ప్రగతి మాసం..
By: రమేశ్ హజారీ
జూలై 23: హుజురాబాద్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండా శ్రీనివాస్ ను ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్‌గా సీఎం కేసీఆర్ నియమించారు.

– నేటి నుంచి టోక్యో ఓలంపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. విశ్వ క్రీడల్లో దేశం తరఫున పాల్గొంటున్న క్రీడాకారులు విజయాలు సాధించి పలు పతకాలు అందుకోవాలని, భారతదేశ కీర్తి పతాకను విశ్వ క్రీడా వేదిక మీద ఎగురవేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
జూలై 24: కాళ్లు రెక్కలే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలకే మొదటి ప్రాధాన్యతనిచ్చి, దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం లక్ష కోట్లవరకైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్ అభినందన సభ ప్రగతి భవన్లో జరిగింది. ఈ సందర్భంగా దళిత బంధు పైలట్ ప్రాజెక్టును హుజురాబాద్ లో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జూలై 25: రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నాటి కాకతీయ రాజులు తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా సంపద దేశంలో ప్రత్యేకమైనదన్నారు. తెలంగాణ చారిత్రక వైభవ పునరుజ్జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
జూలై 26: తెలంగాణ దళిత బంధు అవగాహన సదస్సు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టు హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి 527 మంది ప్రతినిధులు, రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రతినిధులను పేరుపేరున సీఎం పలకరించారు. దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తే తాము ఎమేమీ పనులు చేసుకోగలమో సదస్సులో పాల్గొన్న వారు వివరించారు. దళితుల జీవన స్థితిగతులు, వారి ఆలోచనా దృక్పథం ఎంత గొప్పగా వుంటుందో తెలుసుకున్న ముఖ్యమంత్రికి దళిత బంధు పథకం అమలు విజయవంతం అవుతుందనే విశ్వాసం మరింతగా కలిగింది. ఈ సందర్భంగా దళితులు ఏ విధంగా ఆర్థిక, సామాజిక వివక్షతలను అధిగమించి ప్రగతి పథంలో అందరితో సమానంగా కలిసి నడవొచ్చో సిఎం వివరించారు. పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా దళితుల పురోగాభివృద్ధికి బాటలు పడుతాయని సీఎం అన్నారు. అందుకు ప్రతి ఒక్క దళితబిడ్డ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. రోజంతా సాగిన సదస్సు సాయంత్రం ముగిసింది.
జూలై 28: నేడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె జయంతి. ఈ సందర్భంగా కవిగా సినీగేయ రచయితగా పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించిన సినారె గొప్పతనాన్ని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు.
జూలై 30: ‘దళిత బాంధవుడు’ సీఎం కేసీఆర్ వెంటే దళిత జాతి ఉంటుందని తెలంగాణ ఎంఆర్పీఎస్ ప్రకటించింది. దళిత జాతి ఆర్థిక సామాజిక వివక్షనుంచి విముక్తులను చేసి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అభినవ అంబేడ్కర్ సీఎం కేసీఆర్ అని తెలంగాణ ఎంఆర్పిఎస్ ప్రకటించింది. దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించినందుకు ప్రగతి భవన్లో సంఘం నాయకులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, మేడి పాపయ్య మాదిగలు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఆగస్టు 01 : రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, వ్యవసాయం, వైద్యం, సంక్షేమం, విద్య తదితర అంశాలకు సంబంధించి చర్చించిన కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. దళిత బంధు అమలు, విధి విధానాల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రతి జిల్లాలో సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నది. దళిత వాడల్లో యుద్ద ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలని, గొర్రెల యూనిట్ ధరను పెంపు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. 50 వేల రుపాయల రుణ మాఫీకి నిర్ణయం. ఇడబ్ల్యుఎస్ 10 శాతం రిజర్వేషన్ కోటా అమలు, 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు శంకుస్థాపన చేయాలి. వాటిని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)గా నామకరణం చేయాలి. 7 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలి. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను ఆదుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అనాథ శరణాలయాలపై చర్చించిన కేబినెట్, కార్యాచరణకై మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన సబ్ కమిటీ ఎర్పాటు చేసింది. కరోనా కట్టడి చేయాలని వైద్య శాఖకు ఆదేశం. రైతు బీమా టైపులో నేత-గీత కార్మికులకు బీమా. లాభసాటి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం, పత్తి సాగు పెంచాలని నిర్ణయం. నల్గొండ జిల్లా ఉదయ సముద్రం, ఎస్ఎల్బీసి సొరంగ మార్గం పనులను పునఃప్రారంభించాలని నిర్ణయం.
ఆగస్టు 2 : నల్లగొండ జిల్లా ఆలేరులో నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమిక్షా సమావేశం, బహిరంగ సభలో పాల్గొన్నారు.
– టోక్యో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించిన పివీ సింధుకు అభినందనలు తెలిపారు.
ఆగస్టు 4 : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిని సందర్శించి, సుమారు మూడు గంటల పాటు దళిత వాడల్లో పర్యటించారు. దళిత బంధు డబ్బులు వస్తే ఏం చేద్దామనుకుంటున్నారని ఆరా తీశారు. సహపంక్తి భోజనం చేశారు.
– టోక్యో ఒలంపిక్స్ లో హాకి, బాక్సింగ్ కేటగిరిల్లో కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు.
– వాసాలమర్రి దళితులందరికి దళిత బంధు అమలు కోసం 7.6 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
ఆగస్టు 05 : టోక్యో ఒలంపిక్స్‌లో కుస్తీ పోటిలో సిల్వర్ మెడల్ సాధించిన రవి కుమార్ దహియాను అభినందించారు.
– నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ చేసిన సేవలను, తెలంగాణ రాష్ట్రం స్వాప్నికుడుగా ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన నేపథ్యాన్ని సీఎం స్మరించుకున్నారు. తెలంగాణ జన హృదయాల్లో ఫ్రొఫెసర్ జయశంకర్ సదా నిలిచి వుంటారని సీఎం తెలిపారు.
ఆగస్టు 6 : కృష్ణా గోదావరి బోర్డుల పరిధి నిర్ణయమైన నేపథ్యంలో, కృష్ణా నదీ జలాల్లో న్యాయమైన వాటా దక్కించుకోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్లో అత్యున్నత సమావేశం జరిగింది. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వం వెనకడుగు వేయబోదని సీఎం స్పష్టం చేశారు.
ఆగస్టు 7 : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి అభివృద్ధి పరుస్తున్నదన్నారు.
– టోక్యో ఒలంపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాను అభినందించారు.
– సచివాలయ నిర్మాణ పురోగతి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. సచివాలయం చుట్టూ కాలినడకన కలియతిరిగి పలు సూచనలు చేశారు. త్వరితగతిన సచివాలయం నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.
ఆగస్టు 9 : హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకై రూ.500 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
– ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలకు, కల్మషం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలని, వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.
ఆగస్టు 11 : హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమం లో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం ప్రకటించారు.
ఆగస్టు 12 : నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
– తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత వ్యవహరాల పై తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలని, బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్ ద్వారా కెసి కాలువకు నీటిని తరలించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని, తుంగభద్ర జలాలకు అదనంగా కెసి కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలించడం అక్రమమని లేఖలో పేర్కొన్నారు. కేటాయింపులు లేని అక్రమ లిఫ్ట్‌ల ద్వారా తన పరిమితికి మించి ఎపీ నీటిని ఎత్తి పోసుకుంటున్నదని, ట్రిబ్యునల్ ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే దాకా ఈ లిఫ్ట్‌ల ద్వారా నీటి కేటాయింపులను కెఆర్ఎంబీ నిరోధించాలని లేఖలో పేర్కొన్నారు.
– సీఎం ఆదేశాలకనుగుణంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్లు మార్పు చేస్తూ ప్రభుత్వం జీ.వో జారీ చేసింది.

ఆగస్టు 15 : భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్మృతి చిహ్నం వద్దకు వెళ్ళి నివాళులు అర్పించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దళిత బహుజన సబ్బండ వర్గాల అభ్యున్నతికోసం తెలంగాణ ప్రభుత్వం విరామమెరుగకుండా కృషి కొనసాగిస్తూనే వుంటుందని తెలిపారు.
ఆగస్టు 16 : దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సిఎస్ సోమేశ్‌కుమార్ సహా ఉన్నతాధికారులు, దళిత నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం, దళిత జనోద్ధరణ దిశగా ప్రభుత్వ చర్యలను వివరిస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం.. సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. దేశ దళిత జాతి విముక్తి దిశగా హుజూరాబాద్ ముందడుగు వేయబోతున్నదని సీఎం ప్రకటించారు. అందుకు పట్టు బట్టి పనిచేయాలని దళిత మేధావులు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆగస్టు 18 : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి మృతిచెందారు. ఈ సందర్భంగా గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ, గవర్నర్ తల్లి మరణం పట్ల సీఎం సంతాపం వ్యక్తం చేశారు.
ఆగస్టు 19 : ‘‘మొహర్రం’’ త్యాగానికి మానవీయ కోణానికి చిహ్నమని తెలిపారు. అంకితభావం, త్యాగాల స్మరణ ద్వారా మానవ జీవితంలోని నిజమైన స్ఫూర్తిని, మొహర్రం’ చాటుతుందని తెలిపారు.
ఆగస్టు 20 : సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణకు హరిత హారం స్ఫూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా, సీడ్ బాల్స్‌ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, సీడ్ బాల్స్‌తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు’’ జ్ఞాపికను ప్రగతిభవన్‌లో సీఎం చేతులమీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్లు అందు కున్నారు. వారి కృషిని సీఎం అభినందించారు.
ఆగస్టు 22 : రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ములకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భంగా సీఎం తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సీఎం ఆకాంక్షించారు.