| |

రాష్ట్రంలో ఇక విద్యుత్‌ వెలుగులు

రాష్ట్రంలో-ఇక-విద్యుత్‌-వెలుగులురాష్ట్రంలో 2018 నాటికి 24వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని, థర్మల్‌, హైడల్‌, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా ఈ లక్ష్యం సాధించేందుకు ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. 2017 నాటికే మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా అవతరించనున్నదన్నారు.

మార్చి 28న భద్రాచలంలో శ్రీ సీతారామ కల్యాణోత్సవాలలో పాల్గొన్న అనంతరం పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి ముఖ్యమంత్రి విచ్చేశారు. రామానుజవరం గ్రామం వద్ద 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బి.టి.పి.ఎస్‌)కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భూమిపూజ చేశారు. దీని అంచనా విలువ రూ.7290.60 కోట్లు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మూడేళ్లలో రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధిస్తామన్నారు. గత రెండు దశాబ్దాలుగా పరీక్షల సమయంలో విద్యార్థులు విద్యుత్‌ కోత సమస్య ఎదుర్కొన్నారని, ఇప్పుడు తొలిసారిగా విద్యుత్‌ కోతలు లేకుండా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని సీఎం చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో పరిశ్రమలు నడపలేమని, విద్యుత్‌ కోతలు తగ్గించాలని ఆందోళనలు జరిగాయని గుర్తుచేస్తూ, ప్రస్తుతం కొత్త రాష్ట్రంలో ఎలాంటి కోతలు లేకుండా పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.

విద్యుత్‌ ప్రాజెక్టులపై 91,500 కోట్ల రూపాయలు వ్యయపరచి, వచ్చే నాలుగేళ్లలో 24వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి తెస్తామని సి.ఎం. చెప్పారు.

భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేసి, తానే స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం కూడా చేస్తానని కె.సి.ఆర్‌ అన్నారు. ఈ పవర్‌ ప్రాజెక్టు రాష్ట్రాన్ని విద్యుత్‌ కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని, తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.ఈ సంవత్సరం ముగింపు వరకు బి.హెచ్‌.ఇ.ఎల్‌ ఆధ్వర్యంలో రెండు పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాబోతున్నదని సి.ఎం చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ వద్ద సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ రాబోతుందని, కొత్తగూడెంలో అదనంగా 800 మెగావాట్లు, భూపాలపల్లిలో 600మెగావాట్ల విద్యుత్‌ వస్తుందన్నారు. దేశంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, ఐటి రంగ పెట్టుబడిదారులకు మణుగూరు వేదికగా పిలుపునిస్తున్నా.. మీరు సంతోషంగా రండి.. అని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. విద్యుత్‌ శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భద్రాద్రిని అభివృద్ధి చేస్తాం

భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం ప్రపంచఖ్యాతిగాంచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. పర్ణశాల, భద్రాచలం, గోదావరి అందాలను ఒక ప్యాకేజీగా అభివృద్ధి చేయాలని స్థానిక అధికారులు, మంత్రులతో కలిసి నిర్ణయించినట్టు సి.ఎం.తెలిపారు. త్వరలో జరిపే ఖమ్మం జిల్లా పర్యటనను భద్రాచలం నుంచే ప్రారంభిస్తామన్నారు.