కూరగాయల సాగుతో లాభాల పంటల

  • వరికి ప్రత్యామ్నాయంగా .. కూరగాయల సాగు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రంలో సేద్యానికి పెద్దపీట వేశారు. ఫలితంగా రైతులు విరివిగా వరిపంటలను సాగు చేశారు. దీనితో వరిధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఈ క్రమంలో వరికి ప్రత్నామ్యాయంగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుతో రైతులు అధిక లాభాలు వచ్చే పంటలను పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో పల్మారి రమేష్‌ అనే రైతు 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు పండిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. బూరుగుపల్లిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఇతర రైతుల్లా వరి, పత్తి కాకుండా కూరగాయల సాగును ఎంపిక చేసుకున్నాడు. రెండున్నర ఎకరాల్లో బీర, ఒకటిన్నర ఎకరంలో టమాటా, ఎకరం భూమిలో కాకరకాయలు, చిక్కుడు, మిర్చి సాగు చేశాడు. మొదటి ఆరు నెలల్లో బీరకాయల ద్వారా రూ. 3 లక్షల 50 వేలు, టమాటా ద్వారా రూ. 2 లక్షల 50 వేలు, కాకర ద్వారా రూ. 50 వేలు, చిక్కుడు ద్వారా రూ.10 వేలు లాభం పొందాడు. ప్రస్తుతం మరో రెండు ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నాడు.

మొత్తంగా తొలి ఆరు నెలల్లో దాదాపు రూ. 6 లక్షల 50 వేల ఆదాయం వచ్చిందని రైతు రమేష్‌ తెలిపాడు. కౌలు భూమిలో సాగు చేస్తున్నందుకు రమేష్‌ కు పెట్టుబడి కూడా ఎక్కువగానే అయింది. కూరగాయల సాగు తొలిసారి కాబట్టి భూమిని చదును చేయించేందుకు రూ. 45 వేలు, మొక్కలకు నీరు అందించేందుకు డ్రిప్‌ కోసం రూ.1.50 లక్షలు వెచ్చించాడు. పెట్టుబడి విషయానికి మల్చింగ్‌ కోసం రూ.60 వేలు, కర్రల కోసం రూ.50 వేలు, దారాల కోసం రూ.15 వేలు, కూరగాయల విత్తనాలకు రూ. 30 వేలు ఖర్చు చేశాడు. మొత్తంగా అన్ని పెట్టు బడులు పోను రైతు రూ.3 లక్షల లాభం పొందాడు. ఇటీవల కాలంలో టమాట ధర పెరగడంతో మంచి లాభం వచ్చిందని రమేష్‌ తెలిపాడు. ఇప్పటికే టమాటా పంటను 4 కటింగ్‌లు చేశానని, ఇంకా 5 కటింగ్‌లు వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. వరి కంటే కూరగాయల సాగుతో మంచి లాభాలు సాధించవచ్చని రమేష్‌ చెబుతున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూరగాయల పంటలు నష్టం వచ్చే అవకాశం లేదని తెలిపాడు. ఎకరం భూమిలో టమాటా సాగు చేస్తే 3 వేల బాక్సులు (ఒక్కో బాక్స్‌కు 25 కిలోలు) వస్తాయని అన్నాడు. కనీసం రెండు వేల బాక్సులు వచ్చిన రూ. 4 లక్షలు లాభం వస్తుందని తెలిపారు. ఖర్చులు రూ.1.50 లక్షలు పోయిన రూ. 2.50 లక్షలు లాభం మిగులుతుందని తెలిపాడు. వరిసాగు చేస్తే ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల వడ్లు మాత్రమే వస్తాయని, ఖర్చులు దాదాపు రూ.25 వేలు దాకా అవుతుందని, లాభం తగ్గు తుందని రమేష్‌ తెలిపాడు. వరి కోసింది మొదలు పంట డబ్బులు చేతికి వచ్చేదాక రైతులు తిప్పలు పడాల్సిందేనని, అదే కూరగాయలను సాగు చేస్తే మార్కెట్‌కు తీసుకువెళ్లి అమ్మ గానే అక్కడికక్కడే డబ్బులు వస్తాయని రమేష్‌ అంటున్నాడు.

రైతును అభినందించిన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌
వరికి బదులు ప్రత్యామ్నాయంగా కూరగాయలు సాగు చేస్తున్న పలుమారి రమేష్‌ పంట క్షేత్రాన్ని కలెక్టర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ సందర్శించారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నా యంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించేందుకు బూరుగుపల్లి వెళ్ళిన కలెక్టర్‌, రమేష్‌ చేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించి వివ రాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయంగా కూరగాయలు సాగు చేసి లాభాల పంటలు తీస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రమేష్‌ను కలెక్టర్‌ అభినందించారు. ఇతర పంటల సాగుపై గ్రామాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో రమేష్‌ లాంటి రైతులను ఆదర్శంగా చూపాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.