20 గుంటల భూమిలో లక్ష ఆదాయం

విజయగాధ

By: శ్రీ ఎం. అబ్దుల్‌ కలీం

వీణవంక మండలం, క్రిష్టం పేట గ్రామానికి చెందిన మామిడి రాజయ్య అనే రైతు ఏ పంటలు వేసినా దిగుబడి తక్కువగా వస్తుండేది. దాంతో అందరు వేసే పంటలు కాకుండా కొత్తగా అధిక దిగుబడినిచ్చే, మార్కెట్‌లో అధిక ధర పలికే తీగ జాతి కూరగాయలైన బోడ కాకర, బీరను ఎంచుకొని సాగు చేస్తున్నారు. రైతు తనకున్న 2.20 ఎకరాల భూమిలో 20 గుంటలలో బీరను, బోడ కాకరను గత రెండు సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు.

బోడ కాకరలో ఆడ, మగ రెండు రకాల చెట్లుంటాయి. దీనిలో మగ చెట్లను 10శాతం మాత్రమే ఉంచి మిగిలినవి తీసివేసి అధిక దిగుబడిని పొందుతున్నారు. బోడ కాకరలో దేశీ రకం విత్తనం వేశారు. మగ చెట్లు, ఆడ చెట్ల కంటే 15 రోజులు ముందుగా పూతకు వస్తాయి. ఆడ వాటి కంటే ఆకులు వెడల్పుగా ఉంటాయి. ఎకరానికి విత్తన మోతాదు 20 కిలోలు, బోడ కాకర విత్తనం నిద్రావస్థను (నవంబర్‌ నుంచి మే నెల) కలిగి ఉంటుంది. జూన్‌ నెలలో విత్తనాలను నాటారు. ఒక్కసారి నాటిన మొక్కలు 10 సంవత్సరాల వరకు దిగుబడినిస్తాయి.

మామిడి రాజయ్య పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. మొక్కల అడుగు భాగంలో దఫాలుగా ఒక టన్ను పశువుల ఎరువుని 20 గుంటలకు వేశారు. అదే విధంగా 40 కిలోల వర్మి కంపొస్ట్‌ను కూడా వేశారు. ఆడ, మగ మొక్కల మధ్య పరాగ సంపర్కం జరుగుటకు తేనేటీగలని ఆకర్షించటానికి బెల్లంని పిచికారి చేస్తున్నారు. సస్య రక్షణ కొరకు వేప నూనెను పిచికారి చేశారు.

బోడకాకరతో పాటుగా బీరని కూడా రాజయ్య సాగు చేస్తున్నారు. బీర 50 రోజులలో కాతకి వచ్చి, 100 రోజుల వరకు ఉంటుంది. బోడ కాకర మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలలో బీరని నాటారు. బీరలో తులసీ కంపెనీ విత్తనం ఎంచుకున్నారు. రైతు పండిరచిన కూరగాయలను వీణవంకలో విక్రయిస్తున్నారు. ఎక్కువ దిగుబడి వచ్చినపుడు జమ్మికుంట మార్కెట్‌కి తరలిస్తున్నారు.

రైతుకు దిగుబడిగా బీర ద్వారా 3 క్వింటాళ్లు రాగా వీటిని కిలోకి రూ.50 చొప్పున విక్రయించి రూ. 15,000 ఆదాయం ఆర్జించారు. బోడకాకర ద్వారా 8 క్వింటాళ్లు రాగా వీటిని కిలోకి రూ. 120 చొప్పున విక్రయించి రూ. 96,000 ఆదాయం పొందారు. బీర, బోడ కాకరలను కలిపి మొత్తం స్థూల ఆదాయం రూ. 1,11,000 రాగా దీనిలో పెట్టుబడి ఖర్చు రూ. 11,000 పోనూ రూ. 1,00,000 నికర ఆదాయం వచ్చినట్లు రాజయ్య తెలిపారు. సేంద్రీయ పద్ధతుల ద్వారా పందిరితో తీగ జాతీ కూరగాయలు సాగు చేస్తే అధికంగా లాభాలు వస్తాయని తన తోటి రైతులకు తెలియజేస్తూ మామిడి రాజయ్య, రైతులందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.