ప్రకృతి ప్రకోపం

ప్రకృతి కరుణిస్తే వరం, ప్రకోపిస్తే దారుణం.ఈసారి వర్షపాతం అసాధారణంగా కురిసింది. దాంతో సంభవించిన ప్రకృతి విపత్తుతో భద్రాచల పరిసర ప్రాంతాలన్నీ జలమయమై పోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. అల్పపీడన ప్రభావంతో నిరంతరంగా కురిసిన వర్షాల వల్ల కలిగిన ఇబ్బందులను సమర్ధంగా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని సమాయత్తపరుస్తూ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు జారీ చేస్తూ నిర్విరామ సమీక్షలు నిర్వహించి,భారీ నష్ట నివారణను అధిగమించగలిగారు. కేవలం సమీక్షలే కాకుండా వరద ప్రాంతాలలో ఏరియల్‌ సర్వే నిర్వహించి, ఆయా ప్రాంతాలలో కాలినడకన పర్యటించి వరద బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి బాధితుల్లో భరోసాను నింపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి అధికారులను  ఆదేశించారు నిధులు ఎక్కువ ఖర్చయినా సరే.. నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. 

ఓ వైపు ఉద్వేగం మరో వైపు మధురోత్సాహం, ఇది దైవ సంకల్పమేనేమో అనిపిస్తుంది. 

మన దేశం దాస్య శృంఖలాలను తెంచుకుని, స్వేఛ్చా వాయువులు పీల్చుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణం ముంగిట వున్నాం మనమందరం. గత సంవత్సర కాలంగా వివిధ కార్యక్రమాలను రూపొందించుకుని ‘స్వాతంత్య్ర వజ్రోత్సవ’ వేడుకలను దేశం యావత్తు నిర్వహిస్తూ వచ్చింది. ఆ సంరంభాల పరిసమాప్త వేళ యిది. తమ ప్రాణాలు తృణప్రాయం అని తలచి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల ఖ్యాతి ఈనాటి యువతరానికి అవగతమయ్యేలా, ప్రతి పౌరుడి మదిలో  దేశభక్తి ఇనుమడించేలా పలు కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 

దీన్ని ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ గా పేర్కొంటూ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు వారం రోజులు, ఆ తర్వాత వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా , గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, ప్రతి పౌరుడి హృదిలో ‘వజ్రోత్సవ భారత’ మనే  దేశభక్తి ద్విగుణీకృతం అయ్యేలా  జాతీయ భావాలను రగిలించే అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం ముదావహం.

యావత్‌ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం పరిఢవిల్లుతున్నది. భారత స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత మహిమాన్వితంగా రూపొందించుకోవాల్సిన అవసరం వున్నది. ఆనాడు వారు పొందుపరిచిన ప్రజాస్వామిక, లౌకిక, సమాఖ్యవాద విలువలను కాపాడవల్సిన బాధ్యత ప్రతి భారత వాసి మీద వున్నది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాల్లో పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పదిహేను రోజుల పాటు నిర్వహించే రోజువారీ కార్యక్రమాలను రూపొందించుకునేందుకు, తగు విధి విధానాలను రూపకల్పన చేయడం కోసం ప్రత్యేక కమిటీని కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు.