|

నాటి కరువు జిల్లా నేడు సిరుల ఖిల్లా

  • ఉప్పర వెంకటేశ్వర్లు

ఎటు చూసినా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు. తాగడానికి  చుక్క నీరు లేక ఎడారిని తలపించేలా కనుచూపు మేరలో ఎండమావి తప్ప నీటి జాడలేని పరిస్థితులు. నోళ్లు తెరిచిన బీళ్ళు. పట్టణాలలో సైతం 14 రోజులకు ఒకసారి  వచ్చే తాగునీటి కోసం 13 రోజులు ఎదురుచూసే ప్రజలు. బ్రతుకుదెరువు కోసం  ప్రతి యేటా లక్షల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే  కూలీలు.ఇది ఒకప్పటి పాలమూరు దుస్థితి.

సీన్‌ రివర్స్‌ అయితే ? అదే జరిగింది…

అపర భగీరథుడు,అనితర సాధ్యుడు,తెలంగాణనే ధ్యేయంగా కొట్లాడి తెలంగాణ తెచ్చిన ఘనుడు ప్రస్తుత  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2014 లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నాడు. ఆయన రాకతో పాలమూరు స్వరూపం కూడా మారిపోయింది. దానికి తోడు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అలుపెరుగని కృషి కూడా ఒక కారణమయ్యింది.

నాడు భగీరథుడు దివినుండి భువికి గంగను తీసుకువస్తే నేటి మన ముఖ్యమంత్రి వృధాగా సాగరగర్భంలో కలిసిపోయే నీటిని ఎతైన ప్రాంతాలకు సైతం ఎత్తిపోతల ద్వారా తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాడు. అంతేకాక మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ కార్యక్రమాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన జల సంరక్షణ కార్యక్రమాల వల్ల పాలమూరు జిల్లా రూపురేఖలు మారిపోయి సస్యశ్యామలమయ్యింది. ప్రస్తుతం జిల్లాలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, అడుగడుగున సాగునీరు, ప్రతిరోజు మిషన్‌ భగీరథ తాగునీటితో పాలమూరు మరో కోనసీమను తలపిస్తున్నది. 

కరువు జిల్లాగా, వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిస్థితులను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, వాన నీటి సంరక్షణ కార్యక్రమాలు, హరితహారం కార్యక్రమాల వల్ల భూగర్భ జలాలు  పెరిగాయి. 2014కు పూర్వం జిల్లాలో భూగర్భ జలాలు భూమి నుండి 13 మీటర్ల లోతులో ఉండేవి. మిడ్జిల్‌, రాజాపూర్‌, సిసి కుంట, హన్వాడ, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌ వంటి 6 మండలాలలో 20 మీటర్ల లోతున నీరు ఉండేది. ఈ మండలాలు మరీ పూర్తిగా ఎడారిలాగా మారిపోయి డార్క్‌ మండలాలుగా గుర్తింపు పొందాయి.

  2014-21 మధ్య కాలంలో జిల్లాలో వివిధ పథకాల కింద  342 చెక్‌ డాంలు, 338 ఊటకుంటలు, 656 వాన నీటి సంరక్షణ కట్టడాలను నిర్మించడమే కాకుండా, మిషన్‌ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులో పూడిక తీసి కట్టలని వెడల్పు చేసి, పటిష్టం చేయడం జరిగింది. తద్వారా వర్షపు నీటిని పూర్తిస్థాయిలో ఒడిసి పట్టుకోవడంతో, భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేశాయి. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కూడా సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు ఆస్కారమిచ్చినట్టయ్యింది. హరితహారం ద్వారా రాష్ట్రంలో 10 శాతం పచ్చదనం పెరిగిందంటే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. దీంతోపాటు ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున మిషన్‌ భగీరథ పేరున ఇంటింటికి తాగునీటిని అందించేందుకు చెరువులు, ట్యాంక్‌లలో నీటిని నిల్వ చేయడం ద్వారా కూడా చుట్టుపక్కల బోర్లు, బావులు రీఛార్జ్‌ అయ్యి భూగర్భ జలాలు అమాంతం పెరిగిపోయాయి. అంతేకాక బోర్లు వేసే శాతం తగ్గిపోయింది. ఇంటింటికి ఇంకుడు గుంతలు తవ్వటం కూడా భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడిరది.

ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన జల సంరక్షణ కార్యక్రమాల వల్ల 2021 నాటికి పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు జిల్లాలో కేవలం 2,3 మీటర్ల లోపే భూగర్భ జలాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు 20 మీటర్ల తర్వాత నీరుండే మండలాలు జిల్లాలో ఏవి లేవు. అన్ని 5 నుండి10 మీటర్ల లోపు భూగర్భ జలాలున్న మండలాలే ఉన్నాయి. ముఖ్యంగా భూత్పూర్‌, కోయిల్‌ కొండ, మహమ్మదాబాద్‌, నవాబ్‌ పేట వంటి మండలాలలో కేవలం 5 మీటర్ల లోపే జలం ఉంటున్నది. 2014 నుండి 2021 ఆగస్టు వరకు 6.60 మీటర్ల మేర భూగర్భ జలాల పెరుగుదల నమోదయింది.

ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు బోర్ల ద్వారా జిల్లాలో వానాకాలం, యాసంగిలలో వరి పంట రికార్డ్‌ స్థాయిలో పండింది  ఇప్పుడు సాగునీరు, తాగునీటి తోపాటు, ఎటు చూసినా ధాన్యపు రాశులతో పాలమూరు జిల్లా కళకళలాడుతున్నది.  గత సంవత్సరం వానాకాలంలో లక్ష 14,232 ఎకరాలలో వరి పండగా, యాసంగిలో 1,21,031 ఎకరాలలో, ఈ వానాకాలంలో లక్ష 72,518 ఎకరాలలో వరి పంట వేయటం జరిగింది. ఈ వానాకాలంలో ఒక్క మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే 4 లక్షల 33 వేల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. 

గతంలో ప్రతి సంవత్సరం జిల్లా నుండి ప్రజలు లక్షల సంఖ్యల్లో బతుకుదెరువు కోసం వలస వెళ్ళిన పరిస్థితులు ఉండగా, నేడు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూలీలు మహబూబ్‌నగర్‌ జిల్లాకు వలస వస్తున్నారు. దీంతో కరువు జిల్లాగా పేరొందిన మహబూబ్‌ నగర్‌ జిల్లా నేడు కల్పతరువుగా, సిరుల ఖిల్లాగా మారింది.