|

తెలంగాణ గ్రంథాలయాల ఘన చరిత్ర 

  • జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా

By: డా. రవి కుమార్‌ చేగొని

భారతదేశంలోనే మొట్టమొదటగా గ్రంథాలయాల ఉన్నతికి బరోడా మహారాజు శియాజీరావ్‌ గైక్వాడ్‌ ప్రయత్నం చేసి అలెన్‌ బోర్దన్‌ అనే విదేశీయుని సహాయ సహకారాలతో అద్భుతమైన ప్రక్రియకు నాంది పలికారు. బరోడా ప్రాంతంలో పౌర గ్రంధాలయాలు, ట్రావెల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు.

1835లో ఏర్పాటైన కలకత్తా పౌర గ్రంథాలయం తర్వాత జాతీయ గ్రంథాలయంగా అభివృద్ధి చెందింది. 1852లో ఆండ్రూ గ్రంథాలయం సూరత్‌లో స్థాపించడం జరిగింది. 1860లో కన్నెమెరా పబ్లిక్‌ లైబ్రరీ మద్రాస్‌లో స్థాపించడం జరిగింది. 1876లో ఖుదాభక్ష్‌ ఓరియంటల్‌ గ్రంథాలయం పాట్నా. 1877లో బరోడా స్టేట్‌ లైబ్రరీ. 1886అడయార్‌ గ్రంథాలయం, అడయార్‌ అలా దేశవ్యాప్తంగా బ్రిటిష్‌ రాజ్యంలో, సంస్థానాధీశుల సహాయ సహకారాలతో, ఆ ప్రాంతంలో ఉన్న పెద్దల సహకారంతో గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి.

కానీ, తెలంగాణ రాష్ట్రంలో రాజుల సహాయ సహకారాలు లేకుండా, ఎవరి అండదండలు, సహాయ సహకారాలు లేకుండా ప్రజలే పంతొమ్మిది వందల కంటే పూర్వమే గ్రంథాలయాలు స్థాపించారంటే అది ఈ నేలకు ఉన్న సామాజిక చైతన్యం, పోరాట స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పవచ్చు. నిజాం రాష్ట్రంలో 1900 నాటికి మూడు శాతం మాత్రమే అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి సందర్భం. ఆ మూడు శాతం అక్షరాస్యతలో కూడా మరాఠాలు, కన్నడిగులు, తెలుగువారు ఉన్నారు. 

ఈ మూడు శాతం అక్షరాస్యతలో కూడా ఆనాడు గ్రంథాలయాలు నెలకొల్పారంటే దానికి ప్రధాన కారణం అక్షరాస్యత, ప్రజలకు విజ్ఞానాన్ని అందించడం కాకుండా రాజకీయ అవసరాల కోసం, రాజకీయ సమ్మేళనం, సామాజిక చైతన్యం కోసమే ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడ్డవి అనేది నిగూఢ  సత్యం. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయాలు ఎప్పుడైతే ఏర్పాటు చేయబడ్డవో నిజాం రాష్ట్రంలో సామాజిక వికాసానికి, రాజకీయ,ప్రజా చైతన్యానికి, తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవ చేసినవి  అని చెప్పవచ్చు.

ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంను రావిచెట్టు రంగారావు, రాజా నాయని వెంకట రంగారావు,  పూనికతో ఏర్పాటు చేయబడ్డ ఈ విజ్ఞాన వికాస కేంద్రం అనేక భాష ఉద్యమాలకు, అనేక రాజకీయ సమీకరణాలకు నాంది పలికిందనీ చెప్పవచ్చు. దీనికి రాజా నాయని వెంకట రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, ఆదిపూడి సోమనాథరావు, రఘుపతి వెంకట రత్నం నాయుడు, తదితర తెలంగాణ సంస్థానాధీశులు సహాయ సహకారాలు అందించారు.

అయితే హైదరాబాద్‌ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం కంటే ముందు గ్రంథాలయాలు నెలకొల్ప లేదా  అంటే నెలకొల్పబడ్డాయి అని చెప్పవచ్చు. వాటిలో1676 సంవత్సరంలో ‘‘అష్ట బాహిరి గోపాల్‌రావు గ్రంథాలయం’’ ఏర్పాటు చేయబడిరది. చాలా కాలం పాటు వనపర్తి సంస్థానంలో ఉన్న పండితులకు సేవలందించింది. 

