గుట్టగుడికి పసిడి గోపురం

templeతెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన యాదగిరి గుట్టను మరో తిరుమలగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంకల్పించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు గాను స్వయంగా అక్టోబరు 17 యాదగిరిగుట్టను సందర్శించారు. ఆ ప్రాంతంలో హెలిక్యాప్టర్‌పై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆలయం చుట్టూ ఉన్న భూమి సుమారు రెండు వేల ఎకరాలు సేకరించి అందులో 400 ఎకరాల్లో అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. యాదగిరి గుట్ట చుట్టు ఉన్న 380 ఎకరాల రిజర్వు ఫారెస్టుతో పాటు చెరువు, రెండు కొండలు, మరో 20 ఎకరాలు కలిపి మొత్తం 400 ఎకరాల్లో నృసింహ అభయారణ్యాన్ని అభివృద్ధిపరిచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తిరుమల దేవాలయానికి ప్రణాళికలు రూపకల్పన చేసిన తమ్మన్నను పిలిపించి 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు,విల్లాలు, కాటేజీలు నిర్మించడానికి నిర్ణయించారు.

ఆలయ గర్బగుడి ఎత్తు పెంచడంతో పాటు స్వర్ణ గోపుర నిర్మాణానికి ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆలయ మండపం ఇరుకుగా ఉన్నందున ఉత్తర, దక్షిణాల వైపు విస్తరణను శాస్త్రోక్తంగా చేపట్టనున్నట్లు సిఎం వెల్లడించారు. యాదగిరిగుట్టను టెంపుల్‌ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారుచేయనున్నారు. అలాగే యాదగిరిగుట్ట మీద ఉన్న 103 ఎకరాల స్థలం రెవిన్యూ రికార్డుల్లో బంచరాయిగా పేర్కొన్నారని, దాన్ని దేవస్థానం ఆస్థిగా మార్పు చేయనున్నట్లు కెసిఆర్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక మొదటిసారి యాదగిరిగుట్టను సందర్శించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కెసిఆర్‌. బ్రహ్మూెత్సవాల సందర్భంగా స్వామివారికి సి.ఎం. చేతులమీదుగా పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయాన్ని ప్రవేశపెడతామన్నారు. పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సి.ఎం.కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం ప్రధాన అర్చకులు సీ.ఎం.కు ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం సి.ఎం. కేసీఆర్‌ యాదగిరిగుట్ట అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలను ప్రకటించారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించడంపై ముఖ్యమంత్రి దృష్టి కేంద్రీకరించారు. ఎట్టి పరిస్థితుల్లోను యాదగిరిగుట్టలో అపరిశుభ్రత మచ్చుకైనా అగుపించరాదని ఆయన అధికారులను ఆదేశించారు. మొత్తంగా తెలంగాణలోని సుప్రసిద్ద దేవాలయం యాదగిరిగుట్టకు తిరుపతి తరహాలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోనుందనడంలో అతిశయోక్తి లేదు.