11 వేల ఎకరాలలో ఫార్మా సిటీ

11-వేల-ఎకరాలలో-ఫార్మా-సిటీ1రంగారెడ్డి జిల్లా కందుకూర్‌ మండలం ముచ్చర్ల పరిధిలో 11వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటి (ఔషధ నగరి)ని నిర్మించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ ఫార్మా సిటి నెలకొల్పడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 70వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లలో అధికారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో కలిసి డిసెంబరు 3న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫార్మాసిటీ ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించడానికి, ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఫార్మా సిటీ స్థాపనకు ఈ స్థలం అత్యంత అనుకూలమైనదిగా గుర్తించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాదు ఫార్మా సిటి పేరుతో అంతర్జాతీయ ఫార్మా సిటీని నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను కూడా స్థాపించనున్నట్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎకో ఫ్రెండ్లీ ఫార్మాసిటీని నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫార్మా పరిశ్రమలతోపాటు అందులో పనిచేసే ఉద్యోగుల కోసం టౌన్‌షిప్‌ కూడా నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు.
ఫార్మా సిటీవల్ల ఎలాంటి కాలుష్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకొంటామని, పర్యావరణానికి కూడా ఎలాంటి విఘాతం కలుగనీయమని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. జీరో లిక్విడ్‌, డిశ్చార్జ్‌ వ్యవస్థతో ఫార్మా సిటీ పనిచేస్తుందని అన్నారు. స్థానిక ఫార్మా కంపెనీలే ఇక్కడ 30వేల కోట్ల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలకు స్థాపించడానికి ముందుకు వచ్చాయి. ముఖ్యమంత్రి వెంట వెళ్లిన ఫార్మా కంపెనీల ప్రతినిధులు కూడా ప్రతిపాదిత ఫార్మా సిటీపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముచ్చర్ల ప్రాంతంలోని స్థలం అత్యంత అనువైనదిగా వారు అభిప్రాయపడ్డారు.

ఫార్మా సిటీ ఏర్పాటు చేయడంకోసం అన్ని చర్యలు తీసుకోవాలని, పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫార్మా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, రోడ్లు, త్రాగునీరు వసతి కల్పించడంతోపాటు రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు.

ముఖ్యమంత్రి వెంట రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, టిఎన్‌ఐఐసి యండి జయేష్‌ రంజన్‌, ఫార్మా కంపెనీల ప్రతినిధులు బి. పార్థసారధిరెడ్డి, కె. రత్నాకర్‌రెడ్డి (హెటిరో), కె. సతీష్‌రెడ్డి (డాక్టర్‌ రెడ్డీస్‌), కె. నిత్యానందరెడ్డి (అరబిందో), యం. నారాయణరెడ్డి (విర్కో), పి. ఈశ్వర్‌రెడ్డి (బిడిఎంఎ), యంఎస్‌ఎన్‌రెడ్డి (యంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌), సంతోష్‌ (వివి మెడ్‌), డాక్టర్‌ ఎస్‌. ఆనంద్‌ (సాగర్‌ గ్రూప్‌), యం. మోహన్‌రావు (సైనుడ్‌), రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్లు ఎస్‌. శ్రీధర్‌, ప్రియదర్శిని తదితరులు పర్యటించిన వారిలో ఉన్నారు.