తదుపరి 1821 జూన్‌ మాసంలో నూతన భవనంలో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయంతో పాటు 1870లో బ్రహ్మ విద్యా విలాసము పేరిట ముద్ర అక్షరశాల ఏర్పాటు చేసి ఈ గ్రంథాలయంలో కలిపారు. గోపాల్‌రావు అష్టబాహిరి గ్రంథాలయం నేడు సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద వనపర్తి పట్టణ ప్రాంతంలో  ప్రజలకు సేవలందిస్తోంది.

1878లో సికింద్రాబాద్‌లో ముదిగొండ శంకరారాధ్యులు ప్రజా గ్రంథాలయంను ఏర్పాటు చేశారు.1894లో స్థాపించబడ్డ భారత గుణ వర్ధక సంస్థ గ్రంధాలయం ఇప్పటికిని (హైదరాబాదులో) ప్రధాన గ్రంథాలయంగా వెలుగొందుతున్నది.1891లో ఏర్పాటు చేసిన అసఫియా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం హైదరాబాద్‌. ఇలా 1900 సంవత్సరానికి పూర్వమే హైదరాబాద్‌ రాష్ట్రంలో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. గ్రంథాలయాలు కాక 1900 సంవత్సరానికి పూర్వం ఇంకా రికార్డు కాని పఠనాలయాలు (గ్రంథాలయాలు) ఏర్పాటు చేయబడ్డవి. ఆ గ్రంథాలయాలను  వెలికి తీయాల్సిన  అవసరం ఉన్నది.

నాడు నిజాం రాష్ట్రంలో మాడపాటి హనుమంతరావు పూనికతో ఏర్పాటు చేయబడిన ఆంధ్ర జన సంఘం, ఆ తర్వాత ఆంధ్ర మహాసభలు కూడా గ్రంథాలయ ఉద్యమానికి ఊతం ఇచ్చాయి. ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభలు జరిగిన సమావేశాలలో హైదరాబాద్‌ రాష్ట్ర మంతటా పాఠశాలలను ఏర్పాటు చేయాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, గ్రంథా లయాలు ఏర్పాటుకు మేధావులు, ఉన్నతులు తమ సహాయ సహకారాలు అందించాలని, గ్రంథాలయ సేవకులకు తగిన సహాయ సహకారాలు అందించాలని పేర్కొనడం జరిగింది. దానితోపాటు హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉర్దూ ఉధృతంగా రాజభాషగా చలామణి అవుతున్న సందర్భంలో తెలుగు భాష పరాయి భాషగా, అవమానాలు ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రతి పల్లెలో గ్రంథాలయాలు ఏర్పాటుచేసి ఈ గ్రంథాలయాల మాటున తెలుగు భాషాభివృద్ధి, తెలుగు భాష రక్షణ, అక్షరాస్యత, ప్రజా చైతన్యంలకు పురికొల్పాయి. ఇలా తెలుగు భాష, గ్రంథాలయాలు హైదరాబాద్‌ రాష్ట్రంలో అవినాభావ సంబంధం ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిన సత్యమే.

నాడు నలుగురు కలిసి రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు, మన చుట్టూ మరియు దేశంలో ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి, తెలుగు భాష మాట్లాడుకోవడానికి, సభలకు సమావేశ స్థలం అవసరం ఉండేది. గ్రంథాలయాలు తొలుత ఆ అంశాల కోసం స్థాపించబడినాయి. కాలక్రమేణా అనేక రాజకీయ, సామాజిక, సాంఘిక ఉద్యమాలకు కేంద్రబిందువులుగా తయారైనవి.

శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్వర్ణోత్సవ సందర్భంగా ప్రచురించబడిన సంచికలో 1925 నాటికి తెలంగాణ ప్రాంతంలో వంద గ్రంథాలయాలు ఉన్నాయని, మరొక గ్రంథంలో 76 గ్రంథాలయాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. కానీ రికార్డు చేసిన గ్రంథాలయాలు మాత్రమే ఇన్ని ఉంటే రికార్డు చేయని చిన్న చిన్న గ్రంథాలయాలు ఆనాడు ఈ నిజాం రాష్ట్రంలో అనేకం కొలువుదీరాయనీ తెలుస్తోంది.

