కాళేశ్వరా!

పుణ్యగోదావరీ తీర్థములను పంపి
మా తెలంగాణ బీళ్ళను మళ్ళు చేసి
పచ్చ పచ్చని చేలతో పరిఢవిల్లు
నట్లొనర్చు కాళేశ్వరా! నా నమస్సు

కష్టములు పడ్డ నా తెలంగాణ రైతు
కనుల మోదభాష్పమ్ములు కానుపించు
ఈ తెలంగాణ నేల నాశీర్వదించి
నట్టి కాళేశ్వరా! నీకు నా నమస్సు

ఉప్పిడులు ఉపవాసముల్‌ ఉండబోవు
ఐదు వేళ్ళు నోటికి పోవునాళ్ళు వచ్చు
వలసపోయెడి కూలీల బ్రతుకుమారు
నట్లొనర్చు కాళేశ్వరా! నా నమస్సు

గలగలనిపారు గోదారి పొలములందు
మూడుకారులు పండునీ బీడు భూమి
నా తెలంగాణయౌను ధాన్యంపు లక్ష్మి
మమ్ముబ్రోచుకాళేశ్వరా! మా నమస్సు

అన్నమును పెట్టి రక్షించు అయ్యవీవు
త్రాగుటకు మంచినీరిచ్చు దైవమీవు
నా తెలంగాణ రక్షకా! నాగభూష !
తండ్రి! కాళేశ్వరా! నీకు దండ మిదిగో!

– డా|| తిరునగరి