|

ఇంటింటికి పాఠాలు అందిస్తున్న టి-సాట్‌

By: పీసరి లింగారెడ్డి

కరోనా కష్ట కాలంలో తెలంగాణ విద్యార్థులకు మరోమారు టి-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ఉత్తమ సేవలు అందించాయి. విజ్ఞానాన్ని విద్యార్థుల ఇళ్ల వద్దకే అందించి తమ విద్యా సంవత్సరానికి నష్టం లేదని భరోసా కల్పించాయి. మొదటి దశ కరోనా విపత్కర పరిస్థితిలో విద్యార్థులకు భరోసా అందించి, ఉపాధ్యాయులకు బాసటగా నిలిచి తెలంగాణ విద్యాశాఖకు ట్రబుల్‌ షూటర్‌ గా అవతరించిన టి-సాట్‌ రెండవ విడత కరోనా ప్రభావంలోనూ అదేప్రోత్సాహాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 28,600 ప్రభుత్వ పాఠశాలల్లో 27.23 లక్షలమంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నారు. అంగన్‌వాడీ, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, గురుకుల పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష పాఠశాలలు లేని లోటును తీరుస్తున్నాయి. తెలుగు, ఉర్డూతో పాటు ఇంగ్లీష్‌ భాషల్లో పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థుల ప్రాథమిక విద్యకు పునాదులు వేస్తోంది టి-సాట్‌. మూడు నుండి ఆరు సంవత్సరాల చిన్నారులకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న డిజిటల్‌ పాఠాలు విస్త్రత ఆదరణ పొందుతున్నాయి. ట్రాయ్‌ నిబంధనల మేరకు బదిరుల కోసం సైన్‌ లాంగ్వేజ్‌లో ప్రత్యేక కరెంట్‌ అఫైర్స్‌ కార్యక్రమాన్ని గత ఆరు నెలలుగా ప్రసారం చేస్తూ దేశ వ్యాప్త ఆదరణ పొందగలిగాము. అంగన్వాడీ, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, గురుకుల పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష పాఠశాలలు లేని లోటును తీరుస్తున్నాయి. తెలుగు, ఉర్డూ తో పాటు ఇంగ్లీష్‌ భాషల్లో పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థుల ప్రాథమిక విద్యకు పునాదులు వేస్తోంది టి-సాట్‌.

మొదటి రోజే 13.92 లక్షల మంది విద్యార్థులు హాజరు

ప్రభుత్వం ప్రకటించిన విధంగా జూలై ఒకటవ తేదీ నుండి టి-సాట్‌, దూరదర్శన్‌ ద్వారా ప్రారంభమైన అన్‌ లైన్‌ డిజిటల్‌ తరగతులకు రెండవ సంవత్సరమూ అనూహ్య స్పందన లభించింది. ప్రారంభించిన మొదటి రోజే రెసిడెన్షియల్‌ పాఠశాలలు మినహా 27,00,475 విద్యార్థుల్లో 75 శాతం మంది విద్యార్థులు 18,43,100 ఆన్‌ లైన్‌ పాఠా లను వీక్షించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు ముందు చూపుతో నాటిన టి-సాట్‌ మొక్క అనతి కాలంలోనే విస్తరించి తెలంగాణ విద్యార్థి లోకానికి గొడుగులా ఏర్పడింది. 2020-21 విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రణాళిక తయారు చేసి సరిగ్గా 25 రోజుల్లో ఇంగ్లీష్‌, తెలుగు మీడియం విద్యార్థులు మూడు నెలల పాఠ్యాంశాలను అన్‌ లైన్‌ ప్రసారాలకు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్టేట్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (సైట్‌) నిర్ణయాల మేరకు టి-సాట్‌లో పాఠ్యాంశాల రికార్డింగ్‌, ప్రసారాలు కొనసాగుతున్నాయి. టి-సాట్‌ విద్య ఛానల్‌లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మూడవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు డిజిటల్‌ పాఠ్యాంశాలు ప్రసారమౌతున్నాయి.