అలా నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రాంతంలో 

కొన్ని ప్రశస్తమైన గ్రంథాలయాలను పరిశీలిస్తే…

1. సురవరం ప్రతాపరెడ్డి గ్రంథాలయం, వనపర్తి-1821

2. ముదిగొండ శంకరారాధ్య ప్రజా గ్రంథాలయం సికింద్రాబాద్‌-1878

3. ధైరతుల్‌ మారిఫిల్‌ పరిశోధన కేంద్ర గ్రంథాలయం-ఉస్మానియా విశ్వవిద్యాలయం-హైదరాబాద్‌ -1888 

4. అసఫియా స్టేట్‌ సెంట్రల్‌  గ్రంథాలయం హైదరాబాద్‌-1891

5. భారతా గుణవర్ధక సంస్థ గ్రంథాలయం, శాలిబండ హైదరాబాదు-1894

6. తెలంగాణ రాష్ట్ర రాజ్యాభిలేఖన మరియు పరిశోధన గ్రంథాలయం, హైదరాబాద్‌

7. శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం-కోటి, హైదరాబాద్‌1901

8. రాజ రాజ నరేంద్ర భాషా నిలయం, వరంగల్‌-1904

9. ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం, సికింద్రాబాద్‌-1905

10. ఆది హిందు గ్రంథాలయం-1911

11. సిద్దిమల్లేశ్వర గ్రంథాలయం, రేమిడిచర్ల -1911

12. హైకోర్టు ప్రధాన గ్రంథాలయం, హైదరాబాదు-1911

13. మహబూబియా ఆంధ్ర బాషా నిలయం-ఎర్రుపాలెం-1912

14. విరాట్రాయాంధ్ర బాషా నిలయం (గ్రంధాలయం)- నేలకొండపల్లి-1912

15. శ్రీ ఆంధ్ర విజ్ణాన ప్రకాశిని గ్రంథాలయం ` సూర్యాపేట-1917

16. రెడ్డివసతి గృహ గ్రంథాలయం, హైదరాబాద్‌-1917

17. బాలభారతి ఆంధ్ర భాషానిలయం, శంషాబాద్‌-1917.

18.  శబ్దాను శాసన ఆంధ్ర భాషా నిలయం, ఓరుగల్లు-1918

19.  ఆంధ్ర సరస్వతి నిలయం నల్లగొండ-1918

20. ప్రతాపరుద్ర గ్రంథాలయం, నిజామాబాద్‌-1918

21. ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయం 1919

22. హనుమదాంద్ర భాషా నిలయం, ఆరుట్ల-1920

23. బేతి రెడ్డి గ్రంథాలయం, పిల్లలమర్రి, పాత నల్లగొండ-1920

24. బహిరామియా గ్రంథాలయం కొలనుపాక, ఆలేరు -1921

25. ప్రభుత్వ సిటీ కళాశాల గ్రంథాలయం-1921

26. ఉస్మానియా గ్రంథాలయం, మధిర-1922

27. శ్రీ వెంకటేశ్వర గ్రంథాలయం, గార్ల-1922

28. ఉస్మానియా గ్రంథాలయం, మహబూబ్‌నగర్‌-1922 

29. శ్రీ గోదావరి వాచనాలాయం, చెన్నూరు-1922

30. శ్రీ విశ్వేశ్వర ఆంధ్ర భాషా నిలయం, హుజురాబాద్‌-1922

31. బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయం-గౌలిగుడా చమన్‌, హైదరాబాద్‌-1922

32. మరాఠ గ్రంథ సంగ్రాలయ హైదరాబాదు-1922

33. జోగినాంధాంధ్ర గ్రంథాలయం – జోగిపేట-1923

34. వేమానాంద్ర బాషా నిలయం – నాంపల్లి, హైదరాబాద్‌-1923

35. జగదీశ్వర గ్రంథాలయం, జగిత్యాల – 1923

36. ఉస్మానియాగ్రంథాలయం, మంథని – 1923

37. యువజన సంఘ గ్రంథాలయం, జనగామ-1924.

38. ఉస్మానియా వైద్య కళాశాల గ్రంథాలయం, హైదరాబాద్‌-1925

39. చెన్నిపాడు-సరస్వతి గ్రంథాలయం-1934

40. శ్రీ వేణుగోపాల పుస్తక భాండాగారం, వేంసూర్‌-1935

41. శ్రీ విజ్ఞాన నికేతనం-ఖమ్మం -1936

42. రైతు (బాపుజి) గ్రంథాలయం చిలుకూరు-1942

43. ఆదర్శ గ్రంథాలయం పెంచికల దిన్నె, నల్లగొండ-1943

44. సీతారామాంజనేయ గ్రంథాలయం, మహబూబ్‌ నగర్‌-1944

45. ఖుద్వాన్‌ పుర గ్రంథాలయం ఖుద్వాన్‌పుర -1945 

46. జైహింద్‌ గ్రంథాలయం, ఖిలాషాపూర్‌- 1945

47. ఆంధ్ర భాషా నిలయ గ్రంథాలయం- షాద్‌నగర్‌-1947

48. తెలంగాణ రాష్ట్ర  అసెంబ్లీ గ్రంథాలయం, హైదరాబాద్‌-1956

49. నగర కేంద్ర గ్రంథాలయం హైదరాబాదు-1961

50. తెలంగాణరాష్ట్ర ప్రాచ్యవ్రాత పత్రుల గ్రంథాలయం & పరిశోధన సంస్థ, హైదరాబాద్‌-1967

పై వానిలో కొన్ని గ్రంథాలయాలు తప్పితే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ వాటి సేవలు  అందిస్తున్నాయి. 

ఒకనాడు ఈ హైదరాబాద్‌ రాష్ట్రంలో గ్రంథాలయాల  ఉన్నతికి ఉదృతంగా కృషిచేసినవారిలో రావు బహదూర్‌ వెంకటరామ రెడ్డి, రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంత రావు, సుగ్గుల అక్షర లింగయ్య గుప్త, వామన్‌ రావు నాయక్‌,  కోదాటి నారాయణరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, ఉన్నవ  వెంకటరామారావు, దాశరథి సోదరులు, గడియారం రామకృష్ణ శాస్త్రి, బోయినపల్లి వెంకటరామారావు లాంటి పెద్దలు ఇతోధికంగా సేవలందించి తెలంగాణ ప్రాంతంలో జ్ఞాన దీప్తులు వెలిగించారు. 

గ్రంథాలయ మహాసభలు: హైదరాబాద్‌ రాష్ట్రంలో అల్‌ హైదరాబాద్‌ గ్రంథాలయ సంఘం ఉజ్లం బకర్‌, తెలంగాణ గ్రంథాలయ సంఘం చెన్నారెడ్డి, కోదాటి నారాయణ అధ్యక్ష కార్యదర్శులుగా ఏర్పాటు చేయబడి హైదరాబాద్‌ రాష్ట్రంలో గ్రంథాలయ ఉన్నతికి, గ్రంథాలయాలు ఏర్పాటుకు, గ్రంథాలయాల శాసనాలకు అద్భుతమైన సేవలు అందించాయి ఈ సంస్థలు. హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘంతో కలిసి గ్రంథాలయ ఉన్నతికి ప్రయత్నం చేశాయి.

1925 ఫిబ్రవరి 25వ తేదీన నిజాం రాష్ట్రాంధ్ర గ్రంథాలయ ప్రథమ సమావేశం మధిరలో జరిగింది. ఈ సమావేశానికి పింగళి వెంకట రామిరెడ్డి అధ్యక్షత వహిం చారు. నిజాం రాష్ట్ర గ్రంథాలయ రెండవ సమావేశం సూర్యాపేటలో జరుప నిశ్చయించారు కానీ 1337 ఫసలీ ప్రకారం కలెక్టర్‌ అభ్యంతరం తెలిపారు. తదుపరి మాడపాటి హనుమంతరావు కృషి ఫలితంగా వామన నాయక్‌ అధ్యక్షతన  గ్రంథాలయ సమావేశాన్ని కొద్ది కాలం తరువాత ఏర్పాటు చేయడం జరిగింది.

26వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభలు 1946 మార్చి 1, 2, 3 తేదీల్లో అలంపూర్‌ లో గడియారం రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. ఇలా నాడు నిజాం రాష్ట్రంలో గ్రంథాలయ మహాసభలు ఆంధ్రప్రదేశ్‌ గ్రంథా లయ సంఘం పెద్దలు అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. 

1982 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అయిదు వందల పైచిలుకు గ్రంథాలయాలు ఏర్పాటు చేసి దేశంలోనే ఒకేసారి ఎక్కువగా పౌర గ్రంథాలయాలు ప్రారంభించిన రాష్ట్రంగా ఘనత దక్కింది. దాదాపు ఒక దశాబ్దం పాటు గ్రంథాలయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగాయి. తర్వాత 1995 నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు గ్రంథాలయ ఉన్నతి, గ్రంథ పాలకుల నియామకం అగమ్య గోచరంగా ఉంది.  గ్రంథాలయాలు అనేటువంటి సంస్థ ఎవరికీ పట్టని గోసగా తయారైన నటువంటి సందర్భం. అదేవిధంగా గ్రంథాలయాలు ఆధునీకరణ లేక విలవిలలాడిన సందర్భం.

తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ ఏర్పాటు చేసిన తర్వాత అప్పటిదాకా అపరిష్కృతంగా ఉన్న  అనేక సమస్యలు (నూతన గ్రంథాలయాల స్థాపన, గ్రంథ పాలకుల నియామకం, గ్రంథ పాలకులకు పదోన్నతి, గ్రంథ పాలకులకు 101 పద్దు కింద జీతాలు) ఒక్కొక్కటి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్జీవోలతో కలిసి, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ  కింద గ్రంథాలయాలు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. గ్రంథాలయ మేధావులతో, గ్రంథాలయ ప్రేమికులతో మేధోమధనం నిర్వహించి నిజంగా నేటి సాంకేతిక ప్రపంచంలో పాఠకులకు ఎలాంటి అవసరాలు ఉంటాయో, గ్రంథాలయాలను ఎలా ఆధునీకరించాలో, గ్రంథాలయాలకు అంతర్జాల సౌకర్యం ఎలా కల్పించాలో, చారిత్రక గ్రంథాలయాలు వాటి నిర్వహణ అనే అంశాలపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది.

అయితే ఈ విషయంలో తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు దాదాపు మూడు, నాలుగు దఫాలుగా ఇండియన్‌ పబ్లిక్‌ లైబ్రరీ మూమెంట్‌ మరియు రాష్ట్రంలో గ్రంథాలయ శాస్త్రం మేధావులతో సభలు. సమావేశాలు నిర్వహించారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలకు అను గుణంగా నూతన గ్రంథాలయ భవనాలు ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మించవలసిన అవసరం ఉన్నది. 

ప్రస్తుతం సికింద్రాబాద్‌ (మోండా మార్కెట్‌), సిద్దిపేట, సిరిసిల్ల, చెన్నూరు, కామారెడ్డి దాదాపు ఒక గ్రంథాల యానికి రెండు కోట్ల రూపాయలు కేటాయించి కార్పొరేట్‌ గ్రంథాలయాల దర్పం మనకు తెరముందు కనబడు తున్నది. వీటితో పాటు మహబూబాబాద్‌, నిర్మల్‌, నర్సాపూర్‌, మేడ్చల్‌, సంగారెడ్డి వికారాబాద్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నల్గొండ, ఖమ్మం,  కరీంనగర్‌ జిల్లాలలో కూడా నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. బడంగ్‌పేట, వనపర్తి, అసిఫాబాద్‌లలో నూతన గ్రంథాలయాల భవనాలను నిర్మిస్తున్నారు. 

నూతన గ్రంథాలయాల భవనాల కోసం స్థల సేకరణ జరిగిన ప్రాంతాలు:  గద్వాల్‌, కొత్తగూడెం, భూపాల్‌ పల్లి,  బోనగిరి, జగిత్యాల. 

స్థల సేకరణ చేయవలసినటువంటి జిల్లా గ్రంధాలయాలు: మెదక్‌, ములుగు,  నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌, జనగాం, వరంగల్‌ రూరల్‌. అదేవిధంగా పైన చెప్పబడిన గ్రంథాలయాలు అన్నీ కూడా ప్రస్తుత పాఠకుల అవసరాలకు అనుగుణంగా ఉచిత అంతర్జాల సౌకర్యం, ఉచిత కంప్యూటర్‌ సౌకర్యం, పోటీ పరీక్షల పుస్తకాలు, ఉన్నత చదువులకు సంబంధించిన పుస్తకాలు, అర్హత కలిగినటువంటి గ్రంథ పాలక నియామకం చేపట్టవలసిన అవసరం ఉన్నది. గ్రంథాలయాల పన్ను విధిగా గ్రంథాలయాల అభివృద్ధికి గ్రంథాలయ స్థాపనకు కృషి చేయవలసిన అవసరం ఉన్నది.

అదేవిధంగా రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయం మరియు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ లైబ్రరీ యొక్క  వెబ్సైట్లను ఆధునీకరించ వలసిన అవసరమున్నది. ప్రతి జిల్లా కేంద్ర గ్రంథాలయం కి వెబ్సైట్‌ లను ఏర్పాటు చేసి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉన్నది.

పైన పేర్కొనబడినటువంటి ప్రశస్తమైన గ్రంథాల యాలు హెరిటేజ్‌ సంపదగా గుర్తించి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని (రాజా రామ్మోహన్‌ రాయ్‌ లైబ్రరీ ఫౌండేషన్‌ ఆర్థిక, పుస్తక సహకారం) గ్రంథాల యాల ఉన్నతికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది.