జగతికి ఆదర్శంగా పల్లె, పట్టణ ప్రగతి

By: మార్గం లక్ష్మీనారాయణ

భారత దేశంలో, తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, రాజకీయ పరంగా భిన్నమైనది. ప్రజల జీవన విధానం మరింత విభిన్నమైంది. ఒకవైపు బాగా వెనుకబాటుతో గ్రామీణ ప్రాంతాలు. అడుగంటుతున్న కుల వృత్తులు. ఒకప్పుడు స్వయం సమృద్ధిగా ఉన్న గ్రామాలు సమస్యల లోగిళ్ళుగా మారిన వైనాలు. మరోవైపు ఉద్యోగాలు, ఉపాధి, విద్యా, శిక్షణల కోసం పట్టణాలకు ప్రజల వలసలు. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలు. కేవలం అభివృద్ధి, సంక్షేమాలతోనే ఈ ప్రాంతాల, పరిస్థితుల మధ్య సమన్వయం సాధించలేం. అంతకుమించిన ఆలోచన, అవసరాలను గుర్తించి, పథకాలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పాలించిన పాలకులకు ఏనాడూ తట్టని విధంగా, ప్రస్తుత అవసరాలు, భవిష్యత్‌ అంచనాలతో అద్భుత పథకాలను రూపొందించి సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారు.  

2011 జనాభా లెక్కల ప్రకారం, 69శాతం ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు. తెలంగాణ జనాభాలో 61.12శాతం ప్రజలు గ్రామాల్లో, 38.88శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం పట్టణ జనాభా 46.8శాతం కాగా, పల్లెల జనాభా 53.2శాతం. పట్టణ జనాభా, పల్లెల జనాభా దాదాపు చెరిసగంగా, సమంగా ఉన్నాయి. ఈ దశలో చెరి సమానమైన పథకాలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేర్లతో రెండు పథకాలను సీఎం కేసీఆర్‌ రూపొందించి అమలు చేస్తున్నారు. గత పాలకులు గాలికి వదిలేసిన గ్రామాలను, అసలు ఏ మాత్రం పట్టించుకోని పట్టణాలను సీఎం కేసీఆర్‌ఈ రెండు పథకాల ద్వారా వాటి రూపురేఖలను సమగ్రంగా మార్చేశారు. ఇవ్వాళ గ్రామాలు పూర్వ వైభవాన్ని, నగరాలు, పట్టణాలు ఆధునిక వైభోగాన్ని సంతరించుకుంటున్నాయంటే అది నూటికి నూరు శాతం కేసీఆర్‌ కృషే. 

సమగ్ర గ్రామీణ విధానమే పల్లె ప్రగతి

పల్లె ప్రగతి పథకాన్ని ప్రభుత్వం గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే సమగ్ర గ్రామీణ విధానంగా అమలు చేస్తున్నది. పల్లెల్లో పచ్చదనం – పరిశుభ్రత వెల్లివిరిసేలా, మౌలిక వసతులన్నీ కల్పించేలా ప్రణాళికా బద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది. దీంతో తెలంగాణ గ్రామీణ ముఖచిత్రమే మారిపోయింది.

మొదటి దశలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవన భద్రత కల్పించడానికి చర్యలు తీసుకున్నది. నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడం, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేయడం, చేతి వృత్తులు- కుల వృత్తులకు చేయూతనివ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసింది. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లాంటి రైతు సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్ల లాంటి ప్రజా సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు భవిష్యత్‌ పై ఆశావహ దృక్పథాన్ని కల్పించింది. మిషన్‌ భగీరథ, రహదారుల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రభుత్వం గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేసింది.

తెలంగాణలో గ్రామ పంచాయతీల సంఖ్యను 12 వేల 769కు పెంచింది. 3,146 ఆదివాసీలు, గిరిజనుల గూడాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండే విధంగా నియమించింది.  గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాన్ని 8 వేల 500 రూపాయలకు పెంచింది. పీఆర్సీ కి అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచింది. గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్రను ప్రభుత్వం క్రియాశీలం చేసింది. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం తెచ్చింది. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరియాలని, ప్రతీ పల్లె పరిశుభ్రంగా ఉండాలని నిర్దేశించింది. గ్రామాల అభివృద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకునే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలకు చట్టంలో కఠిన నిబంధనలు  పెట్టి, పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచింది. ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి విధానం అమలు కోసం పల్లెల ప్రగతికి ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. పల్లె ప్రగతి కింద దేశంలోనే తొలిసారిగా 12 వేల 751 గ్రామాలలో స్టాండిరగ్‌ కమిటీలలో ప్రజలను భాగస్వాములను చేసింది. వర్స్క్‌ కమిటీ, శానిటేషన్‌ కమిటీ, స్ట్రీట్‌ లైట్‌ కమిటీ, గ్రీన్‌ కవర్‌ కమిటి ఇలా ఒక్కో గ్రామంలో 4 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీల్లో 8 లక్షల 20 వేల 727 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు.  వీరిలో 4 లక్షల 3 వేల 758 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.

గత 4 విడతలు…నిధులు

దేశంలో ఎక్కడాలేని విధంగా కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర నిధులను జమచేసి పంచాయతీలకు విడుదల చేస్తున్నది. గ్రామ పంచాయతీలకు 85శాతం, మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్‌లకు 5శాతం నిధులను ప్రభుత్వం అందజేస్తున్నది. 100, 200 జనాభా కలిగిన చిన్న గ్రామపంచాయతీలకు కూడా కనీసం రూ.5 లక్షల నిధులు అందుతున్నాయి. సెప్టెంబర్‌ 2019 నుండి ఇప్పటివరకు రూ.9,560.32 కోట్లు స్థానిక సంస్థలకు విడుదలయ్యాయి. గత ఒక్క  ఏడాదిలోనే 12 వందల కోట్ల విలువైన సిసి రోడ్లు గ్రామాల్లో వేశారు.

కాగా, ఇప్పటివరకు 4 విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాలు జరిగాయి. 1వ విడత సెప్టెంబర్‌ 6, 2019 నుంచి అక్టోబర్‌ 5 వరకు నెల రోజుల పాటు నిర్వహించారు. 2వ విడత జనవరి 2, 2020 నుంచి జనవరి 12వ తేదీ వరకు నిర్వహించారు. 3వ విడత జూన్‌ 1, 2020 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ గా నిర్వహించారు. 4వ విడత జులై 2, 2021 నుంచి 10 జులై వరకు నిర్వహించారు. 5వ విడత పల్లె ప్రగతిని జూన్‌ 3 నుంచి 2022 నుంచి జూన్‌ 18వ తేదీ వరకు నిర్వహించారు.

5వ విడత పల్లె ప్రగతిలో సాధించిన ప్రగతి వివరాలు

  • 80,545 ప్రభుత్వ, ప్రజోపయోగ కార్యాలయాల పరిశుభ్రం
  • 10,844 కిలో మీటర్ల మేర రోడ్లకిరువైపులా అవేన్యు ప్లాంటేషన్‌ కోసం అనువైన స్థలాల గుర్తింపు
  • 6,39,822 మంది ప్రజల శ్రమదానం
  • 18.718 లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీటి నిల్వ ఉండకుండా మట్టితో పూడ్చినవి.
  • 23,150 ఇంకుడు గుంతలు, 4,239 సామూహిక ఇంకుడు గుంతలు పూర్తి
  • 19,674 స్తంభాలకు లైన్‌ ఏర్పాటు
  • 1,410 వైకుంఠ ధామాలకు విద్యుత్‌ కనెక్షన్లు
  • 1,773 వైకుంఠ ధామాలలో నీటి సౌకర్యం
  • 1,010 వైకుంఠధామాలలో ఇతర సదుపాయాలు  

పట్టణ ప్రగతి

నగరాలు, పట్టణాలు ఆర్థిక వృద్ధికి చోదక శక్తులు. నగరాలు, పట్టణాల్లో జరిగే ఆర్థిక కార్యకలాపాలు ప్రజల ఉపాధి, ఉద్యోగిత, జీవన ప్రమాణాల పెంపునకు తోడ్పడతాయి. పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలతో పాటు వివిధ అవసరాల కోసం నిత్యం పట్టణాలకు వచ్చి పోయే ఇతర ప్రాంతాల, గ్రామీణ ప్రజలకు అనువైన వసతులు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు నగర, పట్టణ పాలక సంస్థలది. ఇందుకనుగుణంగా ప్రణాళికా బద్ధంగా మౌలిక వసతులను మెరుగుపరిచి, పరిశుభ్రత, పచ్చదనంతో ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా జీవించే వాతావరణాన్ని పట్టణాలలో కల్పించాలనే సంకల్పంతో 2020 ఫిబ్రవరి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది.

దేశంలో ఎక్కువ నగర, పట్టణీకరణ జరిగిన మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలోని జీ హెచ్‌ ఎం సి,  12  కార్పోరేషన్‌ లు, 129 మున్సిపాలిటీలు… కలిపి మొత్తం 142 నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 3,618 వార్డులలో దాదాపు 1కోటి 50 లక్షల జనాభా నివసిస్తున్నది. ఈ జనాభా రాష్ట్ర జనాభాలో దాదాపు సగం ఉంటుంది. ఇంత పెద్ద జనాభా ఉన్న నగరాలు, పట్టణాలు ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండిపోయింది. నిధుల లేమికి తోడు పాలకుల ముందు చూపు మందగించి, నగరాలు, పట్టణాలంటేనే మురికి, నరక కూపాలుగా మారిపోయాయి.

ఒకవైపు గ్రామాల్లో వృత్తులు అడుగంటి, వ్యవసాయం దండుగలా మారి, ఉపాధి కరువైన నేపథ్యంలో ప్రజలు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు, నగరాలకు వలసపోయే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ వచ్చే నాటి పరిస్థితులపై అంచనా, అవగాహన ఉన్న సీఎం కేసీఆర్‌, పల్లెల్లో ఉపాధి, జీవన స్థితిగతులను మెరుగు పరుస్తూనే, అందుకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారు. అలాగే ఒక సమగ్ర గ్రామీణ విధానంగా పల్లె ప్రగతిని చేపట్టారు. అదే తీరులో పట్టణ, నగరాల తీరు తెన్నులను మార్చేందుకు పట్టణ ప్రగతి దోహదం చేస్తున్నది. పట్టణ ప్రగతితో తెలంగాణ నగరాలు, పట్టణాలు దేశంలోనే అత్యంత నివాసయోగ్య ప్రాంతాలుగా రుపొందుతున్నవి.

గత మూడు విడతలు… నిధులు

2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు మొదటి విడత,  2021 జూన్‌ 1 నుంచి 8 వరకు 2వ విడత, 2021 జూలై 1 నుంచి 10 వరకు 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన మూడు విడతల పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అయింది. నగర, పురపాలక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 2020 ఫిబ్రవరి నుంచి మార్చి, 2021 వరకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.148 కోట్లను విడుదల చేసింది. అలాగే 2021 ఏప్రిల్‌ నుంచి రూ.112 కోట్లను ఇచ్చింది. పట్టణ ప్రగతి ప్రారంభించినప్పటి నుండి పురపాలక సంస్థలకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ 3,318 కోట్లలో రూ.2,649 కోట్ల విలువైన పనులు పూర్తయినాయి. పురపాలక సంస్థల వార్షిక బడ్జెట్‌ లో 10శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌గా కేటాయిస్తున్నారు. దీంతో పట్టణాలు పచ్చదనాన్ని పరచుకుంటున్నాయి.

4వ విడత పట్టణ ప్రగతి

జూన్‌ 3వ తేదీ నుండి జూన్‌ 18వ తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. పట్టణ ప్రగతి లో ప్రధానంగా పారిశుధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, ఐవీ అండ్‌ ఎన్‌ వీ మార్కెట్లు, రైతు బజార్లు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది.

తెలంగాణలో ప్రస్తుతం 46.8శాతంగా ఉన్న నగర, పట్టణ జనాభా 2025 నాటికి 50శాతానికి చేరే అవకాశం ఉందనేది ఓ అంచనా. ఇవ్వాళ్టి జనాభా అవసరాలు తీరితే సరిపోదు. ఎంతో ముందు చూపుతో… తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. భవిష్యత్తు తరాలను, వారి అవసరాలను అంచనా వేస్తూ, సదుపాయాలు కల్పించాలి. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, అవసరాలు, పల్లెల నుండి పట్టణాలకు, పట్టణాల నుండి నగరాలకు ఉపాధి, ఉద్యోగాలు, చదువులు, శిక్షణ కోసం వస్తున్న వలసలను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు నగరాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వేగంగా విస్తృతంగా విస్తరిస్తున్న నగరాలను పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలను పరిష్కరించాలి. ఇందుకనుగుణంగా పట్టణ ప్రగతిని ప్రభుత్వం తీర్చిదిద్ది అమలు చేస్తున్నది.