పరీక్షల్లో విజయానికి దగ్గరి దారులుండవు
- కేశవపంతుల వేంకటేశ్వర శర్మ

రాష్ట్రంలో ఇప్పటికే సుమారు లక్షకుపైగా పోస్టుల భర్తీ ముగిసింది. త్వరలో మరో యాభైవేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో నోటిఫికేషన్స్ రానున్నాయి. నిరుద్యోగుల కలలు సాకారం చేయడానికి నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా సమయాన్ని సద్వినియోగం చేసుకొన్న వారే భవిష్యత్‌లో విజేతలుగా నిలుస్తారు. నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తూ కాలం వృథా చేయకూడదు.
సిలబస్‌లను, పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. నోటిఫికేషన్లు రాగానే సిలబస్‌లను అందరూ చూస్తారు. నోటిఫికేషన్లు రాగానే ఓల్డ్ పేపర్ల గురించి అందరూ పరుగెడతారు. నోటిఫికేషన్లు రాగానే పుస్తకాల కోసం అందరూ వేటాడతారు. కానీ నోటిఫికేషన్లు రావడాని కంటే ముందు మేల్కొని ఈ పనులు చేస్తేనే పోటీలో అందరికంటే ముందుంటారు. ఏం చేయాలి? దీనిపై నిపుణుల సూచనలు, సలహాలు తెలుసుకుందాం… ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో యాభైవేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభంకానున్నదని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మంత్రులు పలు ప్రకటనలు చేసిన విషయం విదితమే. అయితే నోటిఫికేషన్స్ విడుదలలో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. దీనివల్ల నోటిఫికేషన్స్ రావడంలో కొంత ఆలస్యం జరుగుతుండవచ్చు. కానీ తప్పక నోటిఫికేషన్స్ వస్తాయి.
సందేహాలు వద్దు!
నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనేది చాలా మందికి అనేక అపోహలు, అనుమానాలు. అయితే గతాన్ని ఒకసారి పరిశీలిస్తే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతగ్రూప్-2, గురుకులాల్లో పోస్టులు, విద్యుత్ సంస్థల్లో పోస్టులు, కానిస్టేబుల్, ఎస్‌ఐ తదితర నోటిఫికేషన్స్ వచ్చాయి. సుమారు లక్షకు పైగా పోస్టులు భర్తీ పూర్తయిన సంగతి మన కళ్లముందే కన్పిస్తోంది.కాబట్టి పోస్టుల భర్తీ జరుగుతుందా లేదా అనే సందేహాలు పెట్టుకోవద్దు. మీరు సాధించాలనుకున్న పోస్టు ఏమిటి? దానికోసం ప్రయత్నాలను ప్రారంభించాలి.
ఏం చేయాలి?
మీరు రాబోయే నోటిఫికేషన్లలో ఒక పోస్టు సాధించడం ఎలా? దీనికి ఎలా సిద్ధం కావాలి? దీనికోసం ముందే మేల్కొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. లేదంటే తీవ్రమైన పోటీలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.
సొంత విశ్లేషణ అవసరం
రాబోయే నోటిఫికేషన్లలో కచ్చితంగా ఏదో ఒక పోస్టు సాధించాలనుకుంటే ముందుగా కొన్ని విషయాలకు సంబంధించి సొంత విశ్లేషణ చేసుకొని స్పష్టమైన అవగాహనకు రావాలి. ముందుగా రాబోయే నోటిఫికేషన్లలో ఏయే పోస్టులకు మీకు అర్హత ఉందో ఒక జాబితా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో మీరు జాబ్ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న పోస్టులు ఏమిటో పరిశీ లించాలి. అంటే మీకున్న నాలెడ్జ్, సబ్జెక్టు అవగాహన, ఆ పోస్టులకు ఏ స్థాయిలో పోటీ ఉండవచ్చు. ఇలా సంబంధిత అంశాలు అన్ని పరిశీలించి మీరు ఏ పరీక్షలు రాయడం మంచిదో నిర్ణయించుకోవాలి. ఒకే ప్రిపరేషన్‌తో ఎన్ని పరీక్షలు రాసే అవకాశం ఉంటే అన్ని పరీక్షలు రాయాలనుకోవడం సహజం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయ మేమిటంటే మీకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించడం ముఖ్యం అయితే ప్రిపరేషన్ ఒక విధంగా ఉంటుంది. నిర్దిష్టంగా పలానా పోస్టు సాధించడం లక్ష్యంగా ఉంటే ప్రిపరేషన్ మరో విధంగా ఉంటుంది. అందువలన ఈ విశ్లేషణ చేసుకొని ఏ పరీక్షలు రాయాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి.
