ఐ.టిలో నెంబర్ వన్ మన లక్ష్యం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే సమయంలో ఇతర రంగాలతోపాటు, ఐ.టి రంగంపై కూడా కొందరు పనిగట్టుకొని అనేక అపోహలు, అపనమ్మకాలు, అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో గత ఏడేళ్ళ పాలనలో ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పై కోవిడ్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినా, మన రాష్ట్రంలో ఐ.టి రంగం మాత్రం పురోగమిస్తూనే ఉంది.రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రపంచ ఐ.టి దిగ్గజాలుగా పేరుపొందిన 20కి పైగా ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్‌కు తరలి వచ్చాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం, మన ప్రభుత్వం రూపొందించి అమలుచేస్తున్న ఆకర్షణీయమైన, అద్భుతమైన ఐ.టి పాలసీ.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం ఆనాటి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా ఐ.టి, అనుబంధ రంగాల స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకొని మన రాష్ట్రప్రభుత్వం 2016లో రాష్ట్ర నూతన ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ టెక్నాలజీ (ఐసీటీి) విధానాన్ని రూపొందించింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలుచేయడంతో గత ఐదేళ్లలో ఐ.టి, ఐ.టి ఈ.ఎస్, ఎలక్ట్రానిక్స్ రంగాలలో తెలంగాణ ఒక ప్రబల శక్తిగా అవతరించింది.2013-14 లో 57,528 కోట్ల రూపాయలుగా ఉన్న తెలంగాణ ఐ.టి ఎగుమతుల విలువ 2020-21 నాటికి లక్షా 45 వేల కోట్ల రూపాయలకు పైగా చేరుకుంది. దేశంలో అత్యధిక ఐ.టి ఎగుమతుల వృద్ధి రేటును మన రాష్ట్రం నమోదు చేసింది. భారతదేశపు ఐ.టి రంగం స్థూల అభివృద్ధి రేటుకంటే తెలంగాణ వృద్ధిరేటు గత మూడేళ్ళుగా రెట్టింపుకంటే ఎక్కువగా ఉంది. అంకుర పరిశ్రమలకు, ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చే వ్యవస్థలను మొదటి ఐ.టి విధానం క్రింద నిర్మించడం జరిగింది.
సాంకేతికరంగం ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతూ ఉంటుంది. గత ఐదేళ్ళలో వచ్చిన కొత్త సాంకేతికతలు, ఇప్పటికే ఉన్న సాంకేతికతలలో వచ్చిన మార్పులు, పరిణామాలు, మానవాళి ఎదుర్కొంటున్న కోవిడ్-19 మహమ్మారి దరిమిలా వచ్చిన సాంకేతిక మార్పుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండవ ఐసీటి విధానాన్ని తీసుకువచ్చింది.రాష్ట్ర ఐ.టి శాఖామంత్రి కె.టి.రామారావు ఇటీవల దీనిని విడుదల చేశారు. మొదటి విధానం ప్రేరణగా, పునాదిగా, కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతిక, ఆవిష్కరణ రంగాలలో పేరెన్నికగన్న దేశాల సరసన నిలిపే లక్ష్యంతో పంచ సూత్రాలతో ఈ రెండవ విధానాన్ని రూపొందించింది.
నూతనంగా రూపొందించిన ఈ రెండవ విధానం 2021 నుంచి 2026 వరకూ అమలులో ఉంటుంది. వచ్చే ఐదేళ్ళలో ఐ.టి రంగంనుంచి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలని 10 లక్షలకు, ఐ.టి ఎగుమతుల విలువను 3 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను రాజధాని హైదరాబాద్ తరహాలో ఐ.టి పరిశ్రమల కేంద్రాలుగా మార్చేవిధంగా పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. మరోవంక పౌరుల అవసరాలకు అనుగుణంగా, డాటా ఆధారిత సేవలను రూపొందించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.
ఈ నూతన విధానంతో మన రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తరలి రావడంతోపాటు, ఐ.టి రంగంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలపాలన్న లక్ష్యం నెరవేరగలదని ఆశిద్దాం.