విరిసిన పద్మాలు

73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం నాలుగు పద్మభూషణ్‌, 17 పద్మ విభూషణ్‌, 107 పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా వాటిలో తెలంగాణ రాష్ట్రానికి మూడు పద్మశ్రీలు, ఒక పద్మ భూషణ్‌ అవార్డు లభించగా, ఆంధ్రప్రదేశ్‌కి మూడు పద్మశ్రీ అవార్డులు లభించాయి.

తెలంగాణ రాష్ట్రం నుండి కోవిడ్‌ టీకాగా, కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా ఆవిష్కరించిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ అధినేతలు కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులు (ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ) పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. డాక్టర్‌ ఎం. కృష్ణ ఎల్లా భారతీయ బయోటెక్‌ శాస్త్రవేత్త, భారతీయ బయోటెక్‌ అంతర్జాతీయ లిమిటెడ్‌ కో చైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌. భారతదేశంలో మొట్టమొదటి కరోనా టీకామందును కనుగొన్నారు. ఇతను వైద్య విశ్వవిద్యాలయం కరోలినాలో పరిశోధనా అధ్యాపకుడు. కొవిడ్‌ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది

అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారునిగా గుర్తింపు పొందిన మొగిలయ్యను పద్మశ్రీ అవార్డు వరించింది. ఈయన అసలు పేరు దర్శనం మొగిలయ్య కానీ కిన్నెర మొగిలయ్యగా ప్రసిద్ధి చెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అవుసలిపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఎంతోమందిని తన కిన్నెర వాద్య పాటలతో ఆకట్టుకున్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తన నైపుణ్యంతో మెప్పించారు. ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న మొగిలయ్య, రాష్ట్ర ప్రభుత్వ మెచ్చుకోలును సహితం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని యిచ్చి మొగిలయ్యను ఘనంగా సత్కరించింది. పన్నెండు మెట్ల కిన్నెర ప్రాముఖ్యం నేటి తరానికి తెలిసి రావాలని ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంలో చేర్చింది ప్రభుత్వం.

కోయదొరల ఇలవేల్పు కథకుడు సకిని రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. రామచంద్రయ్యది భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామం. కోయ తెగకు సంబంధించిన మౌఖిక చరిత్ర లెన్నింటినో అలవోకగా చెప్తుంటాడు. వీనులకు విందుగా కథాగానం చేసే రామచంద్రయ్య నిరక్షరాస్యుడు. కోయ తెగకు (డోలి) ఉపకులానికి చెందిన తెగల వంశ చరిత్రలను పారాయణం చేసే రామచంద్రయ్య బహుశా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో మిగిలిపోయిన చివరి గాయకుడు. ఇతను వివాహాలలో, అంత్యక్రియల వద్ద పాటలు పాడతాడు. ఇతను ‘సమ్మక్క సారలమ్మ’ మేడారం జాతరలో పాటలు పాడతాడు. ప్రస్తుతం ఈయన కోయ భాషకు అక్షర రూపాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.

కూచిపూడి నృత్యకళాకారిణి డాక్టర్‌ పద్మజారెడ్డి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. పద్మజారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు. పామర్రు గ్రామం కూచిపూడి కళకు పుట్టినిల్లయిన కూచిపూడి సమీపంలో ఉంటుంది. కూచిపూడి సిద్ధేంద్రయోగి స్ఫూర్తితో డాక్టర్‌ శోభానాయుడు శిష్యరికంలో పద్మజారెడ్డి నృత్య రీతులు నేర్చుకున్నారు. ఇందూరు కోడలిగా జిల్లాకు వచ్చిన పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిపై మక్కువ పెంచు కున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన రుద్రమదేవిని ఎక్కువగా ఇష్టపడే పద్మజారెడ్డి సత్యభామ, రుద్రమదేవి పాత్రల ద్వారా కూచిపూడిలో గుర్తింపు పొందారు. ఇందులో భాగంగా డాక్టర్‌ పద్మజారెడ్డి కూచిపూడిలో ‘కాకతీయం’ అనే తెలంగాణ క్లాసికల్‌ కళారీతిని రూపొందించి ప్రపంచానికి పరిచయం చేశారు. నృత్త రత్నావళిలోని భ్రమరి, పేరిణి, కందుక నృత్యం, లాస్యంగం వంటి ప్రధాన అంశాలతో నృత్య బ్యాలెట్‌ను రూపొందించారు. సామాజిక అంశాలపైనా ఎన్నో నృత్యరూపకాలు రూపొందించి సమాజంలో అవగాహన కల్పించే విషయంలో తనవంతు కీలక పాత్ర పోషించారు. భ్రూణహత్యలు, జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించే నృత్య ప్రదర్శనలు ఎన్నో చేశారు. పలు అవార్డులు పురస్కరాలు అందుకున్న పద్మజా రెడ్డిని ఇప్పుడు పద్మశ్రీ వరించింది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ తెలుగు, సంస్కృత పండితుడు, అవధాని గరికిపాటి నరసింహారావు. గరికిపాటి 30 ఏళ్ళపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇతను దేశ విదేశాల్లో ఎన్నో అవధానాలు చేశారు. ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పద్యకావ్యాలు, పరి శోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికిపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచు రితమయ్యాయి. ధారణా బ్రహ్మ రాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవుల పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందు కున్నారు. ఇప్పుడు సాహిత్యం, విద్య విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో నాదస్వర సుప్రభాత సేవకునిగా పనిచేసిన షేక్‌ హాసన్‌ సాహెబ్‌కు మరణానంతరం పద్మశ్రీ (కళలు) అవార్డు లభించింది. ఈయన కృష్ణా జిల్లా గంపల గూడెం మండలం గొసవీడు గ్రామానికి చెందిన నాదస్వర విద్వాంసుడు. భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయంలో ఆయన నాదస్వర సుప్రభాత సేవలో పాల్గొనే వారు. ఆలిండియా రేడియోలో నాదస్వర విద్వాంసుడిగా పని చేశారు. గత ఏడాది జూన్‌లో ఆయన స్వర్గస్తులయ్యారు.

డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు గత నలభై ఏళ్ళుగా విశాఖపట్నంలో పోలియో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఆయన తల్లితండ్రులు సుంకర శేషయ్య, కనకం దంపతులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. డాక్టర్‌ ఆది నారాయణరావు విశాఖలోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌గా, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా, వైద్య విద్యా సంచాలకుడిగా సేవలందించారు. పోలియోపై అనేక పరిశోధనలు చేసారు. సర్జరీ ఆన్‌ పోలియో డిజెబిలిటీ అనే ఓ పుస్తకం వ్రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం) పద్మశ్రీకి ఎంపికయ్యారు.

జీవిత కాల విశిష్ట సేవలను గుర్తించి ఏటా భారత ప్రభుత్వం అందించే ‘పద్మ’ అవార్డులు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులకు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్‌ అవార్డ్‌ను సంయుక్తంగా దక్కించుకున్న భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా ఆర్ట్‌ విభాగంలో పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్న దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజ రెడ్డిలను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా వారికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.