| |

పాఠ్యాంశా నవోదయం

patashala-bookభాషా సాహిత్యాలు ఏ జాతికైనా ఆయువుపట్టు. తన భాషా, తన సాహిత్యంపై పట్టును కోల్పోతే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. ఏ జాతికైనా భాష ప్రాణవా యువు. భాష అంటే మాట్లాడే పదాలు మాత్రమే కాదు. భాష ఒక జీవన విధానం. భాష ఒక సామాజిక పరిణామక్రమం. భాష ఒక జీవన గీతిక. సమాజం, జీవితం రెంటినీ కగలిపిన సమాజ విశ్వరూపం భాష. అందుకే భాష ఆలోచనకు సాధనమని ఛామ్‌స్కీ లాంటి భాషావేత్త చెప్పారు. మనిషిలో సృజనాత్మకతను రేకెత్తించి, వ్యక్తిలోని కళను, కల్పనాశక్తిని తట్టిలేపింది భాష. అందుకే ఈ విద్యార్థులకు డిగ్రీ స్థాయివరకు భాషా సాహిత్యాన్ని పాఠ్యాంశంగా పెట్టారు. తెలంగాణ రాష్ట్రం అవతరించే వరకు యిక్కడి భాషను, యిక్కడి సాహిత్యవేత్తలను పట్టించుకోలేదు. తెలంగాణ తన చరిత్రను తాను లిఖించుకుంటున్న సందర్భంలో తెలంగాణ భాషా సాహిత్య చరిత్ర గురించి ఈ తరానికి పాఠ్యాంశాలను అందించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యిందులో భాగంగా 1 నుంచి 10 తరగతుల  వరకు తెలుగు పాఠ్యపుస్తకాలు రూపురేఖలన్నీ మారాయి. యిప్పుడు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకం ‘నవోదయం’ పేరుతో వెలువడింది. గతంలో తెలుగు పాఠ్యపుస్తకంలో తెలంగాణకు చెందిన పాఠ్యాంశాలు 20 శాతంగా మాత్రమే ఉండేవి. యిప్పుడు 90 శాతం తెలంగాణ ఇతివృత్తంతో, తెలంగాణ రచయితలు కవుల  రచనలతో పాఠ్యపుస్తకం వెలువడింది.  ఇది తెలంగాణ రాష్ట్రం అవతరించటంవల్లనే సాధ్యమైంది.

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తెలుగు పుస్తకానికి దళితుడైన ఆచార్య బన్న అయిలయ్య ప్రధాన సంపాదకుడుగా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటి వరకు ఒక పాఠ్య పుస్తకానికి ఒక దళిత ప్రొఫెసర్‌ సంపాదకుడుగా ఉన్నాడో లేదో తెలియదు కానీ, తెలంగాణ అవతరించిన తర్వాత వచ్చిన ఇంటర్మీడియట్‌ తొలి పుస్తకానికి అయిలయ్య మాత్రం సంపాదకుడు కావటం జరిగింది. ఒక జాతికి జీవం పోయటానికి భాష ప్రధాన సాధనం. రాబోయే తరాలు తన నేల యొక్క విశిష్టతను తెలుసుకోవటం, ఈ నేలపై వెలిసిన గొప్ప సాహిత్యాన్ని అధ్యయనం చేయటం జరగాలి. అందులో భాగంగానే తొలి ప్రయత్నంగా ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తెలుగు పుస్తకం రూపొందింది. భాషతో పాటు విద్యార్థుల్లో విలువలు నాటడానికి, వ్యక్తిత్వ వికాసంతో పాటుగా సామాజిక వికాసాన్ని అందించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. ఒక జాతి జాజ్వలమానంగా వెలుగొందటానికి సాహిత్య సాంస్కృతిక రంగాలు కీలకపాత్ర పోషిస్తాయి.