మూడు భాషల్లో బోధనలు

కరోనా మహమ్మారి వలన తెలంగాణలో చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్డూ మీడియం విద్యార్థుల్లో ఏ ఒక్కరూ నష్టపోకుండా మూడు భాషల్లో పాఠ్యాంశాలు రికార్డు చేసి ప్రసారాలు చేస్తోంది. ఈ యేడాది జూలై ఒకటవ తేదీ నుండి మూడు భాషల్లో ప్రారంభమైన  ప్రసారాలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. 2019-20 విద్యా సంవత్సరంలో ఎనిమిది నెలలు, 2020-21 విద్యా సంవత్సరం జూలైలో ప్రారంభమైన ప్రసారాలు సుమారు 2,180లకు చేరుకున్నాయి. వీటిల్లో తెలుగు మీడియం పాఠ్యాంశాలు-1058, ఉర్డూ మీడియం-626, ఇంగ్లీష్‌ మీడియం – 496 ఉన్నాయి. మూడు భాషల్లో ఐదు నుండి పదవ తరగతి విద్యార్థులకు తెలుగు, సంస్కృతం,  ఇంగ్లీష్‌, హిందీ, ఉర్ధూ, మాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల బోధనలు పి.పి.టి (పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌), గ్రాఫిక్స్‌ తోడ్పాటుతో ప్రసారమౌతున్నాయి. టి-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో ఒకటైన విద్య ఛానల్‌లో ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రెండు గంటల పాటు, సాయంత్రం ఐదు గంటల నుండి 8.30 గంటల వరకు మొత్తం ఐదున్నర గంటలు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఒకేషనల్‌ పాఠ్యాంశాలు ప్రసారమౌతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుండి ఐదు గంటల వరకు భోజన విరామ సమయం మినహా సుమారు ఆరున్నర గంటల ప్రసారాలు పాఠశాల విద్యకు సంబంధించిన ఉంటాయి.

ఆకట్టుకుంటున్న ఆంగన్‌వాడీ పాఠ్యాంశాలు

కరోనా రెండవ విడత ప్రభావానికి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడపబడే అంగన్‌వాడీలను సైతం మూసి వేశారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లల కోసం ఆ శాఖ ప్రత్యేకంగా ప్రసారం చేసిన డిజిటల్‌ బోధనలు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. అంగన్‌వాడీ టీచర్లు నృత్య రూపకంలో వీడియోలను చిత్రీకరించి ప్రసారం చేసిన వీడియో పాఠాలకు గ్రామీణ స్థాయి విద్యార్థులు పూర్తిగా ప్రభావితమయ్యాయి. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు సంబంధించిన పాఠ్యాంశాల ప్రసారాలకు ఏడాది పూర్తై 275వ ఎపిసోడ్‌ సందర్భంగా ఆ శాఖ కమిషనర్‌ దివ్య తమ ఉపాధ్యాయులను ఉద్దేశించి టి-సాట్‌ ద్వార ప్రత్యేకంగా అభినందించారు. వేసవి కాలంలో సైతం ఆన్‌ లైన్‌ పాఠ్యాంశాలను నిరంతరాయంగా బోధించిన మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటి వరకు 306 ఏపిసోడ్స్‌ పూర్తిచేసింది. అంగన్‌వాడీ బోధనల్లోని 187వ ఎపిసోడ్‌ ‘8’ అక్షరం ఆన్‌ లైన్‌ ద్వార నేర్పిన విధానం చిన్నారులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. 251వ ఏపిసోడ్‌లో ‘మా’ అనే అక్షరం నేర్పిన పద్ధతి మరింతగా అంగన్‌వాడీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించింది.

