పద్యాల స్ఫటిక

ప్రముఖ కవి,రచయిత  కపిలవాయి లింగమూర్తి, పలు సందర్భాలలో అలవోకగా అప్పటికప్పుడు వ్రాసుకున్న కవితల పుష్పగుచ్ఛమే ఈ పుస్తకం. వివిధ రూపాలలో వున్న దేవతలు, కొందరు పీఠాధిపతులు, పలువురు ప్రముఖులు, ప్రముఖంగా పేరొందిన నాయకులు, సన్నిహిత మిత్రులు, తన శిష్య పరివారంలో విశిష్టులైన కొందరు శిష్యుల గురించి వ్రాసిన పద్యాలు, వేరు వేరు సభలు, సమావేశాల్లోనూ, అభినందనల కోసం పుస్తకాలు పంపినపుడు, అలాగే కొన్ని ఉత్తరాల రూపంలో వ్రాసిన పద్యాల పందేరమే ఈ పుస్తకమని చెప్పవచ్చు.

వివిధ శీర్షికలతో రెండువందల పై చిలుకు పద్యాలు, ఉత్పలమాల, చంపకమాలాది వృత్తాల న్నింటిలోనూ ఎంతో చక్కగా, సమకాలీన అంశాలతో, అవసరమైన చోట వ్యవహారిక ఆంగ్ల పదాలను కూడా భావవ్యక్తీకరణ కోసం ప్రయోగించడం ముదావాహం. పలు సందర్భాలను పురస్కరించుకుని ఎన్ని పద్యాలను వ్రాసుకున్నారో వారికే తెలియదనే విషయం కూడా ముందు మాటలతో ద్యోతకమౌతున్నది.

ఇపుడు వున్న ఈ పుస్తకం ఇంతకు ముందు ఇంతదిగా లేదు. లింగమూర్తి స్వర్గస్తులు కాకముందే పుస్తకం ముద్రించబడింది.  ఆ తరువాత లభించిన మరికొన్ని పద్యాలను, ఇంకా కొన్ని శీర్షికలలో చేర్చి ఈ పుస్తకానికి ప్రస్తుత విస్తృత రూపంలో తీర్చిదిద్దడం జరిగిందని  వారి కుమారుడు ముందుమాటలో  తెలిపిన విషయాన్ని బట్టి అర్థమవుతున్నది. ఇక ఈ పుస్తకం లోని వివిధ శీర్షికలను విశ్లేషిస్తే అది మరో పెద్ద వ్యాసమే అవుతుంది. మొత్తంగా అన్ని పద్యాలనూ అందరూ చదివితీరవలసిందే. లింగమూర్తి రచనా శైలిని విశ్లేషించే సాహసం దాదాపుగా ఎవ్వరూ చేయరు. పుస్తకంలోని అక్షరాక్షరాల అర్థాలను అందరూ ఆస్వాదిస్తారు.

పుస్తకం పేరు: పద్యపేటిక
వెల: రూ.200/- పేజీలు: 300,
ప్రతులకు: కపిలవాయి సాయి శరణ్య,
ఇం.నం .1-9-312/2/ఎ ,
ఫ్లాట్‌,నం 404, సి బ్లాక్‌,
వైదేహి నివాస్‌ గోల్డెన్‌ ఫార్మ్స్‌,
అచ్యుతరెడ్డి మార్గ్‌,
విద్యానగర్‌, హైదరాబాద్‌ -044.