అరెస్టుల్లో పోలీసుల పరిధి

By: మంగారి రాజేందర్‌ 

అరెస్టు వల్ల ఆ వ్యక్తి తలవంపులకు గురి అవుతాడు. అతని స్వేచ్ఛ నియంత్రించబడుతుంది. ఆ అరెస్టు మచ్చ, జీవితాంతం వెంటాడుతుంది. ఈ విషయం శాసనకర్తలకు తెలుసు, పోలీసులకు తెలుసు. శాసనకర్తలకి, పోలీసులకి మధ్య ఈ విషయం గురించి యుద్ధం కొనసాగుతూనే వుంది. పోలీసులు పాఠం నేర్చుకోలేదు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఈ పాఠం మిళితమైవుంది. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా, పోలీసు వ్యవస్థ వలసవాద ప్రభావం నుంచి బయటపడలేదు. వ్యక్తులను వేదనకు గురి చేయడం, అణచివేయడంలాంటి పద్ధతులకి మాత్రమే పోలీసు వ్యవస్థ పరిమిత మైంది. ప్రజలకి స్నేహితుల్లాగా ఈ వ్యవస్థ ఇంకా మారలేదు. అరెస్టు చేసే క్రమంలో వున్న అపరిమిత అధికారాల గురించి కోర్టులు చాలాసార్లు హెచ్చ రించాయి. కాని అభిలషించిన ఫలితాలు రావడం లేదు. అరెస్టు చేసే అధికారం వల్ల పోలీసుల్లో అహంకారం ప్రబలుతుంది. దీన్ని నియంత్రించడంలో మెజిస్ట్రేట్స్‌ విఫలమవుతున్నారు. అంతేకాదు ఈ అరెస్టు చేసే అధికారం వల్ల పోలీసుల్లో లంచగొండితనం విపరీతంగా పెరిగిపోతుంది. ముందు అరెస్టు చేయడం ఆ తర్వాత మిగతా దర్యాప్తు మొదలు పెట్టడం నీచమైన పని. కుటిల బుద్ధితో ఎలాంటి సున్నితత్వం లేకుండా పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

లా కమీషన్‌, పోలీసు కమీషన్‌, సుప్రీంకోర్టు ఎన్నో తీర్పుల ద్వారా వ్యక్తి స్వేచ్ఛకి సమాజ ఆర్డర్‌కి మధ్య సమతుల్యత పాటిం చాలని చెపుతూ వస్తుంది. అరెస్టు చేయడం తమ అధికారమని పోలీసులు భావిస్తున్నారు. కాగ్నిజబుల్‌ నాన్‌ బెయిలబుల్‌ నేరమైనంత మాత్రాన అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. అరెస్టు చేసే అధికారం వుండటం ఒక ఎత్తు, దానికి న్యాయబద్ధత వుండటం మరొక ఎత్తు. అరెస్టు చేయడానికి తగిన కారణాలు వున్నప్పుడు మాత్రమే అరెస్టు చేయాల్సి వుంటుంది. నేర ఆరోపణలు రాగానే అరెస్టు చేయగూడదు. కొంత దర్యాప్తు చేసిన తర్వాత ఆరోపణలో నిజం వున్నదని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే అరెస్టు చేయాల్సి వుంటుంది. చట్టం ఈ విషయం చెబుతున్నప్పటికి అరెస్టు విషయంలో పెద్దగా మార్పులు రాలేదు.

