ప్రాచ్య విద్యలకు ఊపిరి పోసిన మహామనీషి

kappagantula-laxmanasastryతిగుళ్ల అరుణకుమారి

తెలంగాణలో మినుకు మినుకుమంటూ కొట్టుమిట్టాడిన తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, మరాఠీ, హిందీ వంటి ప్రాచ్య విద్యలకు ఊపిరి పోసిన మహనీయుడు కప్పగంతుల లక్ష్మణశాస్త్రి. ఈ మహామనీషి 1911లో మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పద్మావతమ్మ, వేంకటేశ్వర శాస్త్రి. లక్ష్మణశాస్త్రి గారి విద్యాభ్యాసం అంతా సంప్రదాయబద్ధంగానే జరిగింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంస్కృత కళాశాలలో గురుకులవాసం చేసి సాహిత్య శిరోమణులయ్యారు. చెన్నైలోని మైలాపూరు సంస్కృత కళాశాలలో వేదాంత శాస్త్రాన్నీ, అన్నామలై విశ్వవిద్యాలయంలో వ్యాకరణశాస్త్రాన్నీ అధ్యయనం చేశారు.

పులిసి కృష్ణమాచార్యులు, లక్ష్మీనరసింహశాస్త్రి, కరింగళం కృష్ణశాస్త్రివంటి దిగ్దంతులైన పండితుల దగ్గర అంతేవాసిగా లక్ష్మణశాస్త్రి సంస్కృత విద్యలో నిష్ణాతులయ్యారు. ఆ తరువాత స్వయం కృషితో ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మరాఠీ భాషలలో ప్రావీణ్యాన్నీ, వైదుష్యాన్నీ సంపాదించి అష్టభాషాకో విదులయ్యారు. తెలుగు, సంస్కృతం, హిందీ భాషలలో అనర్గళంగా చతురోక్తులతో ఉపన్యసించడంలో ఆయన దిట్ట.

లక్ష్మణశాస్త్రి ఆసేతుశీతాచలం ఎన్నో ప్రాచ్య విద్యాసంస్థలను దర్శించి, శాస్త్రవిద్యల అధ్యయనం, పరిరక్షణ, వికాసాలకోసం ఎనలేని కృషి చేశారు. తెలంగాణ ప్రాంతంలో అప్పటికే దీనావస్థలో ఉన్న ప్రాత్యవిద్యల వికాసంకోసం అహరహం కృషి చేశారు. భాషా కళాశాలలు, పరిశోధన సంస్థల స్థాపన, వికాసాలకోసం ఎన్నో ప్రణాళికలను రచించారు. హైదరాబాదులోని వివేకవర్థనీ పాఠశాలలో ఉపాధ్యాయుడుగానూ, వనపర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితునిగాను పనిచేసి, ఎందరో విద్యార్థులను విద్వాంసులుగా తీర్చిదిద్దారు. సాయంకాలవేళలో విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యాప్రవీణ, భాషాప్రవీణ వంటి పరీక్షలను వ్రాయించి, తెలుగు, సంస్కృత సాహిత్యాలలో నిష్ణాతులుగా చేశారు. శాస్త్రవిద్యల పట్ల ఆకర్షితులను చేశారు. హైదరాబాదు సిటీకాలేజీలో తెలుగు పండితునిగా ఎందరో విద్యార్థులనీ భాషాకోవిదులుగా తీర్చిదిద్దారు. 1948లో ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖలో అసిస్టెంటు డైరెక్టరుగా ప్రవేశించిన శాస్త్రి బహుభాషా పరిమళాలను వ్యాపింపజేసే కృషి చేశారు. భిన్న సంస్కృతులకూ, విభిన్న భాషలకూ నెలవైన హైదారబాదు నగరాన్ని ఏకత్వదిశగా సాంస్కృతిక రంగంలో వెలుగొందే విధంగా తన వైదుష్యాన్ని పంచిపెట్టారు. గౌలీగూడాలోని బాల సరస్వతీ గ్రంథాలయ విస్తృతికి పాటు పడ్డారు. సుల్తాను బజారులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వికాసానికి దోహదంచేశారు. తెలంగాణ సారస్వత పరిషత్తు సాహిత్యోద్యమాలలో పాల్గొన్నారు. తెలుగు పరీక్షలను నిర్వహంపజేసి, తెలుగు భాషా వికాసానికి దారులు వేశారు. తెలంగాణలో ఊరూరా పర్యటించి, తెలుగు భాషా వ్యాప్తికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు, సంస్కృతం, హిందీ. భాషలలో విజ్ఞానకోశాలకు విరివిగా వ్యాసాలను రచించి విజ్ఞానవ్యాప్తికి అమోఘయోగదానం చేశారు. ప్రాచ్యవిద్యా సదస్సులలో ప్రాచ్యభాషల అభ్యున్నతికోసం ఎన్నో తీర్మానాలు చేయించారు. సంస్కృత భాషకు ప్రత్యేకాధి కారిగా, విద్యాశాఖలో డిప్యూటీ డైరెక్టరుగా ప్రభుత్వ భాషా సంస్థలకూ, విద్యాలయాలకూ మార్గనిర్దేశం చేసి, భాషాసాహి త్యాల పరిరక్షణలో విశేషకృషి చేశారు. నల్లకుంటలోని ఖండవల్లి లక్షీరంజనం ప్రభుత్వ ప్రాచ్యకళాశాలలో ఉచితంగా విద్యాబోధన చేసి, ఎందరో విద్యార్థులను భాషాపండితులుగా తీర్చిదిద్దారు.

