ఇలాంటి ఇళ్ళు ఎక్కడా లేవు
హైదరాబాద్ నగరంలో పేదలకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలు
దేశంలోని ఏ మహానగరంలో కూడా లేవని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐ.టి శాఖల మంత్రి
కె. తారక రామారావు అన్నారు.

హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ లోని ఇందిరానగర్ కాలనీలో 17.85 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 210 డబుల్ బెడ్ రూమ్ గృహాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో చెన్నై, కలకత్తా, ముంబయి, బెంగళూరు మహానగరాలలో ప్రభుత్వం నిర్మించిన ఇలాంటి గృహాలు లేవని, ఇందిరానగర్ లబ్ధిదారుల కల నెరవేరిందని అన్నారు. గత ప్రభుత్వాలు గృహాలు నిర్మించి ఇచ్చినా ఏదో ఒక లింకు పెట్టి పేదలను ఇబ్బందుల పాలు చేసేవారని, కానీ, ఇప్పుడు లబ్ధిదారులపై ఏమాత్రం భారం పడకుండా, పూర్తి వ్యయాన్ని ప్రభుత్వమే భరించి, సకల సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని మంత్రి చెప్పారు. ఇళ్ళ కేటాయింపు పారదర్శకంగా జరుపుతున్నామని, మధ్యదళారులు ఎవరికీ ఒక్క పైసా చెల్లించవద్దని మంత్రి లబ్ధిదారులను కోరారు.

హైదరాబాద్ నగరంలో 9,714 కోట్ల రూపాయలతో పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మింస్తున్నామని చెప్పారు. ఇందిరానగర్ కాలనీ నగరం నడిబొడ్డున ఉన్నదని, చుట్టూ హుస్సేన్ సాగర్, నూతనంగా నిర్మించే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్, అన్నింటికీ దగ్గరగా ఉన్న ప్రాంతమని, ఇదే గృహాలు ప్రయివేటువారు నిర్మిస్తే ఒక్కో ప్లాటు 50 నుంచి 60 లక్షల రూపాయలకు పైగా విక్రయించేవారని మంత్రి చెప్పారు. పేదల మొఖాల్లో చిరునవ్వు చూడాలని, వారు ఆత్మగౌరవంతో బతకాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
ఇందిరానగర్‌లో నిర్మించిన ఈ గృహాలకు లిఫ్ట్ సదుపాయంతో సహా, పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించామని, తాగునీరు, తదితర సదుపాయాలు కల్పించామని మంత్రి చెప్పారు. ఈ కాలనీ నిర్వహణ కోసం కాలనీలో కొన్ని షాపులను కూడా నిర్మించడం జరిగిందని, వాటిపై వచ్చిన ఆదాయంతో కాలనీని సమర్థవంతంగా, కలసికట్టుగా నిర్వహించుకోవాలని మంత్రి కోరారు.
ఆసియాలోనే అతిపెద్ద హౌసింగ్ కాలనీ కొల్లూరులో రూపుదిద్దుకుంటోందని, ఇక్కడ 112 బ్లాకులలో 15,600 గృహాలు నిర్మించడం జరిగిందని, త్వరలో దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభింప చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 18 వేల కోట్ల రూపాయలకుపైగా వ్యయపరచి రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ గృహాల నిర్మాణం చేపట్టామని చెప్పారు.
ఇందిరానగర్ కాలనీకి పక్కనే హెచ్.ఎం.డి.ఎ.కు చెందిన ఎకరం స్థలంలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ స్థలాన్ని బదలీ చేసిన తర్వాత నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవలసిందిగా మేయర్‌ను ఆయన కోరారు. మిగతా నియోజకవర్గాలలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మాణానికి 3 నుంచి 4 కోట్ల రూపాయలు వ్యయ పరుస్తున్నామని, ఇక్కడ నిర్మించే ఫంక్షన్ హాలు కాలనీ వాసులతో పాటు, ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా నిర్మిస్తామని, వందకోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఇందుకు కేటాయిస్తున్నామని చెపుతూ, తమ ప్రభుత్వానికి పేదల ప్రయోజనాలకంటే ఏదీ ముఖ్యం కాదని మంత్రి చెప్పారు.
రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ప్రభుత్వం అద్భుతమైన గృహాలు నిర్మించి ఇస్తోందని, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని చెప్పారు. అర్హులైన వారికి డ్రా ద్వారా ఇల్లు కేటాయించడం జరుగుతుందని, లబ్ధిదారులు ఇందుకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ, కమిషనర్ లోకేష్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.