శాసన కర్తలు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 41 మార్పులు చేశారు. ఈ మార్పుల ప్రకారం ఎవరైన ముద్దాయి ఏడు సంవత్సరాలకన్న తక్కువ శిక్ష విధించడానికి అవకాశం వున్న నేరం చేసినప్పుడు లేదా, ఏడు సంవత్సరాల వరకు శిక్షని జరిమానాతో లేదా జరిమాన లేకుండా విధించే అవకాశం వున్న నేరం చేసినప్పుడు ఆ వ్యక్తులని పోలీసు అధికారి ఆ నేరం చేసినంత మాత్రాన అరెస్టు చేయడానికి వీలు లేదు. అలాంటి కేసుల్లో ఆ ముద్దాయి తిరిగి అలాంటి నేరం చేయకుండా లేదా దర్యాప్తు సక్రమంగా జరగడానికి లేదా సాక్ష్యాలని ముద్దాయి కన్పించకుండా చేయడానికి లేదా మార్చకుండా వుండడానికి లేదా, ముద్దాయిలని, సాక్ష్యులని ప్రలోభ పరచకుండా వాళ్ళు కోర్టు ముందు సాక్ష్యం చెప్పకుండా ముద్దాయి ప్రయత్నం చేసినప్పుడు లేదా ముద్దాయిని అరెస్టు చేస్తే తప్ప అతని హాజరును కోర్టు ముందు వుంచలేమని భావించినప్పుడు మాత్రమే ఆ విషయాల గురించి సంతృప్తి చెందినప్పుడు మాత్రమే అరెస్టు చేయాల్సి వుంటుంది. ఈ విషయాల గురించి నిశ్చిత అభిప్రాయాలు రావడానికి తగు కారణాలు వుండాలి. ఇలాంటి నిశ్చిత అభిప్రాయాలు రావడానికి గల కారణాలని పోలీసు అధికారి రాతపూర్వకంగా నమోదు చేసి అరెస్టు చేయాల్సి వుంటుంది. అంతే కాదు అరెస్టు చేయక పోవడానికి గల కారణాలని కూడా వ్రాత పూర్వకంగా నమోదు చేయాల్సి వుంటుంది. అరెస్టు చేయడానికన్నా ముందు పోలీసు అధికారి ఈ ప్రశ్నలు వేసుకోవాలి. అరెస్టు ఎందుకు? అరెస్టు చేయాల్సిన అవసరం వుందా? దాని వలన ఏ ఉపయోగం వుంది? ఏ ఫలితం దానివల్ల లభిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కున్న తర్వాత పైన చెప్పిన కారణాలు సంతృప్తి చెందిన తర్వాత అరెస్టు అధికారాన్ని పోలీసు అధికారి వినియోగించాలి.

అధికరణ 22(2) ప్రకారం వారెంటు లేకుండా ముద్దాయిని అరెస్టు చేసినప్పుడు అదే విధంగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ (57) ప్రకారం 24 గంటలలోపు ముద్దాయిని మెజిస్ట్రేటు ముందు హాజరు పరచాల్సి వుంటుంది. ఇది రాజ్యాంగ పరమైన హక్కు. అంతకుమించి పోలీసు కస్టడీలో వుంచుకోవాలంటే సెక్షన్‌ 167 ప్రకారం మెజిస్ట్రేటు అనుమతి అవసరం. ఈ నిర్బంధాన్ని కొనసాగించడం అనేది ఒక పవిత్రమైన విధి. దీనివల్ల వ్యక్తుల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈ విధిని నిర్వర్తించాల్సి వుంటుంది. మా అనుభవం ప్రకారం ఈ నిర్బంధాన్ని రొటీనుగా మెజిస్ట్రేట్స్‌ చేస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సెక్షన్‌ 167 ప్రకారం రిమాండ్‌ ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు ఆ వ్యక్తి అరెస్టు న్యాయబద్ధంగా జరిగిందని రాజ్యాంగ బద్ధంగా జరిగిందని మెజిస్ట్రేట్‌ సంతృప్తి చెందాల్సి వుంటుంది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 41లో పేర్కొన్న ఆవశ్యకతలని పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పాటించలేదని మెజిస్ట్రేటు భావిస్తే ఆ ముద్దాయిని నిర్బంధించాల్సిన అవసరం లేదు. అంతే కాదు, వారిని విడుదల చేయాల్సి వుంటుంది. మరో రకంగా చెప్పాలంటే ముద్దాయిని మేజిస్ట్రేటు ముందు హాజరు పరచినప్పుడు అతనిని అరెస్టు చేయడానికి గల కారణాలని పోలీసు అధికారి నిశ్చిత అభిప్రాయాలను మెజిస్ట్రేటుకు తెలియచేయాలి. వాటి గురించి మెజిస్ట్రేటు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని నిర్బంధానికి పంపించాల్సి వుంటుంది. నిర్బంధానికి పంపించే ముందు ఆ విషయం గురించి తన సంతృప్తిని సంక్షిప్తంగా మెజిస్ట్రేటు తన తీర్పును తెలియజేయాలి. నిరూపణ కాని పోలీసు స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా నిర్బంధపు ఉత్తర్వులు జారీ చేయగూడదు. ఉదాహరణకి ఆ వ్యక్తి తిరిగి అలాంటి నేరం చేయకుండా వుండటానికి లేదా సక్రమంగా దర్యాప్తు జరగడానికి, లేదా ముద్దాయి సాక్ష్యాలను తారుమారు చేయకుండా, సాక్ష్యులను ప్రలోభపెట్టకుండా వుండటానికి అరెస్టు చేశారని పోలీసులు చెప్పినపుడు అందుకు గల కారణాలని, దానికి గల ఆధారాలని పోలీసు అధికారి మేజిస్ట్రేట్‌కు సమర్పించాలి. వాటిని మెజిస్ట్రేట్‌ పరిశీలించి సంతృప్తి చెందితేనే, అదీ రాతపూర్వకంగా వ్రాసి నిర్బంధపు ఉత్తర్వులని రాయాలి.