లక్ష్మణశాస్త్రి సాహిత్య సృష్టిలోనూ అందె వేసిన వారే. విద్వత్కవిశేఖరుడైన మానవల్లి రామకృష్ణకవి ప్రేరణతో మహాకవి బిల్హణుని కృతి ‘విక్రమాంక దేవచరితం’ అనే మహాకావ్యాన్ని మిత్రుడు మాదిరాజు విశ్వనాథరావుతో కలిసి తెలుగు ప్రబంధంగా అనువదించి, విద్వాంసుల మెప్పు పొందారు. బిల్హణుని మరొక కృతి కర్ణసుందరీ నాటకాన్నికూడా ఈ జంట కవులు విరచిం చడం విశేషం.

లక్ష్మణశాస్త్రి జీవితకృషి వ్యాసభారత వచనానువాదం. 1960లో ప్రారంభమైన ఈ బృహద్రచనాకార్యం 1980 దాక రెండు దశాబ్ధాలు కొనసాగింది. ఆనాటి సమాచార, పౌర సంబంధాలశాఖ మాస పత్రిక ‘ఆంధ్రప్రదేశ్‌’లో ఈ భారతవ చనానువాదం ధారావాహికగా కొనసాగా అశేష పాఠకుల అభిమనాన్ని చూరగొ న్నది. శాస్త్రీయ విజ్ఞానకోశానికి సంపా దకత్వం వహించిన లక్ష్మణశాస్త్రి శాస్త్ర విజ్ఞానదీధితులను విశ్వవ్యాప్తం చేశారు.

సాహిత్య అకాడమీ పక్షాన ‘ తెలుగు సంస్కృత నిఘంటు ‘ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన శాస్త్రి భౌద్ధమతానికి సంబంధించిన తామ్రపత్రాలలోని జఠిలమైన అంశాలను పరిష్కరిస్తూ ‘గ్లింప్స్‌ ఆఫ్‌ బుద్ధిస్మ్‌’అనే ఆంగ్ల గ్రంథాన్ని ‘ బౌద్ధ దర్శనం ‘ పేరుతో అనువదించి, తన వైదుష్యాన్ని చాటు కొన్నారు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్యగ్రంథాలను రచించారు. ‘బదరీ శతకమ్‌’ అనే సంస్కృత స్తోత్రాన్ని రచించారు. సూర్యగ్రహణ విజ్ఞానాన్ని విశదపరిచే ‘ సూర్యోపరాగ దర్పణం ‘ అనే గ్రంథాన్ని రాశారు. ప్రాచ్య కళాశాలలను డిగ్రీ కళాశాలలతో సమానంగా ప్రతిపత్తిని కలిగిస్తూ, ప్రాచ్యకళాశాలలలోని పండితులకు యూజీసీ వేతానాలను ఇప్పించడంలో సఫలమైన పాత్రను నిర్వహించారు..

ఇలా ప్రాచ్య విద్యా వికాసంలో లక్ష్మణశాస్త్రి నిర్వహించిన పాత్ర అమోఘం. తెలంగాణలో కవి పండితులే లేరని గేలిచేసిన ఆంధ్ర పండితులకు లక్ష్మణశాస్త్రి జీవితం తిరుగులేని సమాధానంగా నిలుస్తుంది. తెలంగాణ జాతి రత్నం కప్పగంతుల లక్ష్మణశాస్త్రి చిరస్మరణీయుడు.