ప్రభుత్వ సాయంతో విదేశీ విద్య

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్స్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఈ పథకం అమలయ్యేది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీసీ, ఈబీసీ, మైనారిటీలకు కూడా అమలు చేస్తున్నారు. అలాగే, ప్రభుత్వం అగ్రవర్ణ కులాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేసింది. గతంలో కేవలం పది లక్షల రూపాయల గరిష్ట పరిమితి ఉండేది. ఇప్పుడు ఈ పథకం కింద రూ. 20 లక్షల వరకు అందిస్తున్నారు. ఆదాయ పరిమితిని కూడా రూ.4 లక్షల 50 వేలకు పెంచారు. పది శాతం ఓవర్సీస్‌ స్కాలర్షిప్‌లను హ్యుమనిటీస్‌, ఎకనామిక్స్‌, అకౌంట్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకు రిజర్వ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నాటి నుంచి 2022 వరకు నాటికి ఎనిమిదేండ్లలో మొత్తం 4,919 మంది విద్యార్థులు లబ్దిపొందగా.. వీరి కోసం ప్రభుత్వం రూ.885.99 కోట్లు ఖర్చు చేసింది. పొందిన విద్యార్థుల్లో ఎస్సీ క్యాటగిరిలో 935 మంది, ఎస్టీ 208 మంది, బీసీలు 1603 మంది, మైనార్టీ విద్యార్థులు 2173 మంది ఉన్నారు. ఈ ఉపకార వేతనంతో పేద విద్యార్థులు అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా తదితర దేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇలాంటి పథకమే ఉన్నా.. వంద మందిలోపే విద్యార్థులు ఎంపికయ్యారు. స్కాలర్షిప్‌ కూడా రూ.5 లక్షలుగా ఉండేది కాదు. ఇప్పుడు దానికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నారు.

మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌:

రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లతో ‘ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌’ పథకాన్ని 2015 మే 19న ప్రవేశపెట్టింది. ఎస్సీ విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమం అమలులో వుంది. అదే తరహాలో మైనారిటీలకు కూడా ఆర్థిక చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యావంతులైన మైనారిటీలు మరింత ఉన్నత చదువుకోసం విదేశాలకు వెళ్లాలంటే, చాలామందికి ఆర్థిక స్థోమత వుండదు. అలాంటి వారికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నది. తొలుత ఒక్కొక్కరికి పది లక్షల స్కాలర్‌ షిప్‌ తోపాటు విమానయాన ఖర్చులు కూడా ఇచ్చేవారు. కానీ, ఈ మొత్తాన్ని ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది. ఆదాయ పరిమితిని కూడా 4.5 లక్షల రూపాయలకు పెంచారు. మైనారిటీల కోసం ప్రవేశపెట్టిన ‘ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ స్కీమ్‌ ద్వారా 2022 నాటికి 2173 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. ప్రభుత్వం వీరికి రూ.395 కోట్లు అందజేసింది. ఈ పథకం ద్వారా విదేశీ వర్సిటీల్లో మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు.

మహాత్మా జ్యోతిబాపూలే బి.సి. విదేశీ విద్యానిధి:

బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పధకాన్ని ప్రవేశపెడుతూ 2016 అక్టోబర్‌ 10న జి.ఓ.నెం.23 జారీ చేసింది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. 2022 నాటికి 1603 మంది బీసీ విద్యార్థులు లబ్ధిపొందారు. వీరికోసం రూ.288.74 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కువమంది ఆస్ట్రేలియా, కెనడాల్లోని వర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు.