ఆదర్శ రైతుగా మారిన లైబ్రేరియన్‌

By:- పి.వి. రావు

పొంగాల బాలస్వామి అందరు రైతుల్లా వరినే సాగు చేయాలనే మూస ధోరణిలో ఆలోచించలేదు. ఎప్పుడూ ఒకే తరహా పంటలు పండించి ఒడిదుడుకులు ఎదుర్కోవాలని అనుకోలేదు. భిన్నంగా ఆలోచించాడు. వినూత్న ప్రయోగాలతో విభిన్న సాగుకు ఉపక్రమించారు. బీడు భూమికి సాగుకళ తీసుకొచ్చి సిరులు పండిస్తున్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండే క్యాబేజీ, కాలిఫ్లవర్‌, చెర్రీ, టమాట, కీర దోస, క్యాప్సికమ్‌ వంటి కూరగాయలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసి అధిక దిగుబడులు పొందుతున్నారు. నెలకు రూ.50 వేల ఆదాయాన్ని ఆర్జించడమే గాక, మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం పల్లెపహాడ్‌ గ్రామానికి చెందిన పాంగాల బాలస్వామి కొంగొత్త ప్రయోగాలతో ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చదివిన పొంగాల బాలస్వామి నాలుగేళ్ల కిందటి వరకూ హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో లైబ్రేరియన్‌గా పనిచేశాడు. తన తండ్రి బాలయ్యకు పల్లెపహాడ్‌లో మొత్తం ఐదు ఎకరాల భూమి ఉంది. అందులో ఓ చోట ఉన్న మూడు ఎకరాల భూమిలో యేటా వరి సాగు చేసేవాడు. మరోచోట ఉన్న రెండెకరాలు పడావుగానే ఉంచేవాడు. కోవిడ్‌ నేపథ్యంలో ఇంటిపట్టునే ఉన్న బాలస్వామి వ్యవసాయం పట్ల ఆసక్తితో బాధ్యత తీసుకున్నాడు. వరి సాగు కాకుండా వినూత్న పంటలను ఎంచుకున్నాడు. వరి పంటనే సాగు చేస్తే కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉన్నదని ముందుగానే పసిగట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా అడుగులు వేశాడు. ఇంటి అవసరాల మేరకు ఎకరంన్నరలోనే వరిని పరిమితం చేశాడు. 

ప్రతి నెలా50 వేల ఆదాయం

ఆకుపచ్చ, ఎరుపు, పసుపు పచ్చ కాప్సికం రకాలను సాగు చేస్తున్నాడు. వారంలో రెండు రోజులు కాయలను తెంపుతుండగా తెంపిన ప్రతిసారీ 200 నుంచి 500 కిలోల వరకు దిగుబడి వస్తున్నది. ముందుగానే ఒప్పందం కుదుర్చుకోవడంతో పలు కంపెనీలు బాలస్వామి పాలీహౌస్‌ దగ్గరకే వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నాయి. దెబ్బతిన్న కాయలను ప్రాసెసింగ్‌కు పంపిస్తున్నారు. కిలోకు రూ.40 లెక్కన ఆయా కంపెనీలు చెల్లిస్తున్నాయి. క్యాప్సికం పంటపై ప్రతి సీజన్‌కూ ఆరు లక్షలకు పైగా ఆదాయం వస్తున్నది. పెట్టుబడుల ఖర్చులుపోను రూ.3 లక్షల వరకు మిగులుబాటు అవుతున్నది. నెలకు రూ.50 వేల వరకు ఆదాయం పొందుతుండడమే కాకుండా మరో రెండు కుటుంబాలకు ఉపాధి చూపించగల్గుతున్నానని బాలస్వామి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. డిమాండ్‌ను బట్టే వ్యవసా యం చేయాలి.. డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలి. పాలీహౌస్‌లో ఏడాది పొడవునా పంటలను సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు రాయితీలు ఇస్తుండడం కూడా నాకు కలిసొచ్చింది. త్వరలోనే డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా క్షేత్రం ఓ ప్రదర్శన శాలగా మారింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దత్తత గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులను సైతం అధికారులు నా క్షేత్రానికి తీసుకొచ్చి అవగాహన కల్పించారు.

బీడును సాగు భూమిగా మార్చి

‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని ఊరికే అనలేదు పెద్దలు. పరిష్కార మార్గాలు అన్వేషిస్తే ఎటువంటి భూమిలోనైనా పంటలు పండించవచ్చని భావించి పనులు మొదలుపెట్టాడు. రాళ్లురప్పలతో ఉన్న రెండెకరాల్లో ఎర్ర మట్టిని పోయించి సాగుకు అనుకూలంగా మార్చాడు. చుట్టుపక్కల బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి ఉండడంతో.. అరకిలో మీటరు దూరంలోని తమ వ్యవసాయ భూమిలో ఉన్న బోరు నుంచి పైపులైన్‌ ద్వారా నీరు పారేలా ఏర్పాట్లు చేశాడు. సంపు ఏర్పాటుచేసి అందులో నిల్వచేసుకుని పంటలకు నీరందించేలా చూడడంతో నేడు బంగారం లాంటి పంటలను పండించుకుంటున్నాడు బాలస్వామి.

పంట మార్పిడితో ఏడాది పొడవునా ఆదాయం..

అర ఎకరానికి ఒక పాలీహౌస్‌ను ఏర్పాటు చేసుకుని అందులో యేటా పంట మార్పిడి చేస్తున్నాడు. ఒక్కో యూనిట్‌ ధర రూ.16.50 లక్షలు కాగా.. రెండు యూనిట్లను ప్రభుత్వం 95 శాతం సబ్సిడీపై అందజేసింది. నీరందించేందుకు డ్రిప్‌ను సైతం మంజూరు చేసింది. ఈ పద్ధతిన రోజుకు 2 వేల లీటర్లకు మించి నీటి అవసరం పడడం లేదు. రెండేండ్లుగా కీరదోస, చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్‌ వంటి పంటలను సాగు చేసిన బాలరాజు.. ఈ ఏడాది ఒక పాలీహౌస్‌లో కాప్సికం, మరో హౌస్‌లో మిర్చి సాగు చేస్తున్నాడు. ఏడాది పొడవునా ఆదాయం ఉండేలా యేటా రెండు పంటలను సాగు చేస్తున్నానని బాలస్వామి చెప్తున్నాడు. ఓ పంట సాగు పూర్తయ్యేనాటికి మరో పంట చేతికొచ్చేలా సాగును చేపడుతున్నాడు.

రైతన్న బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రైతులు అందిపుచ్చుకొని,  విభిన్న ఆలోచనలు, దృక్పథంతో ఆదాయం ఒనగూరే పంటలతో తలెత్తుకుని ధీమాగా, స్వాభిమానంతో బతకడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. దీనిని రైతులందరూ గమనించి ముందుకు సాగాలి….