ఎవరైనా నిందితులని పోలీసులు అరెస్టు చేసి మెజిస్ట్రేట్‌ ముందు నిర్బంధపు ఉత్తర్వుల కోసం హాజరు పరిచినప్పుడు అరెస్టు చేయడానికి గల ప్రత్యేక కారణాలని సమర్పించినా, ఒకవేళ సమర్పిస్తే అవి ప్రాథమిక దృష్టిలో చూసినప్పుడు ఆ కారణాలు సరిగ్గా ఉన్నాయని మెజిస్ట్రేట్‌ భావించినపుడు, అదే విధంగా పోలీసు అధికారి నిశ్చిత అభిప్రాయాలు సహేతుకంగా ఉన్నాయని మేజిస్ట్రేట్‌ భావించినపుడు మాత్రమే నిర్భందపు ఉత్తర్వులని మేజిస్ట్రేట్‌ రాయాల్సి వుంటుంది. ఇంతమేరకు మేజిస్ట్రేట్‌ పర్యవేక్షణ వుంటుంది.

ఈ విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు అర్నేష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ (2014)8 ఎస్‌.సి.సి. 273లో చర్చించింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో వచ్చిన సవరణలని సుప్రీంకోర్టు గమనించి ఇలా అభిప్రాయపడింది.

సె. 41 ప్రకారం ఎవరినైనా పోలీసు అధికారి మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండ అరెస్టు చేస్తే అతను ఈ సవరణల్లో పేర్కొన్న అంశాలని జాగ్రత్తగా పాటించాల్సి వుంటుంది. తెలిసీ, లేదా కావాలని పోలీసు అధికారి చేసే చర్యల వల్ల కోర్టుల మీద పని భారం పెరిగిపోతుంది. వాళ్ళు సక్రమంగా పనిచేస్తే ముందస్తు బెయిలు దరఖాస్తులు తగ్గుముఖం పడతాయి. సె. 41లో పేర్కొన్న విషయాలను కేసు డైరీలో తిరిగి రోటీన్‌గా రాయడాన్ని నిరుత్సాహపరచాలి. ఈ పరిశీలనలని ప్రతి పోలీసు అధికారి గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మెజిస్ట్రేట్స్‌ పోలీసులని పర్యవేక్షించాల్సి వుంటుంది.

అరెస్టు చేయడానికి గల కారణాలని పోలీసు అధికారి మేజిస్ట్రేట్‌కి సమర్పించాలి. వాటిని పరిశీలించి సంతృప్తి చెందినప్పుడే మెజిస్ట్రేట్‌ రిమాండ్‌ చేయాల్సి వుంటుంది. అదే విధంగా తాను సంతృప్తి చెందిన విషయాన్ని రాతపూర్వకంగా మేజిస్ట్రేట్‌ నమోదు చేయాల్సి వుంటుంది.

ఒకవేళ పోలీసు అధికారి ముద్దాయిని అరెస్టు చేయకపోతే ఆ విషయాన్ని రెండు వారాలలోగా మేజిస్ట్రేట్‌కి తెలియచేయాల్సిన బాధ్యత పోలీసు అధికారిపై వుంటుంది. ఈ రెండు వారాల సమయాన్ని జిల్లా ఎస్పీ పొడిగించవచ్చు.

ఈ ఆదేశాలను పాటించని పోలీసు అధికారుల మీద శాఖా పరమైన చర్యలని తీసుకోవచ్చు. అదే విధంగా కోర్టు ధిక్కారణ కేసుని కూడా కోర్టులు నమోదు చేయవచ్చు. 

ఇన్ని పరిమితులు వున్నప్పటికీ అరెస్టులు విపరీతంగా కొనసాగడం విషాదకరం.