ఉర్డూ పాఠ్యాంశాలు ఈ యేడాది ప్రత్యేకం

తెలంగాణ ప్రభుత్వం ఉర్డూ విద్యార్థుల కోసం ఈ యేడాది ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 1,570 ఉర్దూ పాఠశాలలకు సంబం ధించి 1,07,535 మంది విద్యార్థులకు 5,173 ఉపాధ్యాయులు ఉన్నారు. ఆన్‌ లైన్‌ బోధనకు సంబంధించి గత ఏడాది రోజుకు ఒక పాఠ్యాంశం చొప్పున ప్రారంభించిన ఉర్డూ మీడియం విభాగం ప్రస్తుతం రోజూ నాలుగు పాఠ్యాంశాలను బోధిస్తోంది. కరోనా రెండవ వేవ్‌లోనూ ప్రసారం చేసిన అన్‌ లైన్‌ తరగతులను లెక్కిస్తే 624 పాఠ్యాంశాలు గంట నిడివి గలవి ఇప్పటి వరకు ప్రసారమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీఈఆర్టీ ఆధ్యర్యంలో సైట్‌ సహకారంతో టి-సాట్‌ ద్వారా చేస్తున్న ప్రసారాలు తెలుగు, ఇంగ్లీష్‌ విద్యార్థులతో పాటు ఉర్డూ మీడియం విద్యార్థులను విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆదుకుందని ఆ విభాగం ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.

బధిరులకు కరెంట్‌ అఫైర్స్‌:

ట్రాయ్‌ నిబంధనల మేరకు ప్రసారాల్లో 10 శాతం సమయాన్ని బధిరులకు కేటాయిస్తోంది టి-సాట్‌ నెట్వర్క్‌. గత సంవత్సరం జూన్‌ తొమ్మిదవ తేదీన ప్రారంభమైన ప్రసారాలు ప్రతి రోజు మధ్యాహ్నాం ఆరగంట పాటు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలను క్రోడీకరించి కరెంట్‌ అఫైర్స్‌ రూపేనా అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 5.50 లక్షల మందితో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 19లక్షల మంది బధిరులకు ఈ ప్రసారాలు చేరుతున్నాయి. ముఖ్య ఘటనలు, తేదీలు, ప్రముఖుల వివరాలు, ప్రాధాన్యత కలిగిన సుమారు 12 అంశాల ఆధారంగా సైన్‌ లాంగ్వేజ్‌లో ప్రసారమౌతున్న బధిరుల కరెంట్‌ అఫైర్స్‌ జూలై 18వ తేదీ నాటికి 100 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. ముఖ్య మైన సమాచారం దేశ వ్యాప్తంగా ఉన్న బధిరులకు తెలియడంతో పాటు వారిలోని నిరుద్యోగులకూ ఈ ప్రసారాలు ఉపయోగపడనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వ ఐటి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న టి-సాట్‌ నెట్వర్క్‌ (సాఫ్ట్‌ నెట్‌) సంస్థ సేవే పరమావధిగా పనిచేస్తోంది. మొదటి విడత కరోనా మాదిరిగానే  రెండవ విడత కరోనా ప్రభావం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కన్పించడంతో 2021 విద్యా సంవత్సరానికి అన్‌ లైన్‌ బోధనలకు సిద్ధమైంది. జూలై ఒకటి 2021 తేదీ నుండి ఆన్‌లైన్‌ ప్రసారాలను టి-సాట్‌ ద్వార ప్రారంభించారు. విద్యాశాఖ ప్రధాన కార్యదర్శ సందీప్‌ కుమార్‌ సుల్తానియా ప్రారంభానికి ముందే విద్యార్థులు వారి మొబైల్‌ లో టి-సాట్‌ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకునే విధంగా ఉపాధ్యా యులు ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంటే టి-సాట్‌ సేవలు ఏ విధంగా విద్యా శాఖతో పెనవేసుక పోయాయో చెప్పవచ్చు. ఎడ్యుకేషన్‌ ప్రసారాల్లో దేశంలోనే టి-సాట్‌ ప్రథమ స్థానంలో నిలిచి కరోనా రెండవ వేవ్‌ను ధైర్యంగా ఎదుర్కొంటామనే ధైర్యం, భరోసాను తెలంగాణ విద్యాశాఖతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కలిపించింది.