నైపుణ్యాలే ఆధారం
సాధారణంగా చాలామంది అభ్యర్థులు అన్ని నోటిఫి కేషన్లకు దరఖాస్తులు పంపి అన్ని పరీక్షలు రాస్తుంటారు. కానీ చివరికి ఏ పోస్టు రాక తిరిగి మరో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా నివారించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు వ్యాసరూప పద్ధ్దతిలో సమాధానాలు రాయగలిగే నైపుణ్యాలు ఉంటేనే గ్రూప్-1కు ప్రిపేర్ కావాలి. ఆ నైపుణ్యాలు లేవనుకుంటే గ్రూప్-2 వంటి ఇతర పరీక్షలకు ప్రిపేర్ కావడం మంచిది. గ్రూప్-2లో కేవలం ఆబ్జెక్టివ్ పేపర్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ పోస్టు గ్రాడ్యుయేట్ అయి ఉండి సంబంధిత సబ్జెక్టులో పట్టు ఉండి బోధనపట్ల ఆసక్తి ఉంటే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ వంటి పోస్టులకు ప్రిపేర్ కావచ్చు. బీఈడీ పూర్తిచేసి ఉంటే డీఎస్సీ లేదా గురుకుల టీచర్లతోపాటు కేంద్రీయ విద్యాలయా ల్లో పడే టీచర్ పోస్టులకు ప్రిపేర్ అయితే మం చిది. ఒకసారి ఏ పరీక్షలు రాయాలో స్పష్టంగా నిర్ణయించు కున్న తర్వాత ప్రిపరేషన్ వెంటనే ప్రారంభించాలి. అయితే ఇక్కడ కూడా కొన్ని గమనించవలసిన విషయాలు ఉన్నాయి.
1) సిలబస్‌ల అధ్యయనం
ఒకవేళ రాయబోయే పరీక్షలు ఒకటికంటే ఎక్కువ ఉంటే వాటి సిలబస్‌లను సమగ్రంగా పరిశీలించి అవగాహన తెచ్చుకోవాలి. ఆయా పరీక్షల సిలబస్‌లను ఒక దానితో ఒకటి పోల్చి చూసి అదనంగా ఉన్న అంశాలను గుర్తించాలి. ఉదా హరణకు గ్రూప్-1 ప్రిలిమినరీ, గ్రూప్-2 సిలబస్‌కు కొంచెం తేడా ఉంటుంది.
ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేయండి !
ఏ పరీక్ష అయినా కొన్ని సబ్జెక్టులు లేదా సిలబస్ విషయంలో కామన్‌గా ఉంటాయి. ఆయా పోస్టులు లేదా పరీక్షలను బట్టి కాఠిన్యత స్థాయిలో మార్పు ఉండవచ్చు. ఉదాహరణకు కరంట్ అఫైర్స్ విషయానికి వస్తే గ్రూప్-4 అయినా గ్రూప్1 అయినా ఇది కామన్. కానీ ప్రశ్నల స్థాయిలో భేదం ఉంటుంది.
అదేవిధంగా, పాలిటీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ తదితర అంశాలు అన్ని కామన్‌గానే ఉంటాయి. దీనిలో లోతు ఎక్కువగా పోతే గ్రూప్-1 స్థాయి. కొంచెం తక్కువ పోతే గ్రూప్-2 లేదా 4 స్థాయి. అదేవిధంగా కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల విషయంలో కూడా చాలా అంశాలు కామన్‌గా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌గా అంటే మీరు పెట్టుకున్న లక్ష్యానికి సంబంధించిన పరీక్షకు దగ్గరగా ఉండే సిలబస్ అన్నింటిని పూర్తిగా చదవండి. రివిజన్, ప్రాక్టీస్ చేయండి.
నోటిఫికేషన్ రాకముందే సిలబస్ పూర్తి !
నోటిఫికేషన్ రాకముందే దానికి సంబంధించిన సిలబస్‌ను అవగతం చేసుకుని ప్రామాణిక పుస్తకాలను చదవడం తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి వందశాతం అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ రాకముందే సిలబస్‌ను పూర్తిచేసి అవకాశం ఉంటే కనీసం ఒకటి రెండుసార్లు రివిజన్ చేసుకోవడం, సిలబస్‌లోని అంశాలు లేదా సబ్జెక్టులపై ప్రాక్టీస్ పేపర్లను సాల్వ్‌చేయడం చేయాలి. దీనివల్ల ఎక్కడైనా వీక్‌గా, అంటే మీరు వెనుకబడినట్లు అనిపిస్తే దాన్ని తిరిగి చదవడం, పూర్తిస్థాయిలో ఆ సబ్జెక్టుపై పట్టు సాధించడం చేస్తే తప్పక విజేతలుగా నిలస్తారు.
పాత ప్రశ్నా పత్రాల పరిశీలన
సిలబస్‌లను పోల్చి చూసి వాటిపై సమగ్ర అవగాహన తెచ్చుకున్న తర్వాత ఆయా పరీక్షలకు సంబంధించి గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాలను కూలంకషంగా పరిశీలించాలి. కొంతమంది అభ్యర్ధులు మొత్తం ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత చివర్లో పాత ప్రశ్నాపత్రాలు చూసి ఆన్సర్ చేస్తారు. ఇది తప్పు కాదు కానీ, ప్రిపరేషన్ ప్రారంభంలోనో లేదా ప్రిపరేషన్ మధ్యలో అప్పుడప్పుడూ చదువుతున్న అంశానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలు చూడడం సరైన విధానం అని చెప్పవచ్చు. దీనివలన ప్రశ్నలస్థాయి, ప్రశ్నలు అడుగుతున్న విధానం, పరీక్షల రీత్యా సిలబస్‌లో ముఖ్యమైన అంశాలు ఏమిటో అవగాహన కలుగుతుంది. ప్రశ్నలు రిపీట్ అయ్యే అవకాశం ఉన్నందువలన అవే ప్రశ్నలు రాబోయే పరీక్షలో వస్తే జవాబులు సులభంగా గుర్తించవచ్చు. ప్రశ్నలకు అనుగుణంగా ప్రిపరేషన్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ ప్రయోజనాల దృష్ట్యా పాత ప్రశ్నాపత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలి. సాధారణంగా పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో గత ప్రశ్నాపత్రాల నుంచి 10నుంచి 15 ప్రశ్నల వరకు రిపీట్ అవుతుంటాయి. అందువలన పాత ప్రశ్నా పత్రాలు ఫాలో అయితే ఈ మార్కులు సాధించినట్లే.
దృష్టంతా లక్ష్యంపైనే !
ఏదైనా సాధించాలంటే మనసు, శరీరంలోని ప్రతి
అవయవంలో కూడా దానిగురించే ఆలోచన ఉండాలి. తదైక దృష్టితో లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళిక వేసుకుని అహర్నిశలు శ్రమించాలి. విజయం ఎప్పుడూ శ్రమించేవారికే వస్తుంది. కఠోర శ్రమనే విజయానికి దగ్గరి మార్గం అని మరిచిపోవద్దు. ప్రిపరేషన్లో ఎప్పుడైనా ఆటంకాలు, పీఠభూమి దశ అంటే నిర్లిప్తతా ఆవహిస్తే వెంటనే మీకు మీరు స్వయం ప్రేరణ చేసుకోవాలి. అంటే సెల్ఫ్ మోటివేషన్. అది సరిపోక పోతే సీనియర్లు, విజేత ఇంటర్వ్యూలను చదివినా, యూట్యూబ్‌లో విజేత ఇంటర్వ్యూ వీడియోలను చూసి ప్రేరణ పొందాలి.
కచ్చితమైన సమయపాలన అంటే టైంటేబుల్ పెట్టుకుని దాన్ని సరిగ్గా అమలు చేయాలి. నిర్ణయించుకున్న సమయానికి ప్రణాళికలో అనుకున్న ప్రకారం సిలబస్ లేదా అంశాలను చదవడం పూర్తి చేయాలి. ఒకసారి ఒక అంశం చదివిన తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం చేస్తే మీరు ఆ అంశంపై సాధించిన పట్టు ఎంత అనేది తెలిసి పోతుంది. పూర్తి స్థాయిలో పట్టు రాకుంటే తిరిగి దాన్ని చదివి పట్టు సాధించాలి. ఇలా ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం, ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో విజయం మీ సొంతం.
ప్రిపరేషన్ సమయంలో ఇవి గుర్తుంచుకోండి
లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించిన తర్వాత లక్ష్యం చేరేవరకు అనేక ఆటంకాలు వస్తుంటాయి. కానీ వాటిని మీరు పట్టించుకోవద్దు. వాటిని రెట్టింపు పట్టు దలతో అధిగమించాలి. సినిమాలు, టీవీలు, కాలక్షేపాలు, సోషల్ మీడియాలు, పంక్షన్లు ఇలా అన్నింటిని పక్కన పెట్టా ల్సిందే. ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు ఆయా సందర్భాలలో కొంత ఒత్తిడి తేవచ్చు. ఒక్కరోజే కదా పంక్షన్‌కు పోదాం, సినిమాకు పోదాం అని అనవచ్చు. కానీ కరిగిపోయిన కాలం తిరిగి రాదు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. దానికంటే ముందు మరో విషయం.. మీరు అనుకున్న లక్ష్యం చేరుకుంటే ఇప్పుడు ఇబ్బంది పెట్టిన వారు, మీకు దూరంగా ఉన్నవారు సైతం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు ఏది సాధించ కుండా ఉంటే ఎవరూ మిమ్మల్ని గుర్తించరు, సహాయం చేయరు. చిన్నచూపు చూస్తారు. మీకంటూ సమాజంలో ఒక గుర్తింపు రావాలంటే హోదా, చాలా ముఖ్యం అనే విషయాన్ని పదేపదే గుర్తుకు తెచ్చుకోండి. పలు మాధ్యమాలలో వచ్చే కొన్ని పుకార్లు, షికార్లను నమ్మవద్దు. నోటిఫికేషన్స్ రావడం ఆలస్యం కావచ్చు కానీ వచ్చి తీరుతాయి అనేది సత్యం. కాబట్టి ప్రిపరేషన్ నిరంతరం కొనసాగించండి. లక్ష్యాన్ని చేరుకోండి. మీ కఠోర శ్రమే మీ వజ్రాయుధం. పరీక్షలో విజయం మీ సొంతం కావాలంటే దగ్గరి దారులేవి ఉండవు. కేవలం కఠోర శ్రమ మాత్రమే దగ్గరి దారి. దాన్ని నమ్ముకుని శ్రమిస్తే విజేతలు మీరే ! ఆల్ ది బెస్ట్ !