ఇంటర్‌ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకంలో కవిత్వ విభాగంలో 6 పాఠ్యాంశాలు, గద్య విభాగంలో 6 పాఠ్యాంశాలు, వ్యాకరణాంశంలో 6 విభాగాలు వున్నాయి. తెలుగు ఉపవాచకం కింద కథాహరిలో ఆరుగురు ప్రముఖుల కథలున్నాయి. కవిత్వ విభాగంలో ప్రసన్న కథా కవితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిథి వంటి క్షణాలున్న శబ్దశాసనుడిగా ప్రసిద్ధికెక్కిన నన్నయ్య రాసిన ‘నారద ప్రభోదం’ పాఠ్యాంశం వుంది. రాజ్యపాలనకు సంబంధించి రాజు ఏ రకంగా వ్యవహరించాలో, పాలనకు సంబంధించిన పలు విషయాలను ధర్మరాజుకు నారదుడు చేసిన ధర్మ ప్రభోదమే ఈ పాఠ్యాంశం.

సహజకవి, రాజాస్థానాలను ధిక్కరించిన తెలంగాణకు చెందిన నిలువెత్తు ఆత్మగౌరవంగా చెప్పుకునే బమ్మెర పోతన రాసిన శ్రీమద్భాగవతంలోని దశమస్కంధం నుండి ‘విశ్వరూప సందర్శనం’ అన్న పద్యభాగాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. మన్ను తిన్న శ్రీకృష్ణుని నోరు తెరువమని యశోద అన్న సందర్భం, బాలకృష్ణుడు నోటి యందు విశ్వరూపాన్ని దర్శించి ఆశ్చర్యానికి లోనుకావటం, శ్రీ కృష్ణుడు మహావిష్ణువు అవతారమని తల్లి యశోద తన్మయత్వం చెందటం ఈ పాఠంలోని సారాంశం.

16వ శతాబ్దానికి పొన్నిగంటి తెలగన రాసిన యయాతి చరిత్రలోని చతుర్థాశ్వాశం నుంచి తీసుకున్న ‘దేవయాని వివాహం’ ను పాఠ్యాంశంలో చేర్చారు. యయాతి, దేవయాని వివాహ ఘట్టాన్ని, పెండ్లికూతురుగా దేవయానిని తీసుకురావటం, వివాహ ప్రక్రియ, ఈ తంతు తర్వాత అత్తవారింటికెళ్లే బిడ్డకు తల్లి జాగ్రత్తలు చెప్పటం, అత్తవారింటికి సాగనంపే అప్పగింత కార్యక్రమం అంతా ఈ పద్య, గద్యాలో అత్యంత రమణీయంగా వర్ణించబడ్డాయి. పొన్నిగంటి తెలగన అచ్చ తెనుగు పదాలతో ఒక కావ్యాన్నే రాశారు. ఆయనను ఇంతవరకు పట్టించుకోలేదు. ‘దేవయాని వివాహం’ పాఠాన్ని పాఠ్యాంశంగా చేర్చటం ఆహ్వానించతగింది.

భద్రాచ రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న రాసిన ‘దాశరథీ కరుణాపయోనిధీ’ అన్న పాఠ్యాంశాన్ని పెట్టారు. భక్తిని కవితాశక్తిగా మార్చి తెలుగులో గొప్ప కీర్తనాకారుడుగా పేరుపడ్డ రామదాసు రాసిన ఈ పాఠం ద్వారా రామభక్తి, తాత్విక చింతన, నైతిక ప్రవర్తన చెప్పటం జరిగింది. భక్తి ద్వారా పొందే ముక్తిని ఈ పాఠంలో చెప్పడం జరిగింది.

మన శిల్పకళా సంపదకు రామప్ప నిలువుటద్దం. మన సంస్కృతికి, మన కళకు, ప్రాచ్య వైభవానికి గుర్తుగా రామప్ప దేవాలయాన్ని చూడవచ్చు. యిటీవల దేవాదుల కాల్వ తవ్వకాల వల్ల ఆ రామప్ప దేవాయానికి ప్రమాదం జరుగుతుందని, దాన్ని వెంటనే నివారించాని వరంగల్‌ జిల్లాకు చెందిన వెపాటి రామరెడ్డి రాసిన పద్యాలను పాఠ్యభాగంలో చేర్చారు. ఈ పాఠం ద్వారా శిలలపై శిల్పాలను శిల్పులు తమ ఉలి ద్వారా ఎలా చెక్కుతారో వారి శిల్పకళా నైపుణ్యాన్ని ఈ పద్యాలలో వర్ణించటం జరిగింది.

తెలుగు వచన కవిత్వానికి చిరునామాగా మారిన డా॥ ఎన్‌. గోపి రచించిన ‘‘జలగీతం’’ నుంచి చెరువుకు సంబంధించిన 25 వ అధ్యాయాన్ని పాఠ్యాంశంగా పెట్టారు. చెరువు వైభవం, అవి అంతర్థానమై పోతున్న తీరు, చెరువు వల్ల ఉపయోగాలు, ప్రజలకు ప్రాణాధారమైన చెరువును ఎలా కాపాడుకోవాలి అని కవిత్వీకరించిన దీర్ఘ కవితా ఖండికను ఈ పాఠంలో చేర్చారు. స్థానిక జల వ్యవస్థను కాపాడుకుంటే సాగు, తాగు నీరు లభ్యమవుతుంది. ఊరు ప్రాణం చెరువు. స్థానిక జల వ్యవస్థ ధ్వంసమైతే ఎలాంటి విషపరిణామాలు వుంటాయో ఈ జలగీతంలో చెప్పడం జరిగింది. మానవాళి నిర్లక్ష్యం పట్ల కవి ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కళేబరాలై పడి ఉండటాన్ని చూసి కవి ఆవేదన చెందిన తీరు ఈ గీతంలో వర్ణించబడింది.

గద్య విభాగంలో ప్రముఖుల జీవిత చరిత్రను వివరిస్తూ సురవరం ప్రతాపరెడ్డి రాసిన వ్యాసాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. విద్యార్థులో చైతన్యాన్ని కలిగించటానికి సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఈ వ్యాసం ఎంతో ఉప యుక్తంగా వుంటుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించటం వల్ల ఇప్పటి వరకు చరిత్రలో కనిపించని అనేక విషయాలను వెలుగులోకి తేవటం జరుగుతుంది. మొత్తం చరిత్రను తనను తాను లిఖించుకుంటున్న సందర్భంలో ఈ నేల మీద ఎందరెందరో త్యాగధనులను ఈ తరానికి పరిచయం చేయాల్సిన అవసరం వుంది. ఒక దళిత మహిళ చైతన్యంతో సమాజ మార్పులో ఏ రకమైన కీలక పాత్ర పోషించిందో తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా తెంగాణలో దళిత నాయకురాలు సుమిత్రాదేవి గురించి ఇల్లింద సరస్వతీ దేవి రాసిన వ్యాసం పాఠ్యాంశంలో చేర్చారు. సుమిత్రాదేవి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించారు. హైదరాబాదు నగరంలో అనేక అభ్యుదయ కార్యక్రమాలో ఆమె కీక పాత్ర పోషించారు. ఆమె స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. యిప్పటి దాకా ఆమె చరిత్ర ఈ తరానికి తెలియదు. 1951లో ఆమె హైదరాబాద్‌ నగర పురపాక సంఘానికి కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఎన్నికై 1954లో ఉపాధ్యక్షురాలు అయ్యింది. ఆమె పలు హోదాలలో అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు. ఆ రోజుల్లో రాజేంద్రనగర్‌లో 500 మంది దళితులకు ఇళ్లు కట్టించటంలో ఆమె ఎంతో కృషి చేశారు. దళితుకు మంచి నీరు నందించేందుకు ఆమె ఎంతో శ్రమించారు. ఆమె 60 మంచినీటి బావులు, చెరువు త్రవ్వించి దళితులను మంచినీటి కరువు నుంచి బయట పడేశారు. ఉప్పల గ్రామంలో ఆమె చర్మ శిక్షణా కేంద్రాన్ని నెకొల్పారు. ఉపన్యాసాలు చెప్పటం కాకుండా జీవితంలో ఆచరించి నిలిచిన నాయకురాలుగా సుమిత్రాదేవి నిలిచిపోతారు. దళితజాతుల పిల్లలందరికీ విద్య రావాలని ఆమె తపించారు. ఆమె చరిత్రను పాఠ్యాంశంలో చేర్చటం వల్ల మనకు తెలియని మన చరిత్రను చెప్పటమే గాకుండా దళిత మహిళ చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

భారత రాజకీయ రంగంలో అపర చాణుక్యుడుగా వెలుగొందిన పి.వి. నర్సింహారావు తెలంగాణ బిడ్డడు కావటం ఈ జాతి గర్వకారణంగా చెప్పు కుంటుంది. పి.వి. పరిణతి చెందిన రాజకీయ నాయకుడే కాకుండా చేయి తిరిగిన సాహితీవేత్త. పాములపర్తి వెంకట నర్సింహారావు రచించిన ‘అంతరంగం’ (ఇన్‌సైడర్‌) ఆత్మకథాత్మక నవల నుంచి తీసుకున్న 8వ భాగాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. ఈ పాఠ్యాంశం ద్వారా యువ తలో దేశభక్తిని రగిలించవచ్చును. స్వాతంత్య్రోద్యమంలో జరిగిన ఉజ్వల ఘట్టాలు యిందులో ఉంటాయి. భగత్‌సింగ్‌, రాజ గురు, సుఖ్‌దేవ్‌ వంటి త్యాగధనుల త్యాగాలు, భగత్‌సింగ్‌ వ్యక్తిత్వం యువతకు స్ఫూర్తిదాయకంగా వర్ణించారు. దేశం కోసం త్యాగం చేయాలన్న స్ఫూర్తిని ఈ పాఠ్యాంశంలో చెప్పటం జరిగింది.

ఒద్దిరాజు సోదరులపై ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన ‘తెలుగు వైతాళికులు’ గ్రంథం నుంచి ఈ పాఠ్యాంశంగా తీసుకోవటం జరిగింది. పిల్లలకు చదువుతో పాటు అన్ని రకాల నైపుణ్యాలను సంపాదించుకోవాలన్నది ఈ పాఠ్యాంశంలో సారాంశం. ఒద్దిరాజు సోదరులు తెలంగాణలో సాహిత్య పరంగా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగిన వారు. వ్యక్తిగత నైపుణ్యాల పరంగా విభిన్న రంగాలలో వారికి ప్రవేశముంది. వారు తెలంగాణ సమాజానికే కాదు మానవ సమాజానికే స్ఫూర్తివంతమైనవారు. వీరిపై బిరుదురాజు రాసిన వ్యాసం పాఠ్యాంశంగా పెట్టారు. ఈ పాఠం చదివితే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎంత ప్రతిభావంతులో తెలుస్తుంది.

తెలంగాణ వైభవాన్ని చాటుతూ డి. రామలింగం రాసిన ‘‘తెలంగాణ కవుల దర్శనం’’ అన్న పాఠ్యాంశం వుంది. ఈ పాఠం ద్వారా తెలంగాణ ఎలా కోటిరతనాల వీణగా విలసిల్లిందో చెప్పే ప్రయత్నం జరిగింది.
విద్యార్థుకు హాస్యం, వ్యగ్యం కూడా ప్రధానం. ఇందులో భాగంగా డా॥ రుక్నుద్దీన్‌ రాసిన జానపద సాహిత్యంలో హాస్యం అన్న పాఠాన్ని పెట్టారు. మన తరతరాల సంస్కృతి, సాంప్రదాయాలలో, జనజీవితాలలో భాషా, యాసా, విజ్ఞానం అంతా గర్భితమై వుంటుంది. జానపద సాహిత్యంలో వుండే హాస్యం ఈ పాఠ్యాంశంలో చెప్పటం జరిగింది.

మూడవ విభాగంలో సంధులు, సమాసాలు, లేఖారచన, సాధారణ వ్యాసాలు, స్థూలఅవగాహన, అనువాదం శీర్షికల కింద వ్యాకరణాంశాలను చెప్పటం జరిగింది. నాలుగో విభాగంలో తెలుగు ఉప వాచకం కింద తెలంగాణ అస్థిత్వాన్ని తెలియజేస్తూ వచ్చిన కథను యిందులో చేర్చారు. తెలంగాణ కథకు రూపమైన వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ‘‘పరిగె కథ’’ పొట్లపల్లి రామారావు రాసిన ‘‘సమాధి స్థలం’’, దాశరథి రంగాచార్య రాసిన ‘‘జై జవాన్‌’’, మాదిరెడ్డి సులోచన రాసిన ‘‘బడి’’ కథ, ప్రఖ్యాత రచయితగా బడుగు జీవితాలను మలచిన బోయ జంగయ్య రాసిన ‘‘పండుగ బట్టు’’, కె.ఎన్‌.వై. పతంజలి రాసిన ‘‘మోటుమనిషి’’ కథను పెట్టారు. సామాజిక ప్రయోజనం కోసం మాదిరెడ్డి సులోచన ‘‘బడి’’ కథను రాశారు. కాని ఆ కథ యిప్పటిదాకా వెలుగులోకి రాలేదు. మన పేరుపొందిన లబ్ధప్రతిష్టులైన సాహిత్య విమర్శకులు కూడా ఆ కథను పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రకు చెందిన కె.ఎన్‌.వై. పతంజలి రాసిన ‘‘మోటుమనిషి’’ కథ ద్వారా వ్యంగ్యమే కాకుండా జీవన విలువలు తెలుతొస్తాయి. ఆయన తెలంగాణ మట్టికి సంబంధించిన ఔన్నత్యాన్ని కీర్తించిన వాడు. ఆయన రచనలు ఈ తరం చదువుకోవాలి.

వట్టికోట ఆళ్వారుస్వామి తోటి ఖైదీల జీవిత అనుభవాలను యదార్థగాథను ‘పరిగె’ కథలో రాశారు. బోయ జంగయ్య రాసిన ‘‘పండుగ బట్టు’’ కథలో తెలంగాణ బతుకు చిత్రం, జీవన వైవిధ్యం కనిపిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువనవున్న బహీన వర్గాల వారి బతుకు చిత్రంగా జంగయ్య కథగా రాశారు.

కొత్త పాఠ్యపుస్తకాలు రావటమంటే రచయితలు మారటం, పాఠ్యాంశాలు మారటం కాదు, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పుస్తకంలో మనదైన తెలంగాణ ప్రాంతం ప్రాముఖ్యం ఉంది. స్థానికత ముద్ర ఉంది. తెలంగాణ స్థానికతకు, సంస్కృతికి ఈ పుస్తకం అద్దం పడుతుంది. తెలంగాణ భాషను, సాహిత్యాన్ని, ఇక్కడి స్థానికతను, మన సంస్కృతిని, చరిత్రను చెప్పటానికి మాధ్యమిక విద్యలో ఇది తొలి ప్రయత్నంగా చూడాలి. ఇంకా ఇందులో చేరవలసినవి, చేర్చవలసినవి ఎన్నో ఉండవచ్చును. ఇప్పుడు ఇంటర్‌ పిల్లల చేతుల్లోకి మాత్రం మన చరిత్రను, మన సంస్కృతిని చదువుకునేందుకు సిలబస్‌లో తలుపులు తెరిచారు. తెలంగాణ విస్తృత సాహిత్యం అధ్యయనం చేసేందుకు, పరిశోధించేందుకు ఈ పాఠ్యపుస్తకం విద్యార్థులకు ఒక దరిదాపుగా తోడ్పడుతుంది.

శ్రీ జూలూరు గౌరీశంకర్‌