పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

tsmagazine

పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక విషాద గాథ. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. 1956 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడడం వలన అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. హైదరాబాద్‌ రాష్ట్రంగా కొనసాగి ఉంటేె అప్పర్‌ కృష్ణా, భీమా, తుంగభద్రా ఎడమ కాలువ ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు వలన ఈ అవకాశం పూర్తిగా పోగొట్టుకున్న జిల్లా. పాలమూరు జిల్లా. మొత్తం విస్తీర్ణం 43.73 లక్షల ఎకరాలు ఉంటె అందులో వ్యవసాయ యోగ్యమైన భూమి దాదాపు 35 లక్షల ఎకరాలు. సాగునీటి సౌకర్యం ఉన్న భూమి 4.5 లక్షల ఎకరాలు మాత్రమే. ఇందులో జూరాల కింద ఒక లక్ష ఎకరాలు , 87 వేల ఎకరాలకు బదులు 30 వేల ఎకరాలే RDS, 2.5 లక్షల ఎకరాలకు బదులు 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే చెరువులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం మీద నికరంగా దాదాపు 2 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతున్నది. సీమాంధ్ర పాలనలో సాగునీరు అందించే ఆలోచనే లేని కారణంగా పాలమూరు ప్రజలకు బతుకుదెరువు కోసం వలసలే గతి అయినాయి. ప్రతిపాదిత భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు పథకాలు నిరంతరం ఫైళ్ళల్లో మగ్గుతూ వచ్చాయి.

ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల (AMRP) లిఫ్ట్‌ స్కీమ్‌ విజయవంతం అయిన తరువాత పాలమూరు ప్రజలలో చైతన్యం వచ్చిన కారణంగా అప్పటికే ప్రత్యేక రాష్ట్ర సాధనకై టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ రాజకీయ రంగంపైకి వచ్చిన కారణంగా2003 లో కల్వకుర్తి, 2004 లో బీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌ ఎత్తిపోతల పథకాలకు మోక్షం వచ్చింది. కానీ పది సంవత్సరాలు గడచినా కూడా ప్రాజెక్టులు పూర్తి కాని స్థితి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే 8 లక్షల ఎకరాలు సాగులోనికి వచ్చేవి. జిల్లాలో ఇంకా చాలా ప్రాంతాలు సాగుకు నోచుకోని పరిస్థితి ఉన్నది. జిల్లా గుండా కృష్ణా నది 300 కిలోమీటర్లు పారుతుంది. తుంగభద్రా నది కూడా ఈ జిల్లా సరిహద్దుగా పారుతుంది. అయినా జిల్లాలో తెలంగాణ ఏర్పడే దాకా ఈ దీన పరిస్థితి ఉన్నది.

ఇంకా కొత్త ప్రాంతాలకు సాగునీటి కోసం ప్రజలు ఉద్యమాలు చేశారు. చాలా ప్రజా సంఘాలు ప్రజలను చైతన్య పరిచి సాగు నీరు కోసం ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సందర్భంలో తెలంగాణా రిటైర్డ్‌ ఇంజనీర్లు 2005 లో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి అప్పటి సీమాంధ్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది. జిల్లా నాయకుల్లో దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. 2009 ఎన్నికల ముందు సర్వేల గురించి జి.ఓ. ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ముఖం చాటేసి అనేక సాకులు చెప్పింది. ఇప్పటికే చాలా ఎత్తిపోతల పథకాలు వచ్చాయి కనుక వాటి పనితీరు చూసిన తరువాతనే ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టటం జరుగుతుందని ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా మొత్తం పాలమూరు-రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులను అవమానపరచడం జరిగింది.

దీని తర్వాత, తెలంగాణ సమాజంలో చాలా ప్రజా సంఘాలు ధర్నాలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, అవగాహన సదస్సులు, కళారూపాల ద్వారా గ్రామ గ్రామానికి భావ వ్యాప్తి జేశారు. ఈ ప్రజా సంఘాలతో మమేకమై తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్లు పనిచేశారు. అంతిమంగా ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు ముక్తి లేదని ప్రజలందరికి అర్థమైంది.

పోతూ పోతూ కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం తుంగభద్రపై గండ్రేవుల జలాశయంతో పాటు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే నిమిత్తమై 2013 ఆగస్టు లో జి.ఓ. ఇచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకుండా అడ్డుకున్నారు. అయితే సర్వే పూర్తి అయి ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారు చేసి పరిపాలనా అనుమతి ఇచ్చి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉండే. ప్రజల ఓట్ల కోసం, ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ఉద్దేశ్యంతో ఆ జి. ఒ. జారీ అయ్యిందే తప్ప అమలు చేద్దామన్న చిత్తశుద్ధ్ది ప్రభుత్వానికి లేకుండింది. తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి కొత్త ప్రాజెక్టులకు తప్పనిసరి అయినందువల్ల ముందు చూపుతో అపెక్స్‌ కౌన్సిల్‌ లో అడ్డుకోవచ్చని ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకుండా అడ్డుకున్నారు సీమాంధ్ర పాలకులు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఈ ప్రాజెక్టు సర్వే మరియు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) మూడు నెలలలోనే సమర్పించే విధంగా Engineering Staff College, office Rt No. 69, Dt. 1-8-2014 ద్వారా ఇవ్వడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు భరోసా కలిగింది.

ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం క్రిష్ణా జలాలను జూరాల నుండి ఒక లక్ష క్యూసెక్కుల నీరు క్రిందికి ప్రవహిస్తున్న దశలో 25 రోజులలో 70టి.ఎం.సిల నీటిని ఎత్తిపోసి 3 జలాశయాల్లో నింపి వాటి ద్వారా దాదాపు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 7 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30,000 ఎకరాలు మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగు నీరు, పరిశ్రమల అవసరాలకు నీరు, జంటనగరాలకు మరియు దారి పొడవునా గ్రామాలకు మంచి నీరు అందించడం.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమయ్యే నీరు 23,150 క్యూసెక్కులు. ఈ రకంగా జూరాల నుంచి మొత్తం 28,691 క్యూసెక్కుల నీటిని ఎత్తి పొయ్యవలసి ఉంటుంది. 9 టిఎంసి ల సామర్థ్యం కలిగిన జలాశయం నుండి 28,691 క్యూసెక్కులు ఎత్తి పోస్తే జూరాల జలాశయం రెండున్నర రోజుల్లో ఖాళీ అవుతుంది. ఈ పరిస్థితిలో వరుసగా 60 రోజుల్లో 90 టిఎంసి ల నీటిని పాలమూరు రంగారెడ్డి పథకానికి వాడుకోవడం వీలు పడదు. జూరాల జలాశయం మీద ఆధారపడిన ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేని స్థితి నెలకొంటుంది. శ్రీశైలం జలాశయం నికర నిలవ సామర్థ్యం 215 టిఎంసి లు.శ్రీశైలం జలాశయానికి తుంగభద్రా జలాలు కూడా వచ్చి చేరతాయి. కాని పాలమూరు రంగారెడ్డి పథకం ఫలప్రదం కావాలంటే ఎక్కువ నీటి లభ్యత ఉన్న శ్రీశైలం జలాశయానికి మార్చడం అనివార్యం అయ్యింది. ముఖ్య మంత్రి సమక్షంలో ఇంజనీరింగ్‌ నిపుణులు, రిటైర్డ్‌ ఇంజనీర్లు, సమగ్ర నివేదిక తయారు చేస్తున్న (Engineering Staff College of India) వారితో సుదీర్ఘ చర్చలు జరిగినాయి. సర్వే ఆఫ్‌ ఇండియా వారి టోపో షీట్లు, గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌ వేర్‌, జూరాల, శ్రీశైలం వరద ప్రవాహాల గణాంకాల సాయంతో కూలంకషంగా అధ్యయనం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముంపుని గణనీయంగా తగ్గించగలిగే అవకాశం ఉందని, జూరాల నుండి కాక శ్రీశైలం జలాశయం నుండి రోజుకు 2 టిఎంసిల నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉందని తేలింది. ఇన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నప్పుడు ప్రాజెక్టు సాఫల్యతపై దృష్టి పెట్టవలసి ఉన్నది. ఈ అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్‌ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారు చేస్తున్న Engineering Staff College of India(ESCI) వారిని పై చర్చల ఆధారంగా శ్రీశైలం నుండి ప్రాజెక్టుని రీ డిజైన్‌ చెయ్యమని ఆదేశించింది ప్రభుత్వం.

రీ డిజైన్‌ తర్వాత ప్రాజెక్టు వివరాలు :

రీ డిజైన్‌ తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానమైన మార్పు నీటి సోర్స్‌ జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి మారడం. కొత్త జలాశయాలను ప్రతిపాదించడం, పంపింగ్‌ సామర్థ్యాన్ని రోజుకు 1.5 టిఎంసిల నుంచి 2 టిఎంసిలకు పెంచడం, ఆయకట్టు 10 లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం , గతంలో కంటే ముంపు గణనీయంగా తగ్గించడం జరిగింది.

ప్రభుత్వ జి.ఒ. 105 తేదీ.10.06.2016 ద్వారా ప్రాజెక్టుకు రూ.35,200 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు 11.06.2015 తేదీన కరివెన గ్రామం వద్ద శంకుస్థాపన చేసిన తర్వాత ప్రాజెక్టు పనులని 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చెయ్యడం జరిగింది. పనులు ప్రారంభమయినాయి.

ఒక వైపు ఆంధ్రప్రదేశ్‌ పాలకులు, మరొక వైపు జిల్లా నాయకులే ప్రాజెక్టుపై కక్ష గట్టి ప్రాజెక్టును అడ్డుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక నాయకుడు ఈ ప్రాజెక్టును అటవీ , పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రారంభించారని , అటవీ సంపదను నాశనం చేస్తున్నారని , వన్యప్రాణుల మనుగడకు ఆటంకం కలుగజేస్తుందని ఆరోపిస్తూ ఎన్‌ జి టి లో కేసు దాఖలు చేసినాడు. ఆ కేసు విషయంలో ప్రభుత్వం తాము కేంద్ర ప్రభుత్వం నుండి అటవీ, పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించామని, ఆ అనుమతులు వచ్చే దాకా సాగునీరు అందించే పనులు చేబట్టబోమని స్పష్టం చేసింది. తాము కేవలం తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన పనులను మాత్రమే చేపట్టామని ఎన్‌ జి టి కి స్పష్టం చేసింది. కోర్టు ప్రాజెక్టు పనులపై ఎటువంటి స్టే ఇవ్వకపోవడంతో ప్రాజె క్టు పనులు కొనసాగుతున్నాయి. అటవీ పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత సాగు నీరు సరఫరా చేసే కాలువలు, ఉప కాలువల పనులు చేపట్టడం జరుగుతుంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రాజెక్టుకు కృష్ణా బోర్డు అనుమతి లేదని, అపెక్స్‌ కమిటీ అనుమతి గాని లేదని, ప్రాజెక్టుని వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ప్రాజెక్టుకు జి.ఒ. 72 ద్వారా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే సర్వే, సమగ్ర నివేదిక తయారీకి పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం అనుమతించిన ప్రాజెక్టులని కొనసాగించవచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ జి.ఒ. 72 ని అమలు చేస్తున్నదే తప్ప కొత్త ప్రాజెక్టు కాదు. తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును చేపట్టినట్టయితే KRMB అనుమతిని, అపెక్స్‌ కమిటీ అనుమతిని తప్పక పొందుతుంది. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని చేపట్టడానికి KRMD అనుమతి గాని, అపెక్స్‌ కమిటీ అనుమతిగాని అక్కర లేదు. అదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

ఇక మరోవైపు జిల్లా నాయకుడు ప్రాజెక్టు టెండర్లలో అవకతవకలు జరిగినాయన్న ఆరోపణతో ప్రాజెక్టు పనులని ఆపివేయించడానికి హైకోర్ట్‌ ని ఆశ్రయించినాడు. అయితే హైకోర్ట్‌ ఆయన ఆరోపణల్లో బలం లేదని పిటిషన్‌ ని డిస్మిస్‌ చేయడం విశేషం. అన్ని అడ్డంకులని అధిగమించి ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతునాయి. మూడేండ్లలో పాలమూరు జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష సాకారం కాబోతున్నది.

ప్రాజెక్టు ప్రధానాంశాలు:

టిఎంసి మట్టికట ముంపు ముంపు ముంపు ఆయకట్టుు ఎఫ్‌ఆర్‌ఎల్‌ నీటి నిల్వ

పొడవుకి.మీ గ్రామాలు జనాభా ఆవాసాలు ఎకరాల

కోయిల్‌ కొండ 465 మీ 76 14.2 34 61672 11749 145230

గండీడ్‌ 570 మీ 35 8.3 9 17238 3368 323447

కెపిఎల్‌ దేవిపల్లి 675 మీ 10 12.8 4 5534 1225 531323

ప్రాజెక్టు అంచనా వ్యయం. 32,200 కోట్లుగా 2015-16 రేట్లతో లెక్కగట్టడం జరిగింది.

పై పట్టికను గమనించినప్పుడు మూడు జలాశయాల్లో మొత్తం 47 గ్రామాలు, 84,444 మంది జనాభా, 16,342 ఆవాసాలు ముంపు బారిన పడుతున్నాయని తెలుస్తున్నది. ఇంత భారీ ముంపుని తగ్గించడం ప్రభుత్వం ముందు ఒక సవాలుగా ముందుకు వచ్చింది. దాంతో పాటు జూరాల జలాశయం నిల్వ సామర్థ్యం 9.657 టిఎంసిలు మాత్రమే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రోజుకు 1.5 టిఎంసిల నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించినందున జూరాల జలాశయం నుండి ఇంత భారీగా నీటిని ఎత్తిపోయడానికి సాంకేతికంగా సాధ్యమా? అన్న ప్రశ్నలు ముందుకు వచ్చినాయి. జూరాలపై ఇప్పటికే జూరాల స్వంత ఆయకట్టు ఒక లక్ష ఎకరాలు , 2 లక్షల ఎకరాల భీమా ఆయకట్టు, 2 లక్షల ఎకరాల నెట్టెంపాడు ఆయకట్టు , 50 వేల ఎకరాల కోయిల్‌ సాగర్‌ ఆయకట్టు , మొత్తం 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయి.ఈ ఆయకట్టుకు నీరు అందించాలంటే 5540 క్యూసెక్కుల నీరు అవసరమవుతుంది.

శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే