డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను విక్రయిస్తే పట్టాల రద్దు: మంత్రి కె.టి.ఆర్ హెచ్చరిక
గ్రేటర్ హైదరాబాద్ లో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే ఆ పట్టాలను రద్దు చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 28.38 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలను కె.టి.రామారావు చేశారు.

10.90 కోట్ల రూపాయల వ్యయంతో బాగ్ లింగంపల్లి లంబాడి తండాలో నిర్మించిన 126 డబుల్ బెడ్ రూం ఇళ్లను, రూ. 3.50 కోట్ల వ్యయంతో అడిక్‌మెట్‌లో నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారం భించారు. వీటితో పాటు రూ. 9.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జోనల్, డిప్యూటి కమిషనర్ కార్యాలయాలకు శంకుస్థాపన, నారాయణగూడ క్రాస్ రోడ్స్ లో రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
లంబాడి తండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కె.టి.ఆర్ మాట్లాడుతూ, దేశంలోని 28 రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో రూ. 18 ,000 కోట్ల వ్యయంతో 2,72,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలియ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో రూ. 9,714 కోట్ల వ్యయంతో ప్రారంభించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ళు దాదాపు పూర్తి కావొచ్చాయని తెలిపారు. ఒక్కొక్కటి సుమారు తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ
ఇళ్ళు లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని, ఈ ఇళ్లను పొందే లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను అమ్ముకోవడం గానీ, ఇతరులకు కిరాయికి ఇవ్వడం గానీ చేయొద్దని స్పష్టం చేశారు. ఇళ్ళు అంటేనే ఆత్మ గౌర వానికి నిదర్శనమని అన్నారు. తమ ఇల్లును ఎలానైతే శుభ్రంగా ఉంచుకుంటారో తమ పరిసరాలను, బస్తీలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌ను మురికి వాడల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా నగరంలోని 40 లొకేషన్లలో ఇన్సిటూ పద్ధతిలో 8898 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చేపట్టామని తెలియచేశారు. ఇప్పటికే సింగం చెరువు తండా, చిత్తారమ్మ బస్తి, కిడ్ కీ బాత్ అలీషా, సయ్యద్ సాబ్ కా బాడా, ఎరుకల నాంచారమ్మ బస్తి, జియాగూడా, కట్టెలమండి, గోడే కి ఖబర్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించామని తెలియ చేశారు. ప్రస్తుతం ఏవిధమైన ఎన్నికలు లేనందున అభివృద్ధికి అందరం కలసి పనిచేద్దామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి మాట్లా డుతూ, నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా లబ్ధి దారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రులు అందచేశారు.
నెరవేరిన కల
నిన్నటిదాకా అదో మురికివాడ. ఇరుకు సందులతో, గాలికూడా సరిగా రాని పరిస్థితి. చాలీ చాలని ఇరుకు ఇళ్లలో ఉండే ఆ బస్తీ వాసులకు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం వర ప్రసాదంగా మారింది. అదే, హిమాయత్‌నగర్ సుందరయ్య విజ్ఞాన భవన్ సమీపంలోని లంబాడి తండా. ఒకప్పుడు పురాతన శిథిల ఇళ్ళుగా ఉన్న ఈ తండాలోని ఇళ్లను తొలగించి ప్రతి ఒక్క గిరిజన కుటుంబం ఆత్మస్థైర్యంతో నివసించాలన్న ప్రభుత్వ ఆశయం మేరకు ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది.
126 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జి.హెచ్.ఎం.సి రికార్డ్ సమయంలో నిర్మించింది. సెల్లార్, సిల్ట్స్, 9 అంతస్తులలో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఒకొక్కటి రూ. 8 .65 లక్షల వ్యయంతో నిర్మించారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్ రూమ్ లు, ఒక కిచెన్, ఒక వాష్ రూమ్, హాల్ తో కూడిన ఈ ఇల్లు బహిరంగ మార్కెట్ లో కనీసం రూ. 40 లక్షలకు పైగానే ఉంటుంది. పూర్తిగా ఉచితంగా అందించే వీటిని ప్రభుత్వ నిధులతో నిర్మించారు.