ట్రంలో అత్యున్నతమైన హైకోర్టు ‘జుడిషియల్‌ కమిటీ’ ఉండేది. పోలీసు చర్య తరువాత దీన్ని రద్దుచేసి దీని విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకి బదలాయించారు. ఈ కేసులను హైదరాబాదులోనే పరిశీలించడానికి వీలుగా న్యాయమూర్తి మెహర్‌చంద్‌ మహాజన్‌ నియమితులైనారు. మహాజన్‌ 1950 ఆగస్టు నుండి 1950 డిసెంబరు వరకు హైదరాబాద్‌లోనే ఉండి ఈ పని పూర్తి చేశారు. ఒకసారి జస్టిస్‌ మహాజన్‌ నిజాంను కలుసుకున్నప్పుడు`‘‘మీరు రోజూ పాత మొఘల్‌ ఫోర్ట్‌ కారులోనే ప్రయాణం చేస్తుంటారెందుకు’’అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా రాజ్‌ప్రముఖ్‌ హోదాలో ఉన్న నిజాం ‘‘నావద్ద అధునాతనమైన కార్లు ఉన్న సంగతి అందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ కొత్తకారు ఉత్పత్తి అయినా నా దగ్గరకు వస్తుంది. కానీ నేను ఫోర్డ్‌లోనే ప్రయాణం చేస్తాను. ఎందుకంటే నేను కారును ప్రయాణ సాధనంగా భావిస్తాను కానీ విలాస సాధనంగా భావించను. ఫోర్డ్‌ పని చేస్తున్నంతసేపు నాకు ఇంకొక కారు అవసరంలేదు. అనవసరమైన ఖర్చులకు నేను ఇష్టపడను’’అని సమాధానమిచ్చారు.

1944లో నిజాం ఆస్తుల విలువ రూ.800 కోట్లు ఉంటుందని రీడర్స్‌ డైజెస్ట్‌ అంచనా వేసింది. సాలుసరి రాబడి రూ. 360 లక్షలని ఆ పత్రిక తెలిపింది. తాను నెలకు రూ. 70లోపునే తన ఖర్చులకు వాడుకుంటానని నిజాం ఆ పత్రికా విలేకరితో చెప్పుకున్నాడు.

@@@

చార్మినార్‌ దగ్గర ఒక హకీమ్‌ సాహెబ్‌ ఉండేవారు. తనవద్ద తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయని యూనివర్సిటీకి అవసరమవుతాయని దరఖాస్తు పెట్టుకున్నారు. అది ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారి పరిశీలనకు వచ్చింది. ఆయన ఆ పుస్తకాల పట్టికలను పరిశీలించి అవి అరుదైనవని, యూనివర్సిటీకి అవసరమని సిఫారసు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత తనను చూడవలసిందని వైస్‌ ఛాన్సలర్‌ మెహదీయార్‌ జంగ్‌ నుంచి సుబ్బారావు గారికి కబురొచ్చింది. ఇద్దరూ కలిసి హకీం సాహెబ్‌గారింటికి వి.సి. కారులో వెళ్ళారు.

ఒక చిన్న పాటిగదిలో పుస్తకాలు కట్టలుకట్టలుగా పడి ఉన్నాయి. పుస్తకాల బూజు దులిపి సుబ్బారావుగారు పరిశీలించారు. ఆ అమూల్య సంపద యూనివర్సిటీలో ఉండవలసిందని సిఫారసు చేశారు. వైస్‌ఛాన్సలర్‌ మరో మాట మాట్లాడకుండా 35వేలు చెల్లించి ఆ పుస్తకాలు కొనుగోలుచేశారు. ఫ్యూడల్‌ పరిపాలనలోకూడా మంచి పనులు జరిగాయని ఈ సంఘటనను పేర్కొనవలసి వచ్చింది.

ఇచ్చిన మాట తప్పలేదు…

ఆరవ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ బహాద్దూర్‌ ధర్మాత్ముడు. హిందూ`ముస్లిం అనే బేధభావం లేకుండా పరిపాలన కొనసాగించారు. మాణిక్యప్రభువే మహబూబ్‌ అలీఖాన్‌ రూపంలో మరల జన్మనెత్తాడని హిందూ ప్రజలు భావించుకునేవారు. అందుకనే ఆయన పేరు వచ్చే విధంగా తమ పిల్లలపేర్లు పెట్టుకున్నారు. అలా పెట్టుకున్నవే మహబూబ్‌రాయ్‌, మహబూబ్‌కరన్‌, మహబూబ్‌రెడ్డి, మహబూబ్‌ పర్షాద్‌ మొదలైనవి.

ఒకరోజు సనాతన ధర్మ పరాయణుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి తాను చేసే పూజలకు ప్రభు సహకారం కావాలని కోరి మహబూబ్‌ అలీఖాన్‌వద్ద మాట తీసుకున్నారు. ఇచ్చిన మాట కాదనడం రాజధర్మంకాదు.

ఆ రోజుల్లో ఆరవ నిజాం పురానీ హవేలీలో నివసించేవాడు. మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడువచ్చి మహబూబ్‌ అలీఖాన్‌ చేయి పట్టుకొని ఒక రావిచెట్టు కింద కూర్చోబెట్టాడు. ప్రభువుకు అభ్యంగనస్నానం చేయించాడు. ముఖానికి కుంకుమ బొట్టుపెట్టి వొళ్ళంతా పసుపునీరుతో తుడిచాడు. ఈ పని జరుగుతున్నంతసేపు ఏవేవో సంస్కృత శ్లోకాలు వల్లించాడు.

గతంలో యిలాంటి పనులు చేయించుకున్న రాజులు సుఖపడ్డారని, వారి ప్రజలకు క్షేమం కలిగిందని కొన్ని ఉదాహరణలిచ్చాడు. అందుకు నిజాం సంతోషపడి ఆ బ్రాహ్మణుని భక్తికి మెచ్చుకొని లక్ష రూపాయలు దానమిచ్చాడు. ప్రజల మేలుకోసం మతంతో సంబంధం లేదనుకొన్నాడు.

మరొకసారి ఇంతకన్నా విచిత్రమైన విషయం జరిగింది. పురానీహవేలీ వెనుకాల కొందరు హిందూ స్త్రీలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆడుకుంటున్నారు. తనివితీరా ఈ దృశ్యం చూసిన నిజాం తన్మయుడైపోయి వెళ్ళి తన హావేలీకి ఆహ్వానించి రాత్రి ఒంటిగంట వరకు వారిచేత ఆటలు ఆడించి ఆనందపరవశుడైపోయాడు. ఆటలు ముగిసిన తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ దేవతకు భక్తితో ప్రణమిల్లి విలువైన బంగారు కానుకలు చెల్లించుకున్నాడు.

ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బృహత్తర ఉదార హృదయుడు. ఫూల్‌పూర్‌లో శ్రీనికేతన్‌ స్థాపనకు లక్ష రూపాయలు, శాంతినికేతన్‌లో ఇస్లాం పీఠం స్థాపనకు మరో లక్షా 25వేల రూపాయలు విరాళమిచ్చాడు. ఆంధ్ర యూనివర్సిటీకి లక్ష, బనారసు యూనివర్సిటీకి లక్ష ఇచ్చాడు. పుణెలోని భండార్కర్‌ చేపట్టిన మహాభారత రిసెర్చి ప్రచురణకు రూ.25,000, అక్కడే ఒక అతిథి భవన నిర్మాణానికి 10వేలు మంజూరు చేశాడు. పరిశోధకుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. అది వేరు సంగతి.

సంస్థానాల రద్దు సమయంలో నిజాం నవాబుకు భారత ప్రభుత్వం ఏటా యాభై లక్షల ప్రీవీ పర్సు ఏర్పాటు చేసింది. ఉస్మాన్‌ అలీఖాన్‌ తండ్రిగారైన ఆరవ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌కు స్వంత ఖర్చుల నిమిత్తం నిజాం ప్రభుత్వం ఏటా యాభైలక్షలు ఇచ్చేది. ఆరవ నిజాం కాలంలో నిజాం రాష్ట్ర ఆదాయం ఆరు కోట్లు మాత్రమే. 1947-48లో రాష్ట్ర ఆదాయం 26 కోట్ల 78 లక్షలకు పెరిగింది. అంటే నిజాం రాష్ట్రం భారత ప్రభుత్వంలో కలిసిపోయినప్పుడు దాని మాజీ పాలకులిచ్చిన ప్రీవీ పర్స్‌ విలువ ఆ రాష్ట్రాదాయంలోని రెండు శాతం మాత్రమే. బరోడా మహారాజుకు 26 లక్షలు (ఆ సంస్థానం ఆదాయంలో 6 శాతం) బికనీరు, జోధ్‌పూర్‌, పాటియాల మహారాజులకు వరుసగా 5, 6, 7 శాతం వారి రాష్ట్రాదాయాలలో ప్రీవీ పర్స్‌గా లభించాయి.

మనదేశంలో మూడో అతిపెద్ద మ్యూజియం సాలార్‌జంగ్‌ మ్యూజియం. ఒకేవ్యక్తి సేకరణలో ఏర్పాటైన వాటిలో ప్రపంచంలోనే పెద్దది. ఎనభైమూడు సంవత్సరాలు జీవించిన నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1967 ఫిబ్రవరి 21న స్వర్గస్థులైనారు. 1911లో రాజ్యానికొచ్చాడు. ముప్పయ్‌ఏడు సంవత్సరాలు సంస్థానధీశులలో మేటిగా హైదరాబాద్‌ రాజ్యాన్ని పాలించి స్వరాజ్యం వచ్చిన తరువాత, రాజ్‌ప్రముఖ్‌గా కొన్నాళ్ళు ఉండి. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత రాజ్యచిహ్నాలేగాని, అధికారం లేకుండా జీవితం గడిపి హతాశుడై దివంగతుడైనాడు. ఇందిరాగాంధీ తన సంతాపసందేశంలో ‘ఒక శకం అంతరించింది’ అని పేర్కొన్నారు. తెలుగువారి చరిత్రలో ఇది నిజంగా ఒక శకమే!