ఏక్‌ శామ్‌…చార్మినార్‌ కే నామ్‌

ఒక ఆలోచన…ఒక సూచన ఎందరికో ఆనందాన్ని పంచుతోంది. ఆహ్లాదాన్ని అందిస్తోంది.

హైదరాబాద్‌ మహానగరం విశ్వనగరంగా విస్తరించి, అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో నగర జనాభా కోటికి ఎగబాకింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగి, మత సామరస్యానికి, ప్రేమాభిమానాలకు మారుపేరైన సుందర నగరంలో చూడదగ్గ ప్రదేశాలకు, టూరిస్టు ప్రాంతాలకు కొదువ లేదు. నగరవాసులే గాక, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ చారిత్రిక నగరాన్ని వీక్షించడానికి పెద్దసంఖ్యలో యాత్రికులు రావడం ఆనవాయితీ.

ఇటీవల కాలంలో, ముఖ్యంగా కోవిడ్‌-19 ప్రభావంతో ఇళ్ళకే పరిమితమైన ప్రజానీకం, ఇప్పుడిప్పుడే గూళ్ళనుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా విహరించే  విహంగాల వలే ఇళ్ళ నుంచి బయటకు వచ్చి బాహ్య ప్రపంచాన్నిచూడగలుగు తున్నారు. నగరంలో ఎన్ని అందాలను చూసినా, ఇంకా తనివితీరని ప్రజానీకం ఇంకా ఏదో కావాలని, కొత్త దనాన్ని కోరుకుంటున్నారు.

ఈ తరుణంలో ఓ సామాన్యుడు రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐ.టి శాఖల మంత్రి కె. తారక రామారావుకు ఓ సందేశం పంపారు. చుట్టూ నక్లెస్‌ రోడ్డు, ఓ వైపు జలతరంగాల మీదుగా వయ్యారంగా చల్లని గాలులను వీస్తున్న హుస్సేన్‌ సాగరం, మరో వైపు అందచందాలతో తీర్చిదిద్దిన ట్యాంక్‌ బండ్‌ ప్రజలకు సాయంవేళలో ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోందని, ఆ సమయంలో ట్యాంక్‌ బండ్‌ పై వాహనాల రాకపోకలను నిలిపి వేస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని ఆయన ఆ సందేశంలో సూచించారు.

ఆ సూచన ఆచరణీయమని భావించిన మంత్రి కె.టి.ఆర్‌ వెనువెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా పోలీసు, తదితర అధికార వర్గాలను ఆదేశించారు. ఆనాటినుంచి ప్రతి ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్‌ బండ్‌పై వాహనాల రాకపోకలను నిలిపి వేయడంతోపాటు, లేజర్‌ షోలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు అవకాశం కల్పించారు. దాంతో ట్యాంక్‌ బండ్‌ కు వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరగటంతోపాటు, ప్రజల నుంచి మంచి స్పదన లభించింది. 

ఇదే స్ఫూర్తితో 430 సంవత్సరాల పుట్టిన రోజు పండుగను జరుపుకుంటున్న చరిత్రాత్మక  కట్టడం చార్మినార్‌ వద్ద కూడా ప్రతీ ఆదివారం వాహనాల రాకపోకలను క్రమబద్ధీక రించడంతో పాటు నగర వాసుల సందర్శనార్థం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు వివిధరకాల స్టాల్స్‌కు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇటు సాగర తీరంలో ‘సన్‌ డే ఫన్‌ డే’ పేరిట, అటు చార్మినార్‌ ప్రాంతంలో,  ‘ఏక్‌ శామ్‌ ..చార్మినార్‌ కే నామ్‌’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆదరణ పెరగడంతోపాటు, ఆదివారం సాయంత్రాలు సందర్శకుల తాకిడితో ఆయా ప్రాంతాలు కిటకిట లాడుతున్నాయి. పిల్లాపాపలతో నగరవాసులు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చక్కని ఆనందానుభూతులను ఆస్వాదిస్తున్నారు. ఓ చిన్న ఆలోచన ఇప్పుడు ఎందరికో ఆనందాన్ని పంచి ఇస్తోంది. ఇవి ముందుముందు అనేకరకాలుగా విస్తరించి యాత్రికులను మరింతగా ఆకర్షిస్తాయనడంలో సందేహం లేదు.