పచ్చదనానికి విశ్వవేదిక పాలమూరు
తెలంగాణ స్వయం పాలనలో పాలమూరు జిల్లా పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశంసించారు. జిల్లా యంత్రాంగాన్ని, పాలమూరు మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. వలసలకు, ఆకలి చావులకు నిలయంగా పాలమూరు ఎన్నో సంవత్సరాలు వెనకబాటును అనుభవించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లా ఎంతో నిర్లక్ష్యానికి గురిచేయబడిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక జిల్లాను అన్ని రంగాల్లోను ముందుకు తీసుకెళ్ళామని, ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతున్నదని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పాలమూరు మహిళా స్వయం సహాయక సంఘాలు పది రోజుల్లో 2.08 కోట్ల విత్తన బంతులను తయారుచేసి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, విత్తన బంతులతో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ జ్ఞాపికను మహబూబ్‌నగర్ జిల్లా మంత్రి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న సాగునీరు వల్ల జిల్లా రూపురేఖలే మారిపోయాయన్నారు. జిల్లాలో సాగుభూమి అతి తక్కువగా కనిపించేదని, రాళ్లు, గుట్టలే అగుపించేవని సీఎం అన్నారు. ఇప్పుడు ఎటు చూసినా పచ్చని పంట పొలాలే అగుపిస్తూ కనువిందు చేస్తున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.