మోదీ మెచ్చిన బోయిన్‌పల్లి మార్కెట్‌

బోయిన్‌పల్లి మార్కెట్‌ ప్రధాని మోదీ ప్రశంసలందుకున్నది.  విద్యుత్‌, బయోగ్యాస్‌ ప్లాంటు ఏర్పాటు చేసి అక్కడ వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే విధంగా, బయోగ్యాస్‌ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా, విద్యుత్‌ ఉత్పత్తి వల్ల కూడా ఏంతో మేలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఎంతో ప్రశంసించదగ్గదని అన్నారు. ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలంగాణలోని బోయినపల్లి మార్కెట్‌ను ఉదహరించారు. అక్కడ జరుగుతున్న కూరగాయల అమ్మకాలు, రైతులకు ఒనగూరుతున్న సౌకర్యాలు, నేరుగా రైతుల నుంచి వినియోగదారులు కొనుగోలు చేస్తున్న పరిస్థితులు తెలుసుకుని, కూరగాయల వ్యర్థాలతో విద్యుత్‌, గ్యాస్‌ తయారుచేసే విధానాన్ని తెలుసుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని, మార్కెట్‌ కమిటీ నిర్వాహకులను ప్రశంసించారు.

ఈ మార్కెట్‌ను గవర్నర్‌ తమిళిసై సందర్శించి విద్యుత్‌, బయోగ్యాస్‌ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్‌, బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు అభినందనీయమన్నారు.  మార్కెట్‌లోని క్యాంటీన్‌కు ఇదే గ్యాస్‌ వాడడం, ఎల్‌పీజీ గ్యాస్‌ ఆదాచేయడాన్ని ఆమె మెచ్చుకున్నారు. మార్కెట్‌లో ఏర్పాటు చేసుకున్న విధంగానే ఇళ్ళు, ఆఫీసుల్లోను బయోగ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మార్కెట్‌లో రైతులతోను మాట్లాడారు. ప్లాంటు ఏర్పాటు చేసిన ఐఐసీటీ సైంటిస్టులను గవర్నర్‌ అభినందించారు. ఆత్మనిర్బర్‌ భారత్‌కి ఇది ఆదర్శనీయమని, మన్‌కీ బాత్‌లో ప్రధాని మార్కెట్‌ గురించి ప్రస